మావిగన్.. పేరు ప్రచారానికే జగన్ పరిమితం.. వ్యూహమేంటో గందరగోళం.!
Publish Date:Jul 3, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు మావిగన్ హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. వచ్చే ఎన్నికలలో తమ నినాదం మావిగన్ రాజధాని అని ప్రకటించడం రాజకీయాలలో సంచలనంగా మారింది. పొలిటికల్ హీట్ క్రియేట్ చేసింది. అయితే ఎవరూ మెచ్చని, ఎవరికీ నచ్చని మావిగన్ నినాదం ప్రతిపాదన వెనుక జగన్ వ్యూహం ఏమిటన్నదానిపై ఇప్పుడు రాజకీయవర్గాలలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. మచిలీపట్నంలోని తొలి రెండు అక్షరాలు ఎమ్ఏ, విజయవాడ లోని తొలి రెండు అక్షరాలు విఐ, గుంటూరులోని తొలి మూడు అక్షరాలు జియుఎన్ లను తీసుకుని ఈ మూడు నగరాల కలయికే మావిగన్ అంటున్నారు జగన్. జగన్ గతంలో జపించిన మూడు రాజధానుల జపానికి, అప్పటి ఆయన సిద్ధాంతానికి ఇప్పుడు ఆయన చెబుతున్న మావిగన్ కు పొంతన లేదని పరిశీలకులు అంటున్నారు. గతంలో జగన్ మూడు రాజధానులు అన్నప్పుడు ఆయన చెప్పిన ఆ మూడు ప్రాంతాలూ వేర్వేరుగా దూరంగా ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆయన మూడు నగరాల కలయిక రాజధాని అంటున్నారు. అయితే ఇప్పుడు జగన్ గతంలో తాను చెప్పిన వికేంద్రీకరణకు తిలోదకాలిచ్చేసి.. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులను కలిపి కొత్త ప్లాన్ ను తెరపైకి తెచ్చారు. అయితే జగన్ చేసిన మావిగన్ ప్రతిపాదన.. మూడు రాజధానులని గతంలో ఆయన చెప్పిన దాని కంటే గందరగోళంగా, ఏ మాత్రం క్లారిటీ లేకుండా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ ప్రతిపాదిత మావిగన్ లో సచివాలయం ఎక్కడ ఉంటుంది? హైకోర్టు ఎక్కడ నిర్మిస్తారు? అసెంబ్లీ ఎక్కడ? అన్నదానిపై జగన్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. అసలా వివరాల జోలికి ఏ మాత్రం పోలేదు. ఈ మూడు ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరాలు కనుక రాజధానిని చేసేస్తే అమరావతి అభివృద్ధి చేయనవసరంలేదు కదా అన్నదే ఆయన ఉద్దేశంగా కనిపిస్తోంది. అయితే రాష్ట్రంలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అమరావతిలో ప్రతిష్టాత్మక భవనాల నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేస్తోంది. మరి జగన్ అధికారంలోకి వస్తే అమరావతిలో ఉన్న ఆ భవనాలనే వినియోగిస్తారా? లేక గతంలోలాగే అమరావతిని నిర్వీర్యం చేస్తారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ప్రశ్నలకు పరిశీలకులు భవిష్యత్ లో జగన్.. సపోజ్ ఫర్ సపోజ్ అధికారంలోకి వస్తే.. అమరావతిలో ప్రస్తుత ప్రభుత్వం నిర్మించిన భవనాలను వినియోగంలోకి తీసుకువచ్చే అవకాశాలు లేవని విశ్లేషిస్తున్నారు. ఇందుకు గతంలో అంటే జగన్ అధికారంలో ఉన్న సమయంలో అమరావతిలో నిర్మాణంలో ఉన్న భవనాలను పాడుపెట్టిన సంగతిని గుర్తు చేస్తున్నారు. అందుకే జగన్.. మావిగన్ విషయంలో తన వ్యూహాన్ని మూడేళ్ల తరువాత వచ్చే ఎన్నికల నాటి వరకూ వెల్లడించే అవకాశం ఇసుమంతైనా లేదని అంటున్నారు. ఎందుకంటే.. తాను అధికారంలోకి వస్తే ప్రస్తుత ప్రభుత్వం నిర్మించిన భవనాలను వినియోగంలోకి తీసుకువస్తామని చెబితే.. అమరావతికి ప్రత్యామ్నాయం మావిగన్ అంటూ జగన్ చెప్పిన మాటలు అబద్ధాలు అవుతాయి. అలా కాకుండా, వాటిని వినియోగించం, పాడు పెడతాం, పక్కన పెడతాం అని జగన్ ప్రకటిస్తే.. ప్రజలు ఇప్పటి నుంచే జగన్ ను పక్కన పెట్టేయడం మొదలెడతారు. విఫలమైన మూడు రాజధానుల సిద్ధాంతాన్నే జగన్ పట్టుకు వెళాడుతున్నారన్న అభిప్రాయం ప్రజలలోకి బలంగా వెడుతుంది. అందుకే.. జగన్ మావిగన్ ఏమిటో, ఆయన వ్యూహం ఏమిటో మరో మూడేళ్ల వరకూ వెళ్లడించకుండా.. మావిగన్ అన్న పేరును ప్రచారంలో ఉంచడానికే పరిమితమౌతారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. Teluguone, AP Capital Issue, Amaravati vs MAVIGUN, YS Jagan Mohan Reddy
http://www.teluguone.com/news/content/jagan-limits-mavigun-name-to-mere-publicity-45-224913.html





