చెప్పుడు మాటల వల్ల జరిగే నష్టాలు ఏంటి.. ఎవరు చెప్పుడు మాటలు చెబుతున్నారో ఎలా తెలుసుకోవాలి.!
Publish Date:Aug 20, 2026
Advertisement
మన జీవితంలో మనం ఎదుర్కొనే కొన్ని సమస్యలకు కారణం పెద్ద గొడవలు, ఆర్థిక ఇబ్బందులు మాత్రమే కాదు. కొన్నిసార్లు ఇతరులు చెప్పిన మాటలను నమ్మడం, ఒకరి గురించి మరొకరికి చెప్పడం, అపార్థాలు కలిగించడం కూడా కుటుంబాల్లో, స్నేహాల్లో, ఉద్యోగ సంబంధాల్లో సమస్యలకు దారితీస్తాయి. వీటినే సాధారణంగా “చెప్పుడు మాటలు” అని అంటుంటాం. అయితే ప్రతి సలహా చెప్పుడు మాట కాదు. మన మంచిని కోరుతూ చెప్పే సలహా వేరు. ఇద్దరి మధ్య అనుమానం, కోపం లేదా విభేదాలు పెంచే ఉద్దేశంతో చెప్పే మాటలు వేరు. ఈ తేడాను గుర్తించడం చాలా ముఖ్యం.
చెప్పుడు మాటలు అంటే..
ఒక వ్యక్తి గురించి మరొకరి వద్ద ప్రతికూలంగా చెప్పడం, ఒకరి మాటలను మరొకరికి వక్రీకరించి చెప్పడం, చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి అపార్థం కలిగించడం లేదా ఇద్దరి మధ్య సంబంధం దెబ్బతినేలా మాట్లాడటాన్ని సాధారణంగా చెప్పుడు మాటలు అంటారు.
చెప్పుడు మాటల వల్ల జరిగే నష్టాలు..
భార్యాభర్తల మధ్య అనుమానాలు పెరుగుతాయి..
కుటుంబ వ్యవహారాల్లో మూడో వ్యక్తి మాటలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే భార్యాభర్తల మధ్య అపార్థాలు ఏర్పడవచ్చు. చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలుగా మారే అవకాశం ఉంటుంది. అందుకే భార్యాభర్తల మధ్య మూడవ మనిషి ప్రమేయం ఉండకూడదని చెబుతుంటారు.
కుటుంబ సభ్యుల మధ్య దూరం పెరుగుతుంది..
అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, తల్లిదండ్రులు-పిల్లలు లేదా ఇతర బంధువుల మధ్య ఒకరి గురించి మరొకరు చెప్పే మాటలు నమ్మడం వల్ల సంబంధాలు దెబ్బతినవచ్చు. ఇది బంధాల మీద నమ్మకం కోల్పోయేలా చేస్తుంది.
స్నేహాలు చెడిపోవచ్చు..
స్నేహితుల మధ్య చెప్పుడు మాటలు సాగితే అది అనుమానాలకు దారితీస్తాయి. ఎవరైనా ఏదైనా విషయం గురించి చెప్పినప్పుడు.. ఆ విషయాన్ని తెలుసుకోకుండానే స్పందిస్తే మంచి స్నేహం కూడా దెబ్బతినవచ్చు.
నమ్మకం కోల్పోయే ప్రమాదం..
చెప్పుడు మాటలు పదేపదే వినడం వల్ల మన చుట్టూ ఉన్నవారిపై నమ్మకం తగ్గుతుంది. కొన్నిసార్లు నిజాయితీగా మాట్లాడే వ్యక్తిపైనా అనుమానం కలిగే అవకాశం ఉంటుంది.
మానసిక ఒత్తిడి పెరుగుతుంది..
ఎవరైనా మన గురించి చెడుగా మాట్లాడుతున్నారని పదేపదే వింటే కోపం, బాధ, ఆందోళన వంటి భావాలు కలగవచ్చు. దాంతో మనశ్శాంతి దెబ్బతినే అవకాశం ఉంటుంది.
ఉద్యోగం చేసే చోట సమస్యలు రావచ్చు..
ఉద్యోగ చేసే ప్రదేశంలో ఒక ఉద్యోగి గురించి మరొకరికి తప్పుగా చెప్పడం వల్ల సహోద్యోగుల మధ్య విభేదాలు ఏర్పడవచ్చు. టీమ్‌లో పరస్పర నమ్మకం తగ్గే ప్రమాదం ఉంటుంది.
చిన్న సమస్యలు పెద్ద గొడవలుగా మారవచ్చు..
చిన్న విషయాన్ని ఒకరి దగ్గర నుంచి మరొకరికి చెప్పేటప్పుడు మాటలు మారిపోవచ్చు. చివరకు అసలు విషయం కంటే పూర్తిగా భిన్నమైన అర్థం ఏర్పడి గొడవకు దారితీయవచ్చు.
ఎవరైనా చెప్పుడు మాటలు చెబుతున్నారని ఎలా తెలుసుకోవాలి?
ఒక్క లక్షణాన్ని చూసి ఎవరినైనా చెప్పుడు మాటలు చెప్పేవారు అని నిర్ణయించలేం. అయితే ప్రవర్తనను బట్టి కొన్ని గ్రహించవచ్చు.
ప్రతి వ్యక్తి గురించి ఏదో ఒక నెగిటివ్ విషయం చెబుతుంటారు మీ దగ్గర ఒకరి గురించి చెబుతారు. మరో వ్యక్తి దగ్గర మీ గురించి కూడా ఇలాగే మాట్లాడుతున్నారని తెలుస్తే జాగ్రత్తగా ఉండాలి.
“ఇది ఎవరికీ చెప్పొద్దు” అని తరచుగా చెబుతుంటారు వ్యక్తిగత విషయాలను రహస్యంగా చెప్పడం తప్పు కాదు. కానీ ప్రతి విషయాన్నీ “రహస్య సమాచారం” పేరుతో ఒకరి నుంచి మరొకరికి తీసుకెళ్లే అలవాటు ఉంటే అప్రమత్తంగా ఉండటం మంచిది.
ఆధారాలు లేకుండా అనుమానాలు కలిగిస్తారు. ఇతరుల గురించి ఆధారాలు ఏమీ లేకపోయినా ఊరికే అనుమానంతో ఊహగానాలు సృష్టించి చెబుతుంటారు. ఇలా స్పష్టమైన ఆధారం లేకుండా మాటలు చెప్పడం చెప్పుడు మాటలకు సంకేతం కావచ్చు.
ఒకరి మాటలను మరొకరికి వేరే విధంగా చెబుతారు ఒక వ్యక్తి చెప్పిన మాటను యథాతథంగా చెప్పకుండా, తమకు నచ్చిన విధంగా మార్చి చెప్పడం వల్ల అపార్థాలు ఏర్పడతాయి.
ఇతరుల గొడవల గురించి తెలుసుకోవడంలో ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఎవరికి ఎవరితో గొడవ, ఇంట్లో ఏం జరిగింది, ఎవరు ఎవరితో మాట్లాడటం లేదు వంటి విషయాలను పదేపదే తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటే కొంత జాగ్రత్త అవసరం.
*రూపశ్రీ.
http://www.teluguone.com/news/content/the-dangers-of-gossip-35-229401.html




