గవర్నర్ కోటా ఎమ్మెల్సీ సీట్లు.. రేసులో నలుగురు.. దక్కేదెవరికి?
Publish Date:Jun 29, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం వైసీపీ తరపున గవర్నర్ కోటాలో నామినేట్ అయిన జకియా ఖానం, పందుల రవీంద్రబాబుల పదవీ కాలం నెల రోజుల్లో ముగియనుంది. దీనితో ఖాళీ అవుతున్న ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలను తెలుగుదేశం కూటమి దక్కించుకోనుంది. ఖాళీ అవుతున్న ఈ రెండు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలనూ తెలుగుదేశం తన పార్టీ అభ్యర్థులకే కట్టబెట్టనుంది. అయితే ఉన్నవి రెండే సీట్లు అయినా వీటి కోసం తెలుగుదేశం నుంచి నలుగురు నేతలు సీరియస్ గా పోటీ పడుతున్నారు. గత ఎన్నికల సమయంలో కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా త్యాగాలు చేసిన నలుగురు కీలక నేతలు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానం కోసం పోటీలో ఉన్నారు. ఈ నలుగురిలో ఎస్వీఎస్ఎన్ వర్మ(పిఠాపురం వర్మ), దేవినేని ఉమ, వంగవీటి రాధా, మహాసేన రాజేష్ ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయం కోసం తన సొంత సీటును త్యాగం చేసి మరీ జనసేనాని విజయం కోసం శ్రమించిన ఎస్వీఎస్ఎన్ వర్మ ఈ రేసులో ముందు వరుసలో ఉన్నారని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. పవన్ కళ్యాణ్ విజయం కోసం అప్పట్లో చంద్రబాబు నాయుడు స్వయంగా వర్మతో మాట్లాడి మరీ ఒప్పించారు. అప్పటిలో ఆయనకు చంద్రబాబు ఎమ్మెల్సీ వాగ్దానం చేసినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. ఇటీవల వర్మను పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ పదవి నుంచి తప్పించడంతో.. గవర్నర్ కోటాలో పిఠాపురం వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని పార్టీ కేడర్ లో ప్రచారం జరుగుతోంది. ఇక వంగవీటి రాథా కూడా ఈ రేసులో ఉన్నారు. బెజవాడ రాజకీయాల్లో కీలక నేత అయిన వంగవీటి రాధాకృష్ణ గత రెండు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాకపోయినప్పటికీ.. ఆయన పార్టీ లైన్ దాటకుండా విధేయతతో కొనసాగుతున్నారు. ఆయనకు ఈసారి ఖచ్చితంగా అవకాశం దక్కుతుందని ఆయన అభిమానులు ఆశతో ఉన్నారు. అదీ కాకుండా, ఇటీవల కాపు సాజాజిక వర్గం కేంద్రంగా రాష్ట్రంలో రాజకీయ హీట్ పెరిగిన నేపథ్యంలో ఆయనకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే విధంగా.. తెలుగుదేశం సీనియర్ నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు కూడా. . పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడిన ఉమ, గత ఎన్నికల వేళ తన చిరకాల ప్రత్యర్థి వసంత కృష్ణప్రసాద్ కోసం మైలవరం సీటును త్యాగం చేశారు. ఆయన కూడా గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవిపై గంపెడాశలు పెట్టుకున్నారు. ఇక ఈ రేసులో దళిత సామాజిక వర్గం నుంచి బలమైన వాయిస్ వినిపించే మహాసేన రాజేష్ కూడా ఉన్నారు. 2024 ఎన్నికల్లో ఆయనకు మొదట పి. గన్నవరం టికెట్ కేటాయించినప్పటికీ.. గతంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత రావడంతో కూటమి ప్రయోజనాల కోసం ఆయనే అప్పట్లో స్వచ్ఛందంగా పోటీ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత కూడా ఆయన తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచారు. కేవలం 2 స్థానాలు మాత్రమే ఖాళీగా ఉండటంతో చంద్రబాబు నాయుడు ఈ నలుగురిలో ఏ ఇద్దరిని ఎంపిక చేస్తారన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది.
http://www.teluguone.com/news/content/governors-quota-mlc-sets-45-224440.html




