బండి భగీరథ్...ఉదంతం ఒక క్రోనాలజీ
Publish Date:May 17, 2026
Advertisement
బండి భగీరథ్ చుట్టూ తిరుగుతున్న పోక్సో కేసు వ్యవహారం గత కొన్ని రోజులుగా తీవ్ర చట్టపరమైన, రాజకీయ మలుపులు తిరుగుతోంది. ఈ ఎపిసోడ్‌లో ఇప్పటివరకు జరిగిన అత్యంత కీలకమైన పరిణామాలు కాలక్రమేణా చూస్తే.. మే 8న ఒక 17 ఏళ్ల మైనర్ బాలికను వేధించారనే ఆరోపణలతో ఆ బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌లోని పెట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో మొదట కేసు నమోదైంది. ప్రారంభంలో భారతీయ న్యాయ సంహిత కింద మహిళల పట్ల అసభ్య ప్రవర్తన, పోక్సో చట్టంలోని సెక్షన్ 11, 12 ల కింద కేసు పెట్టారు. డీసీపీ రితిరాజ్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం బాధితురాలి నుంచి అదనపు స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన తర్వాత, ఈ కేసులో మరింత తీవ్రమైన, నాన్-బెయిలబుల్ సెక్షన్లయిన పోక్సో సెక్షన్ 5(l) రెడ్ విత్ 6 ను యాడ్ చేశారు. ఈ పోక్సో కేసు నమోదు కావడానికి కొన్ని గంటల ముందే, భగీరథ్ తరఫున కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఒక కౌంటర్ ఫిర్యాదు నమోదైంది. సదరు బాలిక కుటుంబ సభ్యులు తనను బెదిరిస్తూ, రూ. 5 కోట్లు ఇవ్వాలంటూ బ్లాక్‌మెయిల్ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసును పోక్సో కేసు నుంచి తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నంగా బాధితురాలి కుటుంబం ఆరోపించింది. అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ కోరడంతో పాటు కేసును కొట్టివేయాలని కోరుతూ భగీరథ్ తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్‌ను ఆశ్రయించారు. గతంలో సదరు బాలికపై నమోదైన ఒక పాత ఓవర్ స్పీడింగ్ కేసు రికార్డులను చూపిస్తూ.. ప్రస్తుతం ఆమె మైనర్ కాదని, ఆమె వయస్సు 19 నుండి 20 ఏళ్ల మధ్య ఉంటుందని, కాబట్టి పోక్సో చట్టం వర్తించదని భగీరథ్ తరఫు న్యాయవాది వాదించారు. అయితే, తీవ్రమైన సెక్షన్లు ఉన్నందున హైకోర్టు తక్షణ ముందస్తు బెయిల్ లేదా అరెస్ట్ నుంచి రక్షణ కల్పించడానికి నిరాకరిస్తూ తీర్పును రిజర్వ్ చేసింది. హైకోర్టులో పిటిషన్ నడుస్తున్న సమయంలో భగీరథ్ ఫోన్ స్విచ్ఛాఫ్ రావడం, ఆయన అందుబాటులో లేకపోవడంతో సైబరాబాద్ పోలీసులు ఆయనను పరారీలో ఉన్నట్లు గా ప్రకటించారు. ఆయనను పట్టుకోవడానికి 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడమే కాకుండా, దేశం దాటి వెళ్లకుండా విమానాశ్రయాలకు లుకౌట్ సర్క్యులర్ కూడా జారీ చేశారు. శనివారం, మే 16 నాటి రాత్రి నాటకీయ పరిణామాల మధ్య పోలీసులు భగీరథ్‌ను అరెస్ట్ చేశారు.పెట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో సుమారు రెండు గంటల పాటు విచారించి, స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. ఆ తర్వాత మేడ్చల్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరచగా, న్యాయస్థానం ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయనను చర్లపల్లి జైలుకు తరలించారు. ప్రస్తుతానికి ఈ కేసు దర్యాప్తు ప్రత్యేక బృందం- ఆధ్వర్యంలో తుది దశకు చేరుకుంటుండగా, కోర్టు రిమాండ్ విధించడంతో ఈ ఎపిసోడ్ చట్టపరంగా అత్యంత కీలకమైన మలుపు తిరిగింది.
http://www.teluguone.com/news/content/court-remands-bandi-bhagirath-for-14-days-36-220073.html





