నన్ను చంపుతారేమో.. అయినా భయపడేది లేదు! జేసీ ప్రభాకర్ రెడ్డి
Publish Date:Dec 24, 2020
Advertisement
అనంతపురం జిల్లా తాడిపత్రి భగ్గుమంటోంది. టీడీపీ సీనియర్ నేత , మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దాడి చేయడంతో తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. జేసీ వద్ద పనిచేసే కిరణ్ అనే వ్యక్తి తనపై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నాడని ఆరోపిస్తూ ఎమ్మెల్యే కేతిరెడ్డి... తన అనుచరులతో కలిసి జేసీ నివాసంపై దండెత్తారు. అక్కడే ఉన్న కిరణ్ అనే వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. దాంతో జేసీ అనుచరులు తిరగబడడంతో అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. దాడిలో కిరణ్ కు గాయాలయ్యాయి. జేసీ నివాసంలోకి ప్రవేశించిన ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఓ కుర్చీలో కూర్చోగా, అనంతరం ఆ కుర్చీని జేసీ వర్గీయులు తగులబెట్టారు. కాగా, తన ఇంటిపై దాడి జరిగిందని తెలుసుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి పట్టరాని ఆగ్రహావేశాలు ప్రదర్శించారు. తన ఇంటిపై రాళ్లదాడి పట్ల ఆయన పోలీసులతో వాగ్యుద్ధానికి దిగారు. ఎమ్మెల్యే, ఆయన అనుచరులు తన ఇంటిపై దాడి చేస్తుంటే మీరంతా ఏం చేస్తున్నారని నిలదీశారు. తాడిపత్రిలో తాను లేని సమయంలో తన ఇంటిపై స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన అనుచరులతో దాడి చేశారని జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల వైఖరి సరిగాలేదని, తన ఇంటిపై దాడిలో పోలీసుల పాత్ర కూడా ఉందని ఆరోపించారు. వాళ్లు, వాళ్లు ఏం మాట్లాడుకున్నారో తనకు తెలియదని చెప్పారు. పెళ్లిలో ఉండగా తనకు ఫోన్ వచ్చిందని జేసీ తెలిపారు. "అన్నా పెద్దారెడ్డి వచ్చినాడన్నా... నన్ను కొట్టారు అంటూ ఆ కుర్రాడు ఫోన్ చేశాడు. ఎందుకు కొట్టారు అంటే... పెద్దారెడ్డి భార్య మీద ఏదో విషయం వైరల్ అయిందంట అందుకని కొట్టారన్నా అని చెప్పాడు. అసలు వ్యక్తులపై చర్యలు తీసుకోకుండా దాడులు చేయడమేంటి? ఇదంతా పోలీసుల వైఫల్యమే! ఎమ్మెల్యే మా ఇంటికి వస్తే ఎస్సై తలుపు తీయడం ఏంటి? హత్య వ్యవహారాల్లో ఉన్నవాళ్లకు గన్ మెన్లను ఇస్తున్నారు, కానీ మాకు భద్రత లేకుండా పోయింది. ఒకవేళ నన్ను చంపుతారేమో... అంతకుమించి ఇంకేం చేస్తారు? నా రాత ఎలా ఉంటుందో అలా జరుగుతుంది. దేనికీ భయపడేది లేదు. అప్పుడెలా ఉన్నానో ఇప్పుడూ అలాగే ఉన్నాను" అని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు.
http://www.teluguone.com/news/content/jc-prbhaker-reddy-reaction-on-ycl-mla-attack-39-108120.html





