భానుప్రియ అరెస్ట్ తప్పదా?
Publish Date:Jan 30, 2019
Advertisement
పనిమనిషిని వేధించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ సినీ నటి భానుప్రియను వెంటనే అరెస్టు చెయ్యాలని బాలల హక్కుల సంఘం ఏపీ డీజీపీ ఠాగూర్‌కు విన్నవించింది. బాలల హక్కులను హరించే విధంగా భానుప్రియ వ్యవహరించారని, అమె పై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలోని సండ్రవారి గ్రామానికి చెందిన ప్రభావతి అనే మహిళ నటి భానుప్రియ తన కూతురిని చిత్రహింసలు పెడుతుందని, ఆమె సోదరుడు గోపీకృష్ణ లైంగికంగా వేధించారని సామర్లకోట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఆరోపణలను భానుప్రియ ఖండించారు. ఆ అమ్మాయిని ఏనాడూ తాను ఇబ్బంది పెట్టడం కానీ.. వేధింపులకు గురి చేయడం కానీ చేయలేదని భానుప్రియ వెల్లడించారు.తన సోదరుడు బాలికను లైంగింకంగా వేధిస్తున్నాడని చెప్పినదంతా అబద్ధమని ఆమె స్పష్టం చేశారు. అంతేకాకుండా ఆ అమ్మాయే తన ఇంట్లో దొంగతనానికి పాల్పడిందని, తాము అడగడంతో దొంగిలించిన కొన్ని వస్తువుల్ని తిరిగి ఇచ్చిందని అన్నారు. ఇంకా విలువైన వస్తువులు ఇవ్వలేదని ఆమె చెప్పారు. తాను పోలీసులకు కంప్లైంట్ ఇవ్వబోతే అమ్మాయి తల్లి ప్రభావతి ఏడ్చిందని అందుకే తాను కేసు పెట్టలేదని అన్నారు. పోలీసులు, పిల్లల సంరక్షణ విభాగం వాళ్లు ఆ యువతిని తీసుకెళ్లారని భానుప్రియ వివరించారు. అందువల్ల ఈ కేసు అక్కడితో క్లోజ్ అయ్యిందని అంతా భావించారు. తాజాగా బాలల హక్కుల సంఘం ఏపీ డీజీపీని కలవడంతో మళ్లీ కేసు మొదటికి వచ్చింది. ఇప్పుడు భానుప్రియను పోలీసులు అరెస్టు చేస్తారా, చెయ్యరా అన్నది చర్చనీయాంశం అయ్యింది. అరెస్ట్ చేసే పరిస్థితులు ఉంటే ఆమె ముందస్తు బెయిల్ తీసుకునే అవకాశం ఉంది.
http://www.teluguone.com/news/content/child-rights-activists-meets-ap-dgp-over-bhanupriya-harassment-case-39-85603.html





