మిస్త్రీకి 'టాటా' వెనుక మిస్టరీ ఏంటి?
Publish Date:Oct 25, 2016
Advertisement
టాటా... ఈ పేరు ఇండియాలో ఒక తిరుగులేని బ్రాండ్. ఏదైనా వస్తువుపై టీ, ఏ, టీ, ఏ అన్న నాలుగు అక్షరాలు వుంటే చాలు నాలుగు కాసులు ఎక్కువైనా ... జనం కళ్లు మూసుకుని కొనేస్తారు. స్వతంత్ర భారతదేశం కంటే వయస్సులో పెద్దదైన టాటా గ్రూప్ తన సుదీర్ఘ ప్రయాణంలో సాధించుకున్న అసలు లాభం అదే! దాని బ్రాండ్ వాల్యూ! జనంలో దానిపై వుండే చెక్కుచెదరని విశ్వాసం! టాటా సంస్థల చైర్మన్ గా ఎవ్వరూ ఊహించని రీతిలో సైరస్ మిస్త్రీని తొలగించటం నిజంగా ఒక షాకే! ఎందుకంటే రిలయన్స్ లాంటి సంస్థలు అప్పుడప్పుడూ అంతర్గత గొడవలకి, సంక్షోభాలకి, సంచలనాలకి లోనైనా టాటా గ్రూప్ ఎప్పుడూ అలా అవ్వలేదు. దశాబ్దాలుగా వ్యాపార సామ్రాజ్యం విస్తరిస్తూపోతున్నా ఎక్కడ అలజడి కనిపించదు టాటాలో. తమ టాటా ప్రాడక్ట్స్ లాగే చాలా అత్యున్నత నాణ్యతతో సంస్థ మ్యానేజ్ మెంట్ కూడా నడిపిస్తుంటారు. కాని, సోమవారం అనూహ్యంగా చైర్మన్నే పదవి నుంచి తొలగించారు డైరెక్టర్స్! ఇది టాటా సంస్థల్లోని వారికంటే ఎక్కువ యావత్ దేశానికి ఆశ్చర్యకరం, ఆందోళనకరంగా మారింది... టాటా అంటే కేవలం వ్యాపారం కాదు. టాటా అంటే కొన్ని లక్షల మంది ఉద్యోగులు, అంతకంటే ఎక్కువ మంది షేర్ హోల్డ్రర్స్. అంతే కాక టాటా గ్రూప్ నడిపే అనేక ట్రస్టులు బోలెడు సామాజిక కార్యక్రమలు చేస్తుంటాయి. వాటి వల్ల లాభం పొందే వారు కూడా ఎంతో మంది. అందుకే, టాటా చైర్మన్ అనూహ్య తొలగింపు చాలా పెద్ద విషయం. అది ఒక సంస్థకి సంబంధించిన మ్యానేజ్మెంట్ ఇష్యు కాదు. అయితే, ఇప్పుడు అందర్నీ వేధిస్తున్న ప్రశ్నలు ... నాలుగేళ్ల కింద చైర్మన్ గా ఎన్నికైన సైరస్ మిస్త్రీని ఎందుకుని పదవి నుంచి తొలగించారు? టాటాకి ఏమైనా ప్రమాదం వుందా? మళ్లీ రతన్ టాటానే ఎందుకు పీఠంపై కూర్చోబెట్టారు? టాటా సంస్థకి ఇప్పటికిప్పుడు ఎలాంటి ప్రమాదం లేదు. కాకపోతే, దాదాపు వంద సంస్థల సమాహారమైన టాటా గ్రూప్ చాలా కంపెనీలు లాసులో వుండటంతో మెల్లగా ముందుకు పోతోంది. మరీ ముఖ్యంగా, మిస్త్రీ లీడర్ షిప్ తీసుకున్నాక చాలా చోట్ల టాటా కంపెనీల్ని, ఆస్తుల్ని, షేర్లని అమ్మేస్తూ వచ్చాడు. ఏ సంస్థ నష్టాల్లో వున్నా దాన్ని భరించే ప్రశ్నే లేదని ఆయన తేల్చేశాడు. పక్కా బిజినెస్ మ్యాన్ లా ప్రవర్తించాడు. కాని, అనేక సంస్థల్ని, వాటిల్లోని ఉద్యోగుల్ని ఒక సామాజిక బాధ్యతతో నిర్వహిస్తూ వచ్చింది టాటా గ్రూప్ చాలా ఏళ్లుగా. ఇక్కడే తేడా వచ్చింది మిస్త్రీకి, టాటా డైరెక్టర్స్ కి. ఆయన కరుడుగట్టిన లాభ, నష్టాల లెక్కలు వేస్తూ సంస్థల్ని , వాటిల్లోని ఉద్యోగుల్ని పట్టించుకోకపోవటం ఒత్తిడికి దారి తీసింది. చివరకు, సైరస్ మిస్త్రీ తొలగింపు దాకా వెళ్లింది. నెక్ట్స్ టాటాలో భాగమైన మిస్త్రీ కుటుంబానికి చెందిన పల్లోంజీ గ్రూప్ కోర్టుకు కూడా వెళ్లనుంది. అంటే టాటా ప్రపంచంలో ఇప్పుడప్పుడే గొడవలు సద్దుమణిగే అవకాశాలు లేవు... సైరస్ మిస్త్రి తొలగింపు సరైందా కాదా అనే విషయం టాటా గ్రూప్ కు బయట వున్న వాళ్లెవరికి తెలిసే ఛాన్స్ లేదు. కాకపోతే, రతన్ టాటా మరోసారి చైర్మన్ కుర్చీ అలంకరించటం శుభ సూచకం. తాత్కాలికంగానే అయినా ఆయన తిరిగి రావటం టాటాకి, దాని ఉద్యోగులకి, మొత్తంగా దేశ ఆర్దిక వ్యవస్థకి నిస్సందేహంగా మంచిదే!
http://www.teluguone.com/news/content/board-of-tata-sons-45-68259.html





