ట్వీటు కాదు... నీ ఫైటు చూపించు పవన్..?
Publish Date:Jan 26, 2017
Advertisement
ఈమధ్య ట్విట్టర్లలో అలజడి రేపుతున్న రాజకీయ నాయకుడు ఎవరంటే.. ఎవ్వరైనా సరే - పవన్ కల్యాణ్ పేరే చెప్పాలి. మైకు పట్టుకోవడం కంటే ట్వీట్ల కోసం కీ బోర్డుని పట్టుకొన్నదే ఎక్కువాయన. కానీ ఆ ట్వీట్లు మాత్రం రసవత్తరంగా ఉంటాయి. ఎవరికి తగలాలో వాళ్లకే తగులుతాయి. జనంలో, అభిమానుల్లో కావల్సినంత ఉత్తేజం వస్తుంది. కానీ ఏం లాభం..?? అవన్నీ చప్పున చల్లారి పోతుంటాయి. ఉదయం లేవగానే మరో ట్వీటు.. ఆనక ఇంకోటి.. అలా ట్వీట్లాయనం సాగిస్తున్నాడు పవన్. తాజాగా ప్రత్యేక హోదా ఉద్యమం గురించి ఎడతెరిపి లేకుండా ట్వీట్లు చేస్తున్నాడు. విశాఖబీచ్ కేంద్రంగా నడుస్తున్న ఉద్యమానికి పవన్ ట్వీట్లు ఒక రకంగా ఆజ్యం పోశాయనే చెప్పొచ్చు. ఆంధ్రా జనం విశాఖవైపు చూడ్డానికి పవన్ ట్వీట్లు ప్రధాన కారణమయ్యాయి. అంతా బాగానే ఉంది. ఇప్పుడు విశాఖలో నిరసనకు పవన్ వస్తాడా, రాడా అనేది అనుమానంగా మారింది. వస్తున్నా... అంటూ వవన్ ఇప్పటి వరకూ ప్రకటించలేదు. అంటే ఈసారీ ట్వీట్లతోనే సరిపెడుతున్నాడా? ఫైట్ చేయడానికి రాడా?? ఈసారీ పవన్ మొహం చాటేస్తాడా? యువతరమంతా తమ శక్తి కూడబెట్టుకొని...విశాఖ తీరంలో సముద్ర హోరుని మరిపించేలా నినాదాలు అందించేందుకు సమాయాత్తం అవుతోంటే... పవన్ ఏసీ గదుల్లో కూర్చుని ట్వీట్లతో కాలక్షేపం చేస్తాడా? ఇప్పటి వరకూ ఇదే జరిగింది. ఇకపై కూడా పవన్ ట్వీట్లతో పరిపెట్టేస్తానంటే కుదరదు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా రాదన్నది నిజం. నిజంగా పవన్ మాటల్లో నిజాయతీ ఉంటే, పవన్ నిజంగానే టీడీపీకీ అటు బీజేపీకి తొత్తు కాకపోతే... ఇప్పుడైనా జనంలోకి రావాలి. ట్వీట్లు వదిలి రియల్ ఫైట్ చూపించాలి. ట్వీట్లకు ఎక్కువ - పోరాటాలకు తక్కువ అన్నట్టు హైదరాబాద్లోనే ఉండిపోతే... ఆంధ్ర జాతే కాదు.. యావత్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కూడా పవన్‌ని క్షమించరు గాక క్షమించరు. రాష్ట్రానికి కేంద్రం స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా ఎంత అన్యాయం చేసిందో.. పవన్ కూడా అంతే అన్యాయం చేసినట్టవుతుంది. ఈ నిజం పవన్ తెలుసుకొని.. ఉద్యమంలో పాల్గొంటే.. ముందుండి నడిపిస్తే అప్పుడే పవన్ నిజమైన ప్రజా నాయకుడిగా ఎదిగినట్టు. మరి పవన్ వస్తాడా? రాడా? చూద్దాం.
http://www.teluguone.com/news/content/ap-special-status-45-71489.html





