పీపీపీపై న్యాయపోరాటం ఎలా? వైసీపీ మల్లగుల్లాలు!
Publish Date:Dec 20, 2025
Advertisement
పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల వ్యవహారాన్ని రాజకీయం చేయడానికి అష్ఠకష్టాలు పడిన వైసీపీ.. కోటి సంతకాలంటూ చేసిన హడావుడి ముగిసింది. గవర్నర్ కు వినతిపత్రంలో ఆ ప్రహసనం దాదాపు ముగిసిపోయినట్లే. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల పట్ల ప్రజల వ్యతిరేకత పెద్దగా కనిపించలేదని స్పష్టమైంది. దీంతో ఇప్పుడు కోర్టును ఆశ్రయించాలని భావిస్తోంది. ఈ విషయంలో కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేయడానికి సన్నాహాలు చేస్తున్నది. అయితే ఇక్కడే ఆ పార్టీకి పెద్ద ఇబ్బంది వచ్చి పడిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పీపీపీ విధానం వద్దు అంటూ కోర్టును ఆశ్రయిస్టే ఆ పిటిషన్ అడ్మిషన్ స్థాయిలోనే తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందంటున్నారు న్యాయ నిపుణులు. ఎందుకంటే పీపీపీ విధానం అన్ని పరీక్షలకూ తట్టుకుని నిలబడిన అంశం. కేంద్రం నుంచి పలు రాష్ట్రాలలో ఇన్ ఫ్రాస్టక్చర్ డెవలప్ మెంట్ అన్నది ఈ పీపీపీ విధానంలోనే జరుగుతోంది. సరే అది కాదని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ కోర్టుకు వెడదామా? అంటే..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించలేదు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం అంటూ జీవోలోనే స్పష్టంగా పేర్కొంది. దీంతో ఆ పాయింట్ మీద కోర్టుకు వెళ్లడం ఎలా అన్నది అర్ధం కాక వైసీపీ మల్లగుల్లాలు పడుతోందని పరిశీలకులు అంటున్నారు. అది పక్కన పెడితే తాము సేకరించిన కోటి సంతకాలనూ కోర్టు ముందు ఉంచుతామన్న వాదనను వైసీపీ తెరపైకి తీసుకువస్తున్నది. అయితే అదీ అంత తేలిక కాదు. నిజంగా వైసీపీ కోటి సంతకాలు సేకరించి, వాటిని కోర్టుకు సమర్పించాలంటే, ఆ కోటి సంతకాలు చేసిన వారి గుర్తింపును కూడా కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. వాస్తవానికి సంతకాల సేకరణ కార్యక్రమం ఎలా జరుగుతుందన్నది అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో సంతకాలు చేసిన కోటి మంది ఐడెంటిటీని కోర్టు ముందు ఉంచడం అంటే అయ్యే పని కాదని వైసీపీ శ్రేణులే అంటున్నాయి. ఈ నేపథ్యంలో పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంలో ప్రైవేటు కాలేజీలకు వ్యతిరేకంగా న్యాయపోరాటానికి ఎలా ముందుకు వెడుతుందన్నది ఆసక్తిగా మారింది.
http://www.teluguone.com/news/content/ycp-clueless-on-legal-fight-39-211297.html





