మూసీ పునరుద్ధరణతో నగరానికి కొత్త శోభ : సీఎం రేవంత్
Publish Date:Mar 6, 2026
Advertisement
మూసీ నదిలో చెత్త, మురికి పేరుకుపోయిందని, అలాంటి వాతావరణంలో ఎవరూ జీవించాలని కోరుకోరని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మూసీ పరీవాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేసి వ్యాపారాలను విస్తరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రంగారెడ్డి జిల్లా కొత్వాల్‌గూడలో ముఖ్యమంత్రి ఎకోపార్క్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… హైదరాబాద్ కంటే సుందరమైన నగరం దేశంలోనే లేదన్నారు. మంచి ప్రభుత్వం ఉంటే ఈ నగరాన్ని ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నగరానికి కృష్ణా, గోదావరి నదుల నీళ్లు తీసుకొచ్చారని గుర్తుచేశారు. నిజాం నవాబు కాలంలో ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యతో కలిసి వరదల నివారణ కోసం మూసీ నదిపై నిర్మాణాలు చేపట్టారని చెప్పారు. వికారాబాద్‌లో మెడిసిన్ ప్లాంట్లను కూడా నాటి నిజాం ఏర్పాటు చేశారని తెలిపారు.హైదరాబాద్‌లో ఉస్మానియా ఆసుపత్రి, గోల్కొండ కోట, అసెంబ్లీ భవనం వంటి చారిత్రాత్మక కట్టడాలు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం నగరం ఆక్రమణలు, చెత్తతో నిండిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. గొప్ప సుందరమైన నగరం హైదరాబాద్‌ను మరింత అభివృద్ధి చేయాలనుకుంటే కొందరు అడ్డుకుంటున్నారని సీఎం విమర్శించారు. “మేము చేయలేదు… నువ్వు కూడా చేయొద్దు” అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కొందరికి మాత్రం ఫార్మ్‌హౌస్‌లు ఏర్పడ్డాయని వ్యాఖ్యానించారు.నగర అభివృద్ధి కోసం ప్రజా ప్రతినిధులను విదేశాలకు పంపి అధ్యయనం చేయించామని తెలిపారు. శంషాబాద్ విమానాశ్రయం నిర్మాణ సమయంలో కూడా వ్యతిరేకత వచ్చిందని, కానీ ఇప్పుడు అది పెద్ద ఆస్తిగా మారిందని గుర్తుచేశారు. మూసీ మురికిలో జీవించాలని ఎవరూ అనుకోరని, అందుకే మూసీ నది పునరుద్ధరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. హైదరాబాద్‌లో మూసీ రివర్‌ఫ్రంట్ ఏర్పాటు చేసి, నది పక్కన నైట్ ఎకానమీని అభివృద్ధి చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.శంషాబాద్ ప్రాంతం భవిష్యత్తులో బుల్లెట్ ట్రైన్ హబ్‌గా మారబోతోందని సీఎం వెల్లడించారు. బెంగళూరు, అమరావతి, చెన్నై నగరాలకు ఇక్కడి నుంచే బుల్లెట్ ట్రైన్ సౌకర్యం కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. కొత్త ప్రాజెక్టులు వచ్చినప్పుడు కొందరికి ఇబ్బందులు కలుగుతాయని, కానీ వారిని అనాథలుగా చేయబోమన్నారు. భూమి, ఇళ్లు కోల్పోయే వారికి పూర్తి సహాయం అందించి, నిర్వాసితులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.ప్రపంచంతో పోటీ పడేలా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తామని సీఎం తెలిపారు. డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ వంటి ప్రముఖుల సంస్థలు కూడా హైదరాబాద్‌కు వచ్చే అవకాశం ఉందన్నారు. అభివృద్ధి పనులు చేపడితే కొందరు అడ్డుపడుతున్నారని, ప్రత్యేకంగా కేటీఆర్‌పై విమర్శలు గుప్పించారు. ఈ ప్రాంతం ఎన్నేళ్లుగా అండగా ఉన్నప్పటికీ అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు.ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వ భూములను గుర్తించి ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామని సీఎం చెప్పారు. పేదలకు రేషన్ కార్డులు మంజూరు చేసి సన్న బియ్యం అందిస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ చీరల వల్ల ఆడబిడ్డలు ఎంతో ఆనందంగా ఉన్నారని చెప్పారు.గతంలో ఇచ్చిన బతుకమ్మ చీరలు ఉపయోగం లేకుండా పోయాయని విమర్శిస్తూ, ఈసారి మరో కొత్త రంగులో ఇందిరమ్మ చీరలు అందిస్తామని వెల్లడించారు.99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని సీఎం పిలుపునిచ్చారు.
http://www.teluguone.com/news/content/cm-revanth-reddy-inaugurates-ecopark-36-215137.html





