మెడికల్ కాలేజీలపై సిగపట్లు!
Publish Date:Sep 11, 2025
Advertisement
ఏపీలో తమ మెడికల్ కాలేజీలు, ఎరువుల కొరత చుట్టూ మాజీ సీఎం జగన్ పాలిటిక్స్ మొదలుపెట్టారు. ఓ వైపు జగన్, ఇంకోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు సై అంటే సై అంటున్నారు. మేం మెడికల్ కాలేజీలు తెస్తే ప్రైవేటుకు అమ్మేస్తారా అని జగన్ క్వశ్చన్ చేస్తుంటే.. భూమి కేటాయించి రిబ్బన్ కట్ చేసి వదిలేస్తే కాలేజీలు నడుస్తాయా అని సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. ఏపీలో ఎరువుల కొరత, మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సంబంధించి మాజీ సీఎం జగన్ విమర్శలు మొదలు పెట్టారు. రైతు సమస్యలపై ఆందోళన చేసిన వైసీపీ నేతలు కురసాల కన్నబాబు, కాకాణి గోవర్ధన్ రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, అంబటి రాంబాబులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. రైతుల సమస్యలపై పోరాటం చేసినందుకే ఈ నోటీసులు ఇచ్చారని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. ఎరువులు సకాలంలో అందిస్తే రైతులు రోడ్లపై నిరసనలు చేయాల్సిన అవసరం ఉంటుందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రెండు నెలలుగా రైతులు ఎరువుల కోసం క్యూలలో నిలబడుతున్నా ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కూటమి సర్కారు ఎరువుల కొరత నియంత్రించామని కౌంటర్లు మొదలుపెట్టింది. మరోవైపు ఏపీలో మెడికల్ కాలేజీలను పీపీపీలో చేపట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో పది మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో సెట్ చేయనున్నారు. ఇందులో భాగంగా తొలి విడతలో నాలుగు మెడికల్ కాలేజీలు పీపీపీ కింద చేపట్టాలని డిసైడ్ చేశారు. సెప్టెంబర్ 4న జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో ప్రభుత్వం పీపీపీ మోడల్ కింద 10 మెడికల్ కాలేజీలను డెవలప్ చేయడానికి ఆమోదం తెలిపింది. ఫేజ్-1లో పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అలాగే ఫేజ్-2లో పెనుకొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం కాలేజీలను డెవలప్ చేయనున్నారు. ఫస్ట్ ఫేజ్ కోసం ఇప్పటికే రెడీ అయిన రిక్వెస్ట్ ఆఫ్ ప్రపోజల్ కు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు ఉత్తర్వులు ఇచ్చారు. మిగిలిన 6 కాలేజీలు ఫీజబులిటీ రిపోర్ట్, డ్రాఫ్ట్ ఆర్ఎఫ్‌పీ రెడీ అయ్యాక పీపీపీ విధానంలోకి వెళ్లనున్నాయి. పీపీపీ కోసం కంపెనీలను ఎంపిక చేసేందుకు టెండర్లను కూడా ఆహ్వానిస్తున్నారు. అసలు ఏపీలో మెడికల్ కాలేజీల చుట్టూ ఏం జరుగుతోందో.. ఇక్కడి వరకు ఓ క్లారిటీ ఉంది. ఇది ప్రైవేటుకు కట్టబెట్టే కుట్ర అని వైసీపీ అంటుంటే.. కేవలం బిల్డింగ్స్, ఇన్‌ఫ్రా వరకు మాత్రమే ప్రైవేట్ వారు చూసుకుంటారని ఇతర యాజమాన్యమంతా ప్రభుత్వానిదే అని కూటమి నేతలు క్లారిటీ ఇస్తున్నారు. అయితే దీనిపైనే ఇప్పుడు పొలిటికల్ వార్ మొదలైంది. తమ పార్టీ తిరిగి అధికారంలోకి రాగానే.. ఈ పీపీపీ మోడల్ కింద ఉన్న అన్ని టెండర్లను రద్దు చేస్తామని మాజీ సీఎం జగన్ వార్నింగ్ ఇస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను మంజూరు చేసి ప్రభుత్వ రంగంలో అమలు చేయాలని చూశారు. కానీ ముందడుగు పడలేదు. దీంతో ఈ మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే టేకప్ చేసే బదులు పబ్లిక్-ప్రైవేట్ పార్ట్ నర్ షిప్ కు మార్చారు. ప్రభుత్వం చెబుతున్న విషయాల ప్రకారం పీపీపీలో చేస్తే... డిజైన్, ఫైనాన్సింగ్ అమలును ఈజీ చేస్తాయని, ప్రాజెక్ట్ కెపాసిటీని మెరుగుపరుస్తాయని, మనం పెట్టే ప్రతి పైసాకూ లాంగ్ టర్మ్ వాల్యూ అందిస్తాయంటోంది చంద్రబాబు సర్కార్. మొత్తం 10 మెడికల్ కాలేజీలను ఈ పీపీపీలో చేస్తామంటోంది కూటమి సర్కారు. 2027-28 విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు ప్రారంభమయ్యేలా నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రైవేట్ భాగస్వామ్యం నిర్మాణానికి మాత్రమే పరిమితం అని ప్రభుత్వం అంటోంది. కాలేజీల పూర్తి యాజమాన్యం, అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ అంతా రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుందంటున్నారు. సగం సగం పనులతో అసలు కాలేజీలు నడుస్తాయా అని కూటమి ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. 17 మెడికల్ కాలేజీలు ఉంటే ఒక్కటి మాత్రమే పూర్తయిందని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. గత ప్రభుత్వం మెడికల్ కాలేజీలకు పునాదులు వేసి వదిలేసిందన్నారు. అందుకే తమ హయాంలో పీపీపీ విధానం తీసుకొచ్చామని చెప్పారు. అసలు మెడికల్ కాలేజీలు అంటే ఏంటో తెలియని వారు కూడా మాట్లాడుతున్నారని చంద్రబాబు ఘాటు కౌంటర్ ఇచ్చారు. పునాది వేయడం, రిబ్బన్ కటింగ్ చేయడం, ఏదో చేసేశామని చెప్పడం, కాలేజీని నడిపే విధానం ఇదేనా? అని సీఎం క్వశ్చన్ చేస్తున్నారు. అటు వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సైతం దీనిపై రియాక్ట్ అయ్యారు. వైసీపీ హయాంలో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల కోసం సంవత్సరానికి 360 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, అయితే కూటమి ప్రభుత్వం కేవలం రెండేళ్లలో 7 వేల కోట్లు ఖర్చు చేసేలా ప్రణాళికలు రచించిందంటున్నారు. పులివెందుల మెడికల్ కాలేజ్ 84 శాతం పూర్తయినప్పటికీ ఎన్ఎంసీ అంచనాల ప్రకారం 48 శాతం బోధనా సిబ్బంది కొరతతో ఉందన్నారు. మోడీ విధానాలతోనే దేశంలో, రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు పెరిగాయని, అందులోనూ రకరకాల నిధులను దారి మళ్లించి ఒక్క మెడికల్ కాలేజీని కూడా జగన్ సర్కార్ పూర్తి చేయలేకపోయిందని ఫైర్ అయ్యారాయన. చేసే పని పకడ్బందీగా చేద్దాం.. మధ్యలో వదిలేసేలా వద్దు అన్నది కూటమి ప్రభుత్వం మాట. బోధనా సిబ్బంది ఉంటే ఇన్ఫ్రా స్ట్రక్చర్ లేకపోవడం, మౌలిక వసతులు ఉంటే డాక్టర్ల కొరత, ఇలా సగం సగం వద్దు అంటున్నారు. అందుకే పీపీపీ మోడల్ తెరపైకి తెచ్చామని క్లారిఫికేషన్ ఇస్తున్నారు. మొత్తానికి ఇది ఇక్కడితో ఆగిపోయేలా కనిపించడం లేదు. పీపీపీ చుట్టూ పెద్ద పొలిటికల్ బ్లాస్టింగ్స్ జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/cm-strong-counter-to-jagan-on-medical-colleges-39-206005.html





