వైసీపీ నేతల్లో ఓటమి భయం.. మునుగోడు ఫలితం చూసి మన పరిస్థితేంటన్న జంకు
Publish Date:Nov 10, 2022
Advertisement
గత ఎన్నికల్లో 151 సీట్లు కైవసం చేసుకున్నాం... వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీలో 175కి 175 సీట్లలో మన పార్టీ వారే కూర్చోవాలనే ఆసాధ్య లక్ష్యన్ని ఏర్పరుచుకుని వైసీపీ అధినేత జగన్ అడుగులు వేస్తున్నారని.. ఆ క్రమంలో పార్టీలోని కీలక నేతలను సైతం ఆ దిశగా పరుగులు పెట్టించేస్తున్నారనే ఓ టాక్ పార్టీలో వైరల్ అవుతోంది. అలాగే వచ్చే ఎన్నికల్లో మన పార్టీని మన పథకాలే గెలిపిస్తాయంటూ.. వివిధ సమీక్షా సమావేశాల్లో సీఎం జగన్.. నేతలకు చెబుతున్నారని అయితే ఆయనకున్న ధీమా మాత్రం పార్టీ నేతలలో ఇసుమంతైనా కనిపించడం లేదనీ వైసీపీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి. అయితే తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నిక ఫలితం చూశాక.. వచ్చే ఎన్నికల్లో గెలుపు జగన్ భావిస్తున్నంత తేలిక ఎంత మాత్రం కాదన్న అభిప్రాయం వైసీపీలో వ్యక్తం అవుతోంది. గెలుపు ధీమా కోల్పోయి ఓ విధమైన అలజడి వైసీపీ మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు. ఎమ్మెల్యే సీటు ఆశిస్తున్న అభ్యర్థుల్లో మొదలైయిందని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫోరైడ్ సమస్యను నిర్మూలించేందుకు కేసీఆర్ ప్రభుత్వం గతంలో కోట్లాది రూపాయిలు వెచ్చించి.. మిషన్ భగీరథ పథకాన్ని చేపట్టిందని... దీంతో గత నాలుగైదేళ్లుగా ఆ జిల్లాలో ఒక్క ఫ్లోరైడ్ కేసు కూడా నమోదు కాలేదని.. అలాగే దళిత బంధు, కల్యాణ లక్ష్మీ, రైతు బంధు తదితర పథకాలను కొట్లాది రూపాయిలు అప్పుగా తీసుకొచ్చి మరీ ఆ కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తోందని.. ఇన్ని పథకాలు ప్రజా సంక్షేమం కోసం అమలు చేస్తున్నా.. మునుగోడులో విజయం కోసం గులాబీ పార్టీ చెమటోడ్చాల్సి వచ్చింది. అంత కష్టపడ్డా చచ్చీ చెడీ పది వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గట్టెక్కింది. అది కూడా వందల కోట్ల రూపాయిలు వ్యయం చేస్తేనే వచ్చింది. సొమ్ముల పందేరంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆ విషయంలో టీఆర్ఎస్ తో పోటీ పడలేకపోవడంతోనే టీఆర్ఎస్ విజయం సాధ్యమైందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. చెప్పుకోవడానికీ, చూపించుకోవడానికీ ఎంతో కొంత చేసిన టీఆర్ఎస్ పరిస్థితే అలా ఉంటే.. ప్రగతి ఊసే పట్టించుకోని వైసీపీ పరిస్థితి వచ్చే ఎన్నికల్లో ఏమౌతుందో ఊహించుకోవాలంటేనే భయంగా ఉందన్న భావన వైసీపీ శ్రేణుల్లోనే వ్యక్తమౌతోంది. ఇలాంటి నేపథ్యంలో జగన్ వివిథ పథకాల పేరుతో లబ్దిదారుల ఖాతాల్లో వేస్తున్న నగదు వల్ల వచ్చే ఎన్నికల్లో గెలుస్తామనే గ్యారంటీ అయితే తమకు లేదని వైసీపీ నాయకులే అంతర్గతసంభాషణల్లో ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నపరిస్థితి కనిపిస్తోంది. ఆ క్రమంలోనే ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన వివిధ జిల్లాల అధ్యక్షులు.. వరుసగా ఎవరికి వారు.. రాజీనామాల బాట పట్టినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టి.. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు చూసుకునే కంటే.. ఆ పదవికీ రాజీనామా చేయడం వల్ల తన నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేయడం ద్వారా మళ్లీ ప్రజల్లోకి వెళ్లి.. వారి చిన్నా చితక సమస్యలు పరిష్కరించడం వల్ల.. మన ఎమ్మెల్యే గారు మనతోనే ఉన్నారంటూ.. ఓ విధమైన కలరింగ్ ఇవ్వడం వల్ల కొంతలో కొంత వారికి మేలు చేయడమే కాకుండా.. మనకు మేలు జరుగుతోందనే భావనతోపాటు... ఎన్నికల వేళ అప్పటి పరిస్థితిని బట్టి ఓటర్ల నాడిని అంచనా వేసి.. నోట్లు పంచితే అదే తమకు పదివేలు అనుకునే స్థితికి ఫ్యాన్ పార్టీలోని ప్రజా ప్రతినిధులంతా వచ్చేశారని.. అలా కాకుంటే... మన పరిస్థితి మునుగుడే అనే ఓ టాక్ అయితే ఫ్యాన్ పార్టీలో వాడి వేడిగా సాగుతోందని సమాచారం. ఏదీ ఏమైనా.. ఓటు వేసే ఓటరు నాడీ.. ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థి నాడి..ఇద్దరిది ఓటుకు నోటుతో పెనవేసుకుపోయి ఉందని.. జగన్ పార్టీలోని ప్రజాప్రతినిధుల్లో ఓ టాక్ అయితే ఆ పార్టీ గుర్తు ఫ్యాన్ సాక్షిగా గింగరాలు తిరుగుతూ హల్‌చల్ చేస్తోందని చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/defeat-fear-in-ycp-leaders-munugodu-results-shows-them-their-future-25-146919.html





