రాజధాని వ్యవహారంపై వైకాపా రాజకీయాలు
Publish Date:Jul 27, 2014
Advertisement
పంటరుణాల మాఫీ వ్యవహారాన్ని రాజకీయం చేసి లబ్ది పొందుదామనే ప్రయత్నంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ‘నరకాసుర వధ’ పేరిట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిష్టి బొమ్మల దగ్దానికి పిలుపునిచ్చి తీవ్ర విమర్శలు ఎదుర్కోవడమే కాక ప్రజల నుండి సరయిన స్పందన రాకపోవడంతో అభాసుపాలయ్యారు. అయినప్పటికీ దానినుండి ఎటువంటి గుణపాఠం నేర్చుకోకుండా ఇప్పుడు రాజధాని వ్యవహారాన్ని కూడా రాజకీయం చేయాలని ప్రయత్నిస్తున్నట్లు కనబడుతోంది. రాజధాని ఎంపిక కోసం వేసిన శివరామ కృష్ణన్ కమిటీ రియల్ ఎస్టేట్, సిండికేట్ల చేతిలో కీలుబొమ్మగా మారిందని, ఫలానా చోట రాజధాని అని చెప్పిన మంత్రులు కమిటీని ప్రభావితం చేస్తున్నారని వైకాపా నేత యంవీ. మైసూరా రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రజలందరికీ సంభందించిన రాజధాని వంటి అతిముఖ్యమయిన నిర్ణయం తీసుకొనేటపుడు కమిటీ సభ్యులు ప్రధాన ప్రతిపక్షమయిన తమనెందుకు సంప్రదించడం లేదని ప్రశ్నించారు. ప్రజలందరూ శివరామకృష్ణన్ కమిటీని కేవలం రాజధాని ఎంపిక కమిటీగా భావిస్తున్నప్పటికీ నిజానికి ఆ కమిటీ రాష్ట్రంలో అన్ని జిల్లాలను సమానంగా అభివృద్ధి చేసేందుకు స్థానికంగా ఉన్న వనరులు, అవకాశాలు, అవసరాలు వంటివి అధ్యయనం చేసి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు తన నివేదిక ఇచ్చేందుకు ఏర్పాటు చేయబడింది. ఆ అధ్యయనంలో భాగంగా రాష్ట్ర రాజధానికి అనుకూలమయిన ప్రాంతాన్ని సూచించి, అక్కడ ఏర్పాటు చేయడం ద్వారా ఇరుగుపొరుగు జిల్లాలకు, యావత్ రాష్ట్రానికి ఏవిధంగా లబ్ది కలుగుతుందో సూచించేందుకు కమిటీ నియమించబడినట్లు సభ్యులు తెలియజేసారు. తాము రాష్ట్రాభివృద్ధి, రాజధాని ఏర్పాటుపై కేవలం సలహాలు, సూచనలు మాత్రమే ఇస్తామని, కానీ వాటిని అమలుచేయడం, చేయకపోవడం అనే విషయంలో అంతిమ నిర్ణయం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేనని స్పష్టం చేసారు. రాజధాని ఎక్కడ నిర్మించాలనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వమే అంతిమ నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని కమిటీ స్పష్టంగా చెపుతున్నపుడు, మంత్రులు కమిటీని ప్రభావితం చేయవలసిన అవసరం ఏముంటుంది? ఇక కమిటీ సభ్యులు రాష్ట్రమంతటా పర్యటిస్తూ ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, స్వచ్చంద సంస్థల నుండి అభిప్రాయ సేకరణ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. వివిధ జిల్లాలకు చెందిన అధికార తెదేపా నేతలు సైతం స్వయంగా కమిటీ ముందు హాజరయ్యి తమ తమ అభిప్రాయాలు, సలహాలు లిఖిత పూర్వకంగా అందజేస్తున్నారు. అటువంటప్పుడు కమిటీ సభ్యులు రియల్ ఎస్టేట్, సిండికెట్ల చేతుల్లో కీలుబొమ్మలుగా మారారని, ఈ విషయంలో ప్రధాన ప్రతిపక్షమయిన వైకాపాను సంప్రదించడంలేదని మైసూరారెడ్డి ఆరోపణలు చేయడం కేవలం ఈ అంశాన్ని రాజకీయం చేసే ఉద్దేశ్యంతో చేసినవేనని అర్ధమవుతోంది. నీతి నిజాయితీకి, రాజకీయాలలో విలువలకు చాలా ప్రాధాన్యం ఇస్తామని చెప్పుకొనే వైకాపా గతంలో సమైక్యాంధ్ర ఉద్యమాల ద్వారా రాజకీయ లబ్దిపొందాలని ప్రయత్నించింది. కానీ ఆ పార్టీ అధ్యక్షుడు ఆ ఉద్యమాలలో ఓట్లు, సీట్లు ప్రస్తావన చేసి తన ఉద్యమంలో నిజాయితీ లేదని స్వయంగా ఋజువు చేసుకొన్నారు. వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ఎన్నికలలో తమను ఓడించిన ముఖ్యమంత్రి చంద్రబాబుపై,ఆయన ప్రభుత్వంపై పగతో రగిలిపోతున్నారు. అందుకే పంట రుణాలను మాఫీని ఇప్పుడు రాజధాని వ్యవహారాన్ని కూడా రాజకీయం చేసి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. అయితే తన రాజకీయ ప్రతీకార పోరాటం, ప్రజల కొరకే అన్నట్లుగా కలరింగ్ ఇవ్వడం విశేషం. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా రాష్ట్రాభివృద్ధిలో ప్రభుత్వానికి అన్నివిదాల సహకరిస్తామని చెపుతూనే మరోవైపు ఈవిధంగా ప్రతీ అంశాన్ని రాజకీయం చేయడం గమనిస్తే వైకాపా మాటలకు, చేతలకు పొంతన ఉండదని స్పష్టమవుతోంది.
http://www.teluguone.com/news/content/ysr-congress-45-36531.html





