ఇరాన్‌లో యూఎస్ పైలట్‌ని రక్షించిన దళాలు...ట్రంప్ హర్షం
Publish Date:Apr 5, 2026
Advertisement
శత్రువు భూభాగంలోకి వెళ్లి తమ పైలట్‌ను రక్షించుకుని చరిత్ర సృష్టించామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ .. యుద్దం గెలిచినట్లే సంబరపడిపోతున్నారు. ఇరాన్‌లో చిక్కుకుపోయిన రెండో పైలట్‌ను అమెరికా దళాలు రక్షించాయని ట్రంప్ ప్రకటించారు. ఇటీవల అమెరికాకు చెందిన యుద్ధ విమానం 'ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్' ఇరాన్ భూభాగంపై కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రెండో పైలట్ ఇరాన్‌లో చిక్కుకుపోయాడు. అతడిని పట్టుకునేందుకు ఒకవైపు ఇరాన్ దళాలు, మరోవైపు అమెరికా సైన్యం తీవ్రంగా శ్రమించాయి. దేశ చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్‌ను అమెరికా సైన్యం నిర్వహించి, పైలట్‌ను కాపాడిందని ట్రంప్ తెలిపారు. ప్రస్తుతం ఆ పైలట్ అమెరికా సైన్యం ఆధీనంలో సురక్షితంగా ఉన్నాడని పేర్కొన్నారు. ఇరాన్‌లోని ప్రమాదకర పర్వత ప్రాంతంలో అతడిని గుర్తించినట్టు తెలిపారు. పైలట్‌ను తీసుకురావడానికి తాను డజన్ల కొద్దీ యుద్ధ విమానాలను పంపానని ట్రంప్ తెలిపారు. రక్షణ చర్యలకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతోనే ఆ విషయాన్ని బయటకు చెప్పలేదన్నారు. శత్రువు భూభాగంలోకి వెళ్లి ఓ పైలట్‌ను రక్షించడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి అని ట్రంప్ పేర్కొన్నారు. ఏ అమెరికన్ యోధుడినీ శత్రు భూభాగంలో ఒంటరిగా వదలిపెట్టబోమని ట్రంప్ అన్నారు. ఇరాన్ గగనతలంపై అమెరికా తిరుగు లేని ఆధిపత్యాన్ని సాధించిందని చెప్పడానికి తాజా ఆపరేషన్ ఓ నిదర్శనమని ట్రంప్ పేర్కొన్నారు.
http://www.teluguone.com/news/content/donald-trump-36-216722.html





