జగన్ మావిగన్ జపం.. బాబు అభివృద్ధి వ్యూహం!
Publish Date:Jul 2, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన జరిగి దశాబ్ద కాలం దాటినా, దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడ ఇంకా రాజధాని చుట్టూనే రాజకీయం తిరుగుతోంది. నిలకడైన విధానాలు, దీర్ఘకాలిక ప్రణాళికలు ఉండాల్సిన రాజధాని అంశంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి రూటు మార్చారు. నిన్నటి వరకు మూడు రాజధానుల నినాదంతో విశాఖపట్నం చుట్టూ రాజకీయాన్ని తిప్పిన జగన్, ఇప్పుడు మావిగన్ మంత్రం పఠిస్తున్నారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలుపుతూ ఈ సరికొత్త రాజధాని నమూనాను ఆయన తొలిసారి ప్రస్తావించినప్పుడు.. అన్ని వర్గాల నుంచీ తీవ్ర వ్యతిరేకత రావడమే కాకుండా, నెటిజనులు జనగ్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. అయినా తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్నట్లుగా జగన్ మావిగన్ ను వదల లేదు. తాజాగా 2029 ఎన్నికలలో వైసీపీ ప్రధాన నినాదం మావిగన్ అని ప్రకటించారు. అమరావతి కావాలనుకునే వారు తెలుగుదేశం కూటమికి, మవిగన్ కోరుకునే వారు వైసీపీకి ఓటు వేయాలంటూ సవాల్ విసిరారు. 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న సమయంలో రుషికొండ ప్యాలెస్ నిర్మాణం సహా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖను గట్టిగా ప్రొజెక్ట్ చేసిన వైసీపీ, ఇప్పుడు హఠాత్తుగా ఆ నినాదాన్ని పక్కన పెట్టి మావిగన్ జపం చేయడంపై రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తం అవుతోంది. వైసీపీని, ఆ పార్టీ అధినేతను నెటిజనులైతే ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. రాజథాని విషయంలో జగన్ తరచుగా మాట మారుస్తుండటం, ఆయన పార్టీ వైసీపీకే నష్టం చేస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కేవలం మూడు రాజధానుల వల్లే సాధ్యమంటూ ప్రజల్లోకి వెళ్లిన వైసీపీ కేడర్.. ఇప్పుడు.. తూచ్ మూడు రాజధానులు కాదు.. మావిగన్ అంటూ ప్రజలలోకి ఎలా వెళ్లాలో తెలియక అయోమయానికి గురౌతోంది. రాజథాని విషయంలో ఒక స్థిరమైన విధానం లేకపోతే రాష్ట్రానికి పెట్టుబడిదారులు, పరిశ్రమలు ఎలా వస్తాయంటూ జగన్ విధానంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇక మరో వైపు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, ఆ ప్రభుత్వాధినేత చంద్రబాబు.. అమరావతిని ఏకైక రాజధానిగా విస్పష్టంగా పేర్కొంటూనే.. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు భారీగా పెట్టుబడులను, ఐటీ, పారిశ్రామిక ప్రాజెక్టులను వేగంగా తరలిస్తూ జగన్ మావిగన్ మంత్రాన్ని ప్రజలు ఇసుమంతైనా పట్టించుకోనవసరం లేదని చాటుతోంది. విశాఖపట్నం కేంద్రంగా మౌలిక వసతుల కల్పన, ఉపాధి అవకాశాల సృష్టిపై బాబు సర్కార్ ఫోకస్ పెట్టింది. రాజధానిని మార్చకుండానే ఉత్తరాంధ్ర), రాయలసీమ ప్రాంతాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేయవచ్చని చంద్రబాబు చేతల్లో చూపిస్తున్నారు. వచ్చే మూడేళ్లలో ఈ ప్రాజెక్టులు పూర్తై, యువతకు ఉపాధి కల్పిస్తే, వైసీపీ వాదన పూర్తిగా బలహీనపడుతుంది. తెలుగుదేశం మొదటి నుంచి అమరావతి విషయంలో ఒకే స్టాండ్‌తో ప్లస్ పాయింట్‌గా మారింది. 2029 ఎన్నికల కురుక్షేత్రంలో జగన్ తెచ్చిన మావిగన్ నినాదాన్ని ప్రజలు పట్టించుకునే అవకాశమే ఉండదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/jagan-mavigan-chant-45-224819.html




