కాంగ్రెస్, వైకాపాలకు కలిసివచ్చిన రుణమాఫీ వ్యవహారం
Publish Date:Jul 28, 2014
Advertisement
అత్యంత దయనీయ స్థితిలో ఉన్న రైతులను ఆదుకొనేందుకు తెదేపా వ్యవసాయ రుణాలను మాఫీ చేసేందుకు సిద్దపడింది. ఎన్నికల సమయంలో వాగ్దానం చేసినట్లుగానే అన్ని రకాల రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కానీ, కేంద్రం కానీ రిజర్వు బ్యాంకు గానీ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సహాయము చేసే పరిస్థితి కనబడకపోవడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాల కోసం తీవ్రంగా అన్వేషిస్తోంది. అందువల్ల రుణాల మాఫీలో జాప్యం అనివార్యం అవుతోంది. తెదేపా చేతిలో ఓడిపోయినా కాంగ్రెస్, వైకాపాలకు ఇదొక ఆయచితవరంగా అందివచ్చింది. తను ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని గండికొట్టినందుకు చంద్రబాబుపై ప్రతీకార వాంఛతో రగిలిపోతున్న జగన్మోహన్ రెడ్డి అందివచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకొంటూ చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మల దగ్దానికి పిలుపునిచ్చి, రైతుల రుణమాఫీ వ్యవహారాన్ని స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకొనగా, రాష్ట్ర విభజన చేసి రెండు రాష్ట్రాలలో చేతులు కాల్చుకొన్న కాంగ్రెస్ పార్టీ కూడా అందివచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మళ్ళీ బలం పుంజుకొనేందుకు సిద్దపడుతోంది. వ్యవసాయ రుణాల మాఫీపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆగస్ట్ 4న ఆంద్రప్రదేశ్ లో అన్నిజిల్లాలలో కలెక్టర్ కార్యాలయాల ముందు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ధర్నాలు నిర్వహించాలని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ ఋణాలపై ఎటువంటి షరతులు విదించినా, ఇంకా జాప్యం చేసినా తాము అంగీకరించబోమని, తక్షణమే వ్యవసాయ రుణాలన్నిటినీ మాఫీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. రాష్ట్ర విభజన కారణంగా ప్రజాగ్రహానికి గురయ్యి రాష్ట్రంలో కనీసం ఒక్క యంపీ యం.యల్యే సీటు కూడా గెలుచుకోలేక, శాసనసభలో కానీ పార్లమెంటులో గానీ అడుగుపెట్టలేని అవమానకర పరిస్థితులను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ, ఈవిధంగానయినా మళ్ళీ పార్టీశ్రేణుల్లో చైతన్యం నింపి ప్రజలకు చేరువవ్వాల్ని ఆరాటపడుతోంది. గత పదేళ్ళ కాంగ్రెస్ పాలనలో వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన కారణంగానే నేడు రైతులు ఇటువంటి దీన స్థితిలో ఉన్నారు. కానీ ఆసంగతి మరిచిపోయిన కాంగ్రెస్ పార్టీ రైతుల సంక్షేమం కోసమే ఆరాటపడుతున్నట్లు వ్యవసాయ రుణాల మాఫీపై ఆందోళనలకు సిద్దమవుతోంది. ఈవిధంగా వైకాపాను చూసి కాంగ్రెస్, కాంగ్రెస్ ను చూసి వైకాపాలు పోటాపోటీగా రుణమాఫీపై ఉద్యమాలకు సిద్దమవుతూ సున్నితమయిన ఈ సమస్యను తమ రాజకీయ లబ్ధికి ఉపయోగించుకోవాలని ఆరాటపడుతున్నాయి. కానీ తమ పోరాటం కేవలం రైతుల ప్రయోజనాలు కాపాడేందుకేనని నమ్మబలుకుతున్నాయి. వారి ఉద్యమాలలో నిజాయితీ లేకపోయినప్పటికీ, అవి ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచడం ఖాయం గనుక రాష్ట్ర ప్రభుత్వం ఈ రుణమాఫీ వ్యవహారానికి వీలయినంత త్వరగా ఒక పరిష్కారం కనుగొనవలసి ఉంది.
http://www.teluguone.com/news/content/congress-45-36561.html





