బండి భగీరథ్ పోక్సో కేసులో ఉత్కంఠ...నేడు హైకోర్టులో విచారణ
Publish Date:May 14, 2026
Advertisement
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసి విచారణ ముమ్మరం చేశారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు పెట్ బషీరాబాద్ పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసినప్పటికీ, భగీరథ్ హాజరు కాకపోవడం గమనార్హం. మరోవైపు, విచారణాధికారులకు భగీరథ్ ఒక లేఖ పంపినట్లు సమాచారం. వ్యక్తిగత ఇబ్బందులు, తక్కువ సమయంలో నోటీసులు అందడం వల్ల తాను హాజరు కాలేకపోతున్నానని, మరో రెండు రోజుల సమయం కావాలని అందులో కోరినట్లు తెలుస్తోంది. అయితే భగీరథ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతని ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ వస్తోందని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అతని ఆచూకీ కోసం ఢిల్లీ, కరీంనగర్ ప్రాంతాలకు ప్రత్యేక బృందాలను పంపారు. ఈ కేసు వివరాల్లోకి వెళితే.. ఓ మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయడమే కాకుండా, శారీరకంగా వేధించాడనే ఆరోపణలు భగీరథ్‌పై ఉన్నాయి. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు తొలుత లైంగిక వేధింపుల కేసులు నమోదు చేయగా, బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా తర్వాత పోక్సో సెక్షన్లను జోడించారు. అయితే ఇది తనపై జరుగుతున్న కుట్ర అని, ఆ కుటుంబమే తనను రూ. 5 కోట్లు ఇవ్వాలని బ్లాక్‌మెయిల్ చేస్తోందని భగీరథ్ కౌంటర్ ఫిర్యాదు కూడా చేశారు. ఈ వివాదంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ భావోద్వేగంగా స్పందించారు. తన కుమారుడు తప్పు చేసి ఉంటే చట్టప్రకారం కఠినంగా శిక్షించవచ్చని, చట్టానికి ఎవరూ అతీతులు కాదని స్పష్టం చేశారు. అయితే తన కుటుంబాన్ని అప్రతిష్ఠ పాలు చేసేందుకు రాజకీయ ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కేసుపై సమీక్ష నిర్వహించి, విచారణలో ఎలాంటి పక్షపాతం ఉండకూడదని అధికారులను ఆదేశించారు.మరోవైపు బాధిత బాలిక వయసు విషయంలో తమకు అనుమానాలు ఉన్నాయని భగీరథ్ న్యాయవాది పంపిన నోటీసుకు జవాబిచ్చేందుకు పోలీసులు సన్నద్ధమయ్యారు. బాలికకు రెండు బర్త్ సర్టిఫికెట్లు బాధిత బాలిక వయసుకు సంబంధించి కుటుంబసభ్యులు రెండు బర్త్ సర్టిఫికెట్లను చూపిస్తున్నారని, ఆధార్ కార్డులు రెండు వేర్వేరు పేర్లతో ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఇలా రెండు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందనే విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం బాలిక జన్మించిన హైదరాబాద్‌లోని ఆస్పత్రికి లేఖ రాశారు. ప్రస్తుతం ఈ కేసు తెలంగాణ హైకోర్టు మెట్లెక్కింది. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని భగీరథ్ పిటిషన్ దాఖలు చేయగా, దానిపై విచారణ గురువానికి వాయిదా పడింది. కోర్టు తీర్పును బట్టి పోలీసులు తదుపరి అడుగులు వేయనున్నారు. ఒకవేళ బెయిల్ రాకపోతే భగీరథ్‌ను అరెస్టు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాల మధ్య హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో "బండి భగీరథ్ పరారీ" అంటూ వెలిసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా మెట్రో స్టేషన్లు, బస్టాపుల వద్ద ఇవి దర్శనమివ్వడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం పట్టుబట్టి ఈ కేసును వేగవంతం చేస్తుండటంతో, రానున్న 48 గంటల్లో ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
http://www.teluguone.com/news/content/bandi-bhageerath-case-36-219716.html





