పుచ్చకాయ ధర 4 లక్షలు.. ఎందుకంత కాస్ట్‌లీ? ఏంటి స్పెషాలిటీ?
Publish Date:Apr 23, 2022
Advertisement
సమ్మర్ సుర్రుమంటోంది. ఎండకు నోరు ఎండిపోతోంది. దాహం తీరాలంటే.. డీహైడ్రేట్ కాకుండా ఉండాలంటే.. పుచ్చకాయ అయితే సో బెటర్. రోడ్డు పక్కన ఎక్కడ కావాలంటే అక్కడ అమ్ముతుంటారు. ఓ పది రూపాయలు ఇస్తే.. కప్పు ముక్కలు ఇస్తారు. కాయ కావాలంటే 100 పెట్టి కొనాల్సిందే. మండుటెండలో ఆ ఎర్రెర్రని పండును తింటుంటే.. ఆ మజానే వేరు. నీటిశాతం, న్యూట్రిషన్ వ్యాల్యూ కూడా ఎక్కువే కావడంతో హెల్త్‌కు మంచిదే. ఇదంతా కామనే కానీ.. పుచ్చకాయలకే రారాజు లాంటి పుచ్చకాయ ఒకటుంది. దాని పేరు "డెన్సుకే". అవును, పేరు వెరైటీగా ఉన్నా.. డెన్సుకే వాటర్‌మెలన్ చాలా చాలా కాస్ట్‌లీ. ఇది జపాన్ స్పెషల్ పుచ్చకాయ మరి. పైకి నల్లగా.. గుండ్రంగా.. నునుపుగా ఉంటుంది. లోపల.. ఎర్రటి ఎరుపు. తింటే చక్కెరకంటే తియ్యదనం. రుచిలో అమోఘం. పోషక విలువల్లో ది బెస్ట్. అందుకే అంత డిమాండ్. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుచ్చకాయ డెన్సుకే. క్వాలిటీని బట్టి.. ఒక్కో కాయ రూ.19వేల నుంచి రూ.4లక్షల వరకూ పలుకుతుంది. కొన్నిసార్లు డిమాండ్ మరీ ఎక్కుఉంటే.. వేలంలో అమ్ముతుంటారు కూడా. దీనిపేరిట ఓ గిన్నీస్ రికార్డు కూడా ఉంది. ఇది కేవలం జపాన్‌లో కొన్నిచోట్ల మాత్రమే పండుతుంది. అంతర్జాతీయంగా ఫుల్ డిమాండ్ ఉంది. ఉత్పత్తి తక్కువ. ఏటా కొన్ని కాయలు మాత్రమే పండుతాయి. పూత నుంచి కోత వరకు.. ఎంతో జాగ్రత్తగా పెంచాలి. ఖరీదు ఎక్కువ కాబట్టి డెన్సుకే వాటర్‌మెలన్‌ను శుభకార్యాల్లో ఖరీదైన బహుమతిగానూ ఇస్తుంటారు. ఈ పుచ్చకాయ నాణ్యతను సూచించేలా దానిపై ఓ లేబుల్ కూడా అతికిస్తారు. ఆ డిటైల్స్‌ను బట్టి ధర కూడా మారుతుంటుంది.
http://www.teluguone.com/news/content/costly-densuke-watermelon-25-134856.html





