సీఎంకు యాదగిరి గుట్టలో నో వెల్కమ్.. పావుగంట హెలికాప్టర్ లోనే రేవంత్ రెడ్డి
Publish Date:May 23, 2026
Advertisement
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన తీవ్ర రాజకీయ దుమారానికి, ప్రొటోకాల్ వివాదానికి దారితీసింది. సీఎం రేవంత్ రెడ్డి దాదాపు 100 కోట్ల రూపాయల వ్యయంతో ఆలయ పరిసరాల్లో ప్రతిష్టాత్మకమైన శంకుస్థాపనలు, అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టేందుకు శనివారం (మే23) యాదగిరిగుట్ట పర్యటన చేపట్టారు. అయితే.. అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ అధికారిక పర్యటనలో స్థానిక ప్రజాప్రతినిధులకు, కీలక అధికారులకు సమాచారం ఇవ్వలేదనీ, తగిన ఆహ్వానం అందలేదన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రొటోకాల్ లోపం తలెత్తిందని ప్రతిపక్షాలు, కొందరు స్థానిక నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అదలా ఉండగా, సీఎం, మంత్రుల హెలికాప్టర్ పెద్దగుట్టపై ల్యాండ్ అయినప్పటికీ.. అక్కడ వారిని రిసీవ్ చేసుకోవడానికి కనీసం ఒక్క జిల్లా ఉన్నతాధికారి కూడా అందుబాటులో లేకపోవడం తీవ్ర కలకలం రేపింది. వేద పాఠశాల శంకుస్థాపన ప్రాంగణమైన పెద్ద గుట్టపై సీఎం హెలికాప్టర్ ల్యాండ్ అయినా, అధికారుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్, సమన్వయ రాహిత్యం కారణంగా ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు కలెక్టర్ గానీ, ఎస్పీ గానీ, ఇతర ప్రోటోకాల్ అధికారులు గానీ సమయానికి అక్కడకు చేరుకోలేకపోయారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఏకంగా 15 నిమిషాల పాటు హెలికాప్టర్ లోనే వేచి ఉండాల్సి వచ్చింది. వీఐపీ పర్యటనలో స్థానిక యంత్రాంగం ఇంతటి నిర్లక్ష్యం ప్రదర్శించడంపై సచివాలయ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన సీఎం పర్యటనలో జిల్లా కలెక్టరేట్, పోలీస్ యంత్రాంగం వైఫల్యంపై ఉన్నతాధికారులు నివేదిక కోరినట్లు సమాచారం.
http://www.teluguone.com/news/content/cm-revanth-reddy-yadagirifutta-tour-39-220634.html




