అమెరికా యుద్ధ విమానాన్ని కూల్చేసిన ఇరాన్
Publish Date:Apr 4, 2026
Advertisement
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుకున్నాయి. అమెరికాకు చెందిన అధునాతన యుద్ధ విమానాన్ని తమ గగనతలంలో కూల్చివేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ ఘటనలో విమానం నుంచి పారాచూట్ ద్వారా బయటపడిన అమెరికా పైలట్‌ను పట్టుకోవడానికి ఇరాన్ ప్రభుత్వం ఏకంగా భారీ రివార్డును ప్రకటించింది. శత్రు దేశ పైలట్‌ను సజీవంగా బందీగా పట్టుకుని భద్రతా దళాలకు అప్పగిస్తే భారీ మొత్తంలో నగదు బహుమతి ఇస్తామని ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. ఐఆర్జీసీ సమాచారం మేరకు నైరుతి ఇరాన్ లో అమెరికాకు చెందిన ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగల్ యుద్ధ విమానం ఇరాన్ గగతనలంలోకి ఇలా ప్రవేశించిందో లేదో.. అలా ఇరాన్ రక్షణ వ్యవస్థలు దానిని కూల్చివేశాయి. విమానం కూలిపోయే ముందే అందులోని ఇద్దరు సిబ్బంది ఎజెక్ట్ అయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలనూ, విమానం శకలాలకు సంబంధించిన దృశ్యాలను కూడా ఇరాన్ మీడియా ప్రసారం చేసింది. ఇక ఈ కూల్చివేత ఘటనలో ప్రాణాలతో బయటపడిన అమెరికన్ పైలట్లను సజీవంగా బంధించేందుకు ఇరాన్ పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. పైలట్ ను సజీవంగా పట్టుకుని పోలీసులకు అప్పగిస్తే.. సుమారు 60,000 డాలర్లు, భారత కరెన్సీలో 50 లక్షల రూపాయలు బహుమతి అందజేస్తామని ఇరాన్ ప్రకటించింది. మరోవైపు, ఈ ఘటనపై అమెరికా వర్గాల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. విమానం కూలిపోయిన మాట వాస్తవమేనని, తమ సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్స్ ఒక పైలట్‌ను క్షేమంగా రక్షించాయనీ పేర్కొంది. రెండో పైలట్ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదనీ గాలింపు సాగుతోందనీ తెలిపింది.
http://www.teluguone.com/news/content/iran-shoots-down-us-warplane-36-216650.html





