ఆపరేషన్ ఈగిల్ క్లా మరిచిపోయారా?.. ట్రంప్ వార్నింగ్‌కు ఇరాన్ కౌంటర్ మామూలుగా లేదుగా?..
Publish Date:Apr 6, 2026
Advertisement
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ గట్టిగా కౌంటర్ ఇస్తోంది. తాజాగా హార్ముజ్ జలసంధిని తక్షణమే తెరవకుంటే ఇరాన్ వంతెనలు, పవర్ ప్లాంట్లను బాంబులతో లేపేస్తాం, ఆ దేశానికి నరకం చూపిస్తామంటూ అగ్రదేశాధినేత ట్రంప్ సోషల్ మీడియా ద్వారా చేసిన హెచ్చరికకు.. ఇరాన్ అమెరికాకు దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చింది. చరిత్రలో అమెరికాకు తగిలిన అతిపెద్ద మిలిటరీ సెట్ బ్యాక్ ను గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. చరిత్ర పునరావృతమవుతుంది అని పేర్కొంటూ.. 1980లో అమెరికా ఎదుర్కొన్న ఘోర పరాజయాన్ని ఆ పోస్టులో ఇరాన్ పేర్కొంది. ఇంతకీ ఆ పరాజయం ఏమిటంటే.. 1979లో ఇరాన్ విప్లవం తర్వాత టెహ్రాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై దాడి చేసిన విద్యార్థులు, మొత్తం 52 మంది అమెరికన్లను బందీలుగా పట్టుకున్నారు. వారిని విడిపించేందుకు అప్పటి అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ 1980 ఏప్రిల్ 24న ఆపరేషన్ ఈగిల్ క్లా పేరుతో సైనిక చర్య చేపట్టారు. అత్యంత నిపుణులైన కమాండోలు, ఆధునిక హెలికాప్టర్లతో ఈ ఆపరేషన్ ప్రారంభమైంది. అయితే, ప్రకృతి వైపరీత్యాలు, సాంకేతిక సమస్యల వల్ల ఆ ఆపరేషన్ ఘోరంగా విఫలం కావడమే కాకుండా, పెను విషాదంగా కూడా మారింది. అప్పట్లో ఇరాన్ ఎడారిలో ఊహించని రీతిలో చెలరేగిన ఇసుక తుపాను కారణంగా హెలికాప్టర్ల విజిబిలిటి దెబ్బతింది. దీంతో మిషన్‌ను రద్దు చేసుకున్న అమెరికా ఆ సందర్భంగా 8 మంది అమెరికా సైనికులను పోగొట్టుకుంది. సహచరుల మృతదేహాలను, కీలక పత్రాలను సైతం వదిలేసి అమెరికన్ సైనికులు పలాయనమంత్రం జపించారు. ఆపరేషన్ ఈగిల్ క్లా వైఫల్యం అప్పట్లో అగ్రరాజ్యం పరువును నిలువునా తీసేసింది. ఇప్పుడు ఇరాన్ ట్రంప్ వాచాలతకు బదులుగా.. నాటి అమెరికా ఘోర పరాభవాన్ని గుర్తు చేస్తూ చేసిన పోస్టు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెగ వైరల్ అవుతోంది.
http://www.teluguone.com/news/content/iran-mind-blowing-counter-to-trump-warning-36-216748.html





