అమెరికాలో ఇరాన్ గూఢచారి నెట్‌వర్క్‌పై నిఘా...సులేమానీ బంధువుల అరెస్ట్
Publish Date:Apr 5, 2026
Advertisement
ఇరాన్ సైనిక విభాగం 'రివల్యూషనరీ గార్డ్స్' మాజీ అధిపతి, దివంగత జనరల్ ఖాసీం సులేమానీకి చెందిన ఇద్దరు బంధువులను అమెరికా ఫెడరల్ ఏజెంట్లు అదుపులోకి తీసుకున్నారు. వారి నివాస అనుమతులను (గ్రీన్ కార్డులు) రద్దు చేసిన వెంటనే ఈ అరెస్టులు చోటుచేసుకోవడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. ఇరాన్ పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న ట్రంప్ ప్రభుత్వం, దేశ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. అరెస్టయిన వారిలో ఖాసీం సులేమానీ మేనకోడలు హమీదా సులేమానీ అఫ్షర్, ఆమె కుమార్తె ఉన్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. వీరు అమెరికాలో ఉంటూనే ఇరాన్ ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారని, సోషల్ మీడియా వేదికగా అమెరికా వ్యతిరేక పోస్టులు పెడుతున్నారని అధికారులు అభియోగాలు మోపారు. ప్రస్తుతం వీరిద్దరినీ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) కస్టడీకి తరలించారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. హమీదా అఫ్షర్ ఇరాన్ ఉగ్రవాద పాలనకు బహిరంగ మద్దతుదారుగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. లాస్ ఏంజిల్స్‌లో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూనే, అమెరికాను 'గ్రేట్ సాతాన్' అని దూషించడం, ఇరాన్ సుప్రీం లీడర్‌ను పొగడటం వంటి చర్యలకు పాల్పడినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ నేపథ్యంలోనే ఆమెకు జారీ చేసిన 'లాఫుల్ పర్మనెంట్ రెసిడెంట్' (LPR) హోదాను రద్దు చేశారు. మరోవైపు, ఇరాన్ మాజీ భద్రతా అధికారి అలీ లారిజానీ కుమార్తె ఫాతిమా అర్దేషిర్, ఆమె భర్త సెయ్యద్ మొతమేదిల గ్రీన్ కార్డులను కూడా అమెరికా రద్దు చేసింది. ఇప్పటికే వీరిని దేశం నుంచి బహిష్కరించినట్లు సమాచారం. ఇరాన్‌తో యుద్ధం కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో, అమెరికా గడ్డపై ఇరాన్ అనుకూల శక్తులకు తావులేదని శ్వేతసౌధం స్పష్టమైన సంకేతాలు పంపింది. అయితే, ఈ అరెస్టులపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఖాసీం సులేమానీ కుమార్తె జైనాబ్ ఈ వార్తలను ఖండించారు. అమెరికాలో అరెస్టయిన వ్యక్తులకు తమ కుటుంబంతో ఎటువంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. సులేమానీ బంధువులెవరూ అమెరికాలో నివసించడం లేదని, ఇదంతా అమెరికా చేస్తున్న తప్పుడు ప్రచారమని ఇరాన్ మీడియా పేర్కొంది. 2020లో బాగ్దాద్‌లో జరిగిన అమెరికా డ్రోన్ దాడిలో ఖాసీం సులేమానీ మరణించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాలో ఉన్న ఇతర ఇరాన్ పౌరుల నివాస అనుమతులపై కూడా ట్రంప్ ప్రభుత్వం పునఃసమీక్ష చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అరెస్టులు రానున్న రోజుల్లో ఇరాన్-అమెరికా సంబంధాలను మరింత దిగజార్చేలా కనిపిస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/-qasem-soleimani-36-216719.html





