వన్ స్టేట్-వన్ కోడ్..ప్రభుత్వానికి డబ్బే డబ్బు
Publish Date:Jan 30, 2019
Advertisement
ఏపీ రవాణా శాఖలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. జిల్లాల వారి కోడ్ సిరీస్ నెంబర్లకు రవాణాశాఖ స్వస్తి పలికింది. ఒకే రాష్ట్రం.. ఒకే సిరీస్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దీంతో ఏపీలో అన్ని వాహనాలకు నేటి నుంచి ఏపీ 39 సిరీస్ అందుబాటులోకి వచ్చింది. ఈ విధానాన్ని రవాణా శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విజయవాడలో ప్రారంభించారు. విజయవాడకు చెందిన ముప్పాళ్ల కల్పనకు AP 39 A002 నంబరును కేటాయించారు. ఆమెకు వెంటనే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ను కూడా అందజేశారు. ఈ సందర్బంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ...గతంలో ట్రాన్సపోర్టు డిపార్టుమెంట్ అంటేనే లంచాలకు ప్రతిరూపంగా ఉండేదని, ఈ నాలుగున్నరేళ్ల వ్యవధిలో బెస్ట్ డిపార్ట్మెంట్ గా ఎదగటం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. వన్ స్టేట్ వన్ కోడ్ విధానం ద్వారా ఆదాయం కూడా పెరుగుతుందని చెప్పారు. వేలు ముద్రతో పాటుగా ఐరిష్ విధానం ద్వారా రిజిస్ట్రేషన్ జరిగే విధంగా చూడాలన్నారు. థర్డ్ పార్టీ విధానం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రవాణాశాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రవాణా శాఖలో ఈ నూతన విధానం అమల్లోకి రానుండటంతో పక్క జిల్లాల్లో తాత్కాలిక చిరునామాలతో ఫ్యాన్సీ నంబర్లను దక్కించుకుంటున్న వాహనదారులకు అడ్డుకట్ట పడింది. ఫలితంగా రాబోయే రోజుల్లో ఏదైనా వాహనానికి 9999 లాంటి ఫ్యాన్సీ నంబర్లు కావాలనుకునే వాహన యజమాని ఇకపై అలాంటి నంబర్ల కోసం తీవ్రమైన పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఫాన్సీ నెంబర్ కావాలి అంటే ఈ – బిడ్డింగ్ లో పాల్గొనాల్సి ఉంటుంది. డిమాండ్ బట్టి రేటు కాబట్టి ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది.
http://www.teluguone.com/news/content/ap-39-registration-number-series-for-all-vehicles-in-andhra-pradesh-39-85605.html





