ఆరోజు ముద్దులు.. నేడు పిడిగుద్దులు! జగన్ జీవితమే ఒక ఫేక్!
Publish Date:Dec 24, 2020
Advertisement
అనంతపురం జిల్లాలో జరిగిన దళిత యువతి స్నేహలత హత్యపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. వైసీపీ ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన అన్న చంద్రబాబు.. గన్ వచ్చే లోపల జగన్ వస్తాడన్న మాటలు ఎక్కడా అని ప్రశ్నించారు. ఆడపిల్లల పాలిట మేనమామగా ఉంటానన్న వ్యక్తి వారిపట్ల కంశుడిలా తయారయ్యారని బాబు మండిపడ్డారు. జగన్ జీవితమే ఒక ఫేక్.. చట్టమే రాని దిశ చట్టానికి పోలీసు స్టేషన్లు పెట్టి వాహనాలు పంపిణీ చేశారు.. అదే దిశ పోలీస్ స్టేషన్ కు స్నేహలత తల్లి ఫోన్ చేస్తే స్పందన లేదని ఆరోపించారు. 19నెలల్లో జరిగిన హత్యాచారాలు, ఆడిబిడ్డలపై వేధింపులు గతంలో ఎప్పుడూ జరగలేదని చెప్పారు చంద్రబాబు. ‘తండ్రి చనిపోయాడని ఓదార్పు యాత్రలు చేసి సానుభూతి కోసం నానా గడ్డి తినీ ఇప్పుడు ఆడబిడ్డలపై కనికరం లేకుండా వ్యవహరిస్తారా? రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎక్కడున్నాయి. వైసీపీ అరాచకాలకు అడ్డు అదుపు లేదా? ఆడపిల్లల మానానికి శీలానికి రక్షణ కల్పించలేని చేతకాని దద్దమ్మ ప్రభుత్వం ఇది. ఇంత దారుణాలు జరిగితే పులివెందుల నుంచి అనంతపురం ముఖ్యమంత్రి వెళ్లలేరా? మానవత్వం లేకుండా ప్రవర్తిస్తూ మనుషుల్ని మనుషుల్లా చూడట్లేదు. కుక్కలకు బిస్కెట్లు వేసిన మాదిరి ప్రజల్ని చూస్తున్నారు. పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేసి రాజకీయ కక్షల కోసం పోలీసుల్ని వాడటం రాష్ట్రానికి చేటు. వివేకానందరెడ్డిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించినప్పుడే జగన్ ఫేక్ వ్యక్తని తేలిపోయింది. డబ్బుల వ్యామోహం, స్వప్రయోజనాల కోసం ముందుకు పోతున్నారు తప్ప రాష్ట్రాభివృద్ధిని గాలికొదిలేశారు’అని చంద్రబాబు ఘాటుగా ధ్వజమెత్తారు. ‘స్నేహలత హత్య ఘటనను మళ్లించేందుకే జేసీ కుటుంబంపై దాడి చేశారు. సమాజం కోసం పనిచేసిన నాయకుల విగ్రహాలు కూలగొట్టి రౌడీలు, నేరస్థుల విగ్రహాలు పెడతారా? శ్రీకాకుంళంలో గౌతు లచ్ఛన్న విగ్రహాన్ని కూలగొడతాననటం దుర్మార్గం. బీసీల ఓట్లు తీసుకుంటూ వారి పతనం కోరుతూ మనోభావాలను అన్ని విధాలా దెబ్బతీస్తున్నారు. కరుడగట్టిన నేరస్థులు కాబట్టి కిందవాళ్లని కూడా మీలాగా ఉగ్రవాదుల్లా తయారు చేస్తారా? ఒకసారి ముఖ్యమంత్రి అవకాశం అడిగితే నమ్మి పూనకం వచ్చినట్లు ఓట్లేశారు. ఆరోజు ముద్దులు పెట్టి నేడు పిడిగుద్దులు గుద్దుతున్నారు. స్నేహలత ఘటనతో పాటు ఇతర సంఘటనల్నింటిపైనా సీబీఐ విచారణ జరిపించాలి. బాధ్యులతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై కఠని చర్యలు తీసుకోవాలి’ అని చంద్రబాబు డిమాండ్ చేశారు.
http://www.teluguone.com/news/content/chandrababu-naidu-fire-on-jagan-39-108123.html





