చాణక్యుడు చెప్పిన మాట.. ఏదైనా పని చేసేముందు ఈ 3 ప్రశ్నలు వేసుకోండి.. మీ జీవితమే మారిపోతుంది
Publish Date:Aug 22, 2026
Advertisement
జీవితంలో మనం ప్రతిరోజూ ఎన్నో పనులు చేస్తుంటాం. కొన్ని పనులు ఆలోచించి చేస్తాం.. మరికొన్ని పనులు మాత్రం ఆవేశంలోనో.. తొందరపాటుతో నిర్ణయం తీసుకుని మొదలుపెడతాం. అయితే ఏ పని అయినా ప్రారంభించే ముందు కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకుంటే, తప్పులు తగ్గించుకోవడంతో పాటు విజయానికి చేరువయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భంలో చాణక్యుడి నీతి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన పని చేయడానికి ముందు మూడు ప్రశ్నలు వేసుకోవాలని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. ఆ మూడు ప్రశ్నలు ఏంటో.. ఎందుకు వేసుకోవాలో.. దీని వెనుక గల కారణం ఏంటో తెలుసుకుంటే..
పని ఎందుకు చేస్తున్నాను?
ముందుగా మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి — నేను ఈ పని ఎందుకు చేస్తున్నాను? అని. ఆ పని వెనుక ఉన్న అసలు కారణం ఏమిటో తెలుసుకోవాలి. ఇతరులను చూసి చేస్తున్నామా? ఎవరో చెప్పారని చేస్తున్నామా? లేక నిజంగా మనకు అవసరం ఉందా?
మన లక్ష్యం స్పష్టంగా ఉంటే, ఆ పనిని సరైన దిశలో కొనసాగించడం సులభమవుతుంది. కారణం తెలియకుండా ప్రారంభించిన పని మధ్యలోనే ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
పని వల్ల ఎలాంటి ఫలితం వస్తుంది?
రెండో ప్రశ్న చేయాలనుకున్న పని వల్ల నాకు ఎలాంటి ఫలితం వస్తుంది? అని ప్రశ్నించుకోవాలి. ఏ పని చేసినా దానికి ఒక ఫలితం ఉంటుంది. ఆ ఫలితం మనకు ఉపయోగపడుతుందా? నష్టాన్ని కలిగిస్తుందా? భవిష్యత్తులో దాని ప్రభావం ఎలా ఉంటుంది? అనే విషయాలను ముందుగానే ఆలోచించాలి.
తక్షణ ప్రయోజనం మాత్రమే కాకుండా, దీర్ఘకాలంలో వచ్చే ఫలితాలను కూడా అంచనా వేయడం తెలివైన నిర్ణయం.
పనిలో విజయం సాధించగలనా?
మూడో ప్రశ్ చేయాలనకున్న పనిలో విజయం సాధించగలనా అని. మన దగ్గర ఉన్న సామర్థ్యం, సమయం, వనరులు, పరిస్థితులు, ఎదురయ్యే సమస్యలు వంటి అంశాలను ఆలోచించాలి. విజయం సాధించే అవకాశం ఉందా? ఉంటే దాని కోసం నేను ఏమి చేయాలి? అనే విషయాలను ముందుగానే పరిశీలించాలి.
ఇది భయపడి పనిని వదిలేయడం కోసం కాదు. విజయానికి అవసరమైన ప్రణాళికను సిద్ధం చేసుకోవడం కోసం..
ఈ మూడు ప్రశ్నలు ఎందుకు ముఖ్యం?
చాలాసార్లు మనం ఒక పని చేయాలనే ఉత్సాహంలో దాని పరిణామాలను ఆలోచించకుండా ముందుకు వెళ్తాం. ఆ తర్వాత సమస్యలు ఎదురైనప్పుడు “ముందే ఆలోచించి ఉంటే బాగుండేది” అని అనుకుంటాం.
అందుకే ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు, లేదా ఏదైనా పని మొదలు పెట్టేముందు ఈ మూడు ప్రశ్నలను మనసులో వేసుకోవడం అలవాటు చేసుకుంటే, తొందరపాటు నిర్ణయాలు తగ్గుతాయి. ఈ మూడు ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం దొరికిన తర్వాతే ముందడుగు వేయడం మంచిది.
*రూపశ్రీ.
http://www.teluguone.com/news/content/chanakyas-wisdom-ask-yourself-these-3-questions-before-taking-action-35-229591.html




