మొహమాటం కొద్దీ అందరి ముందూ తలూపుతూ ఉంటారా.!
Publish Date:Oct 29, 2026
Advertisement
మన సమాజంలో చాలామంది ఎదుర్కొనే అతిపెద్ద సమస్యల్లో మొహమాటం ఒకటి. ఎదుటివారు ఏది అడిగినా, ఏ పని చెప్పినా కాదనలేక, మనసులో ఇష్టం లేకపోయినా సరే.. పైకి తల ఊపే అలవాటు చాలామందికి ఉంటుంది. అవతలివారు ఎక్కడ బాధపడతారో, ఎక్కడ తమపై చెడు అభిప్రాయం ఏర్పడుతుందో అనే భయంతో ప్రతీదానికీ అవును అని చెప్పడం వల్ల జీవితంలో ఎన్నో కష్టాలను, మనశ్శాంతి లేని పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎప్పుడూ అందరినీ సంతోషపెట్టడానికి ప్రయత్నించడం వల్ల మన సొంత లక్ష్యాలు, ఆత్మగౌరవంతో పాటు సమయం కూడా వృథా అవుతాయి. జీవితంలో విజయం సాధించాలన్నా, సమాజంలో గౌరవంగా బతకాలన్నా కొన్ని పరిస్థితుల్లో నిర్మొహమాటంగా కాదు అని చెప్పడం చాలా అవసరం. ఎవరైనా అనవసరమైన లేదా సామర్థ్యానికి మించిన బాధ్యతలను మోపినప్పుడు కాదని చెప్పాలి. మీ పరిధిలో లేని, మీకు ఏమాత్రం కుదరని లేదా ఇష్టం లేని పనులను ఇతరులు మీపై రుద్దాలని చూస్తే వెంటనే నైస్‌గా కాదని చెప్పడం శ్రేయస్కరం. బాధ్యతారాహిత్యంగా ఉన్నవారి పనులను నెత్తిన వేసుకోవడం వల్ల మీ సొంత పనులు దెబ్బతింటాయి, ఒత్తిడి పెరుగుతుంది.
గొప్ప రాజనీతిజ్ఞుడు, తత్త్వవేత్త అయిన ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా వివరించారు. మంచికి కూడా ఒక హద్దు ఉంటుందని, అందరికీ అన్నింటికీ అవును అని చెప్పడం వల్ల జీవితం నాశనమవుతుందని ఆయన తెలిపారు. ఏ ఏ సమయాల్లో ధైర్యంగా కాదని చెప్పాలో చాణక్యుడు తెలిపాడు. ఆ విషయాలేంటో, అలాంటి పరిస్థితులలో కాదని చెప్పడం వల్ల జరిగేదేంటో తెలుసుకుంటే..
తప్పుడు పనులు లేదా అన్యాయం జరుగుతున్నప్పుడు..
ఎవరైనా మిమ్మల్ని ఏదైనా తప్పు పని చేయమని ప్రేరేపిస్తున్నప్పుడు లేదా అన్యాయపు పనులు చేయానికి సహాయపడమని ఒత్తిడి తెస్తున్నప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే కాదు అని చెప్పాలి. ఎవరి ఒత్తిడికో లొంగిపోయి తప్పు పనికి సహకరించినట్లయితే, ఆ తప్పు చేసిన వారితో సమానంగా మనమూ బాధ్యులమవుతాము. ఇతరుల ప్రభావంతో తప్పుడు మార్గంలోకి వెళ్లడం జీవితంలో పెద్ద ప్రమాదాలకు దారితీస్తుంది.
అబద్ధాలు చెప్పాల్సి వచ్చినప్పుడు..
సరదాకి కూడా అబద్ధాలు చెప్పడం మంచిది కాదు. ఎవరైనా తమ స్వార్థం కోసం మిమ్మల్ని అబద్ధం చెప్పమని అడిగితే, నిర్భయంగా కాదనాలి. అబద్ధానికి తోడుగా ఉండటం అంటే ఒక రకమైన నేరంలో భాగస్వామి కావడమే అవుతుంది. అబద్ధాన్ని సమర్థించడం లేదా దానికి సహకరించడం వల్ల మన వ్యక్తిత్వం దెబ్బతింటుంది.
దొంగతనం లేదా అక్రమార్జన..
దొంగతనం లేదా అక్రమ మార్గాల్లో లాభం పొందే సలహాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. ఎలాంటి చిన్న దొంగతనానికైనా లేదా అక్రమ సంపాదనకు సహకరించమని ఎవరైనా కోరితే వెంటనే వద్దని చెప్పాలి. అక్రమ మార్గాల్లో సంపాదించే ధనం లేదా పొందే లాభం ఎప్పటికైనా పతనానికే కారణమవుతుంది. ఇందులో భాగస్వామి అయినవారు తమ జీవితాన్ని తామే స్వయంగా నాశనం చేసుకున్నట్లవుతుంది.
స్వార్థపరుల దగ్గర..
ఇతరులు స్వార్థంతో మిమ్మల్ని వాడుకుంటున్నారని అనిపించినప్పుడు నో చెప్పడం నేర్చుకోవాలి. సమాజంలో కొందరు వ్యక్తులు కేవలం తమ పనులు జరగాలనే ఆలోచనతో మాత్రమే మన మంచి తనాన్ని వాడుకుంటూ ఉంటారు. అలాంటి వారిని గుర్తించి, అలాంటి వారికి దూరంగా ఉండాలి. మిమ్మల్ని ఆయుధంగా వాడుకునే వారికి పదే పదే అవును అని చెప్పడం వల్ల మీ విలువ తగ్గడమే కాకుండా, మిమ్మల్ని చులకనగా చూసే అవకాశం ఉంది.
సామర్థ్యానికి మించిన, అనవసరమైన బాధ్యతలలో..
కాబట్టి జీవితంలో మొహమాటానికి పోయి ప్రతీదానికీ తల ఊపడం చాలా పెద్ద తప్పు. అవసరమైన చోట సరైన సమయంలో కాదు అని చెప్పడం వ్యతిరేకంగా మాట్లాడటం లేదా ఎదుటివారిని నొప్పించడం కాదు, అది మీ ఆత్మగౌరవాన్ని, సమయాన్ని , భవిష్యత్తును కాపాడుకునే ఒక గొప్ప విచక్షణ. చాణక్యుడి ఈ నీతి సూత్రాలను పాటించడం ద్వారా జీవితంలో అనవసరమైన చిక్కుల నుంచి బయటపడి సాఫీగా విజయం వైపు సాగిపోవచ్చు.
*రూపశ్రీ
http://www.teluguone.com/news/content/do-you-keep-nodding-along-just-to-avoid-awkwardness-35-235791.html




