కర్మయోగికి ... ఏంటి ఖర్మ!
Publish Date:Sep 9, 2016
Advertisement
అనగనగా ఓ అభాగ్యుడు! అతను రోడ్డుపై వెళుతుంటే హఠాత్తుగా స్పృహ తప్పి పడిపోయాడు! అప్పుడే అటుగా వెళుతున్న ఓ పెద్దాయన అతడ్ని చూసి తల్లడిల్లిపోయాడు. అరెరే పాపం అనుకుని తన వద్ద వున్న నీళ్లు తెచ్చి ముఖం మీద చల్లాడు. లేపి కూర్చోపెట్టి కాసిన్ని మంచి నీళ్లు తాగించాడు. మొత్తానికి సృహ తప్పిన అభాగ్యుడు ఇప్పుడు లేచి కూర్చున్నాడు! అంతలోనే ఏమైందో తెలుసా? స్పృహ తప్పిన అభాగ్యుడి బంధువులు ఎక్కడ్నుంచో రొమ్మలు బాదుకుంటూ వచ్చి పడ్డారు. తమ వాడు స్పృహ తప్పే దాకా చేష్టలుడిగి చూసిన ఆ దిక్కుమాలిన సంత ఇప్పుడు మాత్రం మా వాడికి కేవలం మంచి నీళ్లు తాగిస్తావా? కొబ్బరి నీళ్లు ఎందుకు తీసుకురాలేదు? సెలైన్ ఎందుకు ఎక్కించలేదు? అంటూ పెద్దాయన మీద పెంట పందుల్లా పడిపోయారు! దీన్నేమందం? తాను ధరించే పంచె తెల్లదనం, తాను వేసే పంచుల్లో వుండే హాస్యం ఎంత నిఖార్సుగా వుంటాయో... అంత నిఖార్సైన సీన్సియర్ అండ్ సీనియర్ నేత వెంకయ్య నాయుడు! ఆయనే ఇంతదాకా మనం చెప్పుకున్న కథలో పెద్దాయన! హఠాత్తుగా స్పృహ తప్పిన అభాగ్యుడే... అవశేష ఆంధ్ర రాష్ట్రం! ఇక బంధువులు ఎవరు అంటారా? ఎవరైతే హైద్రాబాద్ కు దూరమై, నానా హైరాన పడి ఇంకా కోలుకోలేకపోతోన్న నవ్యాంధ్ర ఏర్పాటుకి కారకులో... వారే! అంటే ఇక్కడా, అక్కడా అధికారంలో వుండి సమైక్యాంధ్రని సమస్యాత్మకంగా విభజించిన కాంగ్రెస్! ఆ కాంగ్రెస్ లోంచే కపటంగా పుట్టుకొచ్చిన పిల్ల కాంగ్రెస్! 2009 నుంచీ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అంశాన్ని నాన్చి, నాన్చి, కుళ్లిపోయేలా చేసి, దేశమొత్తం దుర్వాసన వ్యాపించేలా చేసి... అప్పుడు విభజనకి పూనుకుంది కాంగ్రెస్. 2014లో చిట్టచివరి రోజున పార్లమెంటు తలుపులు మూసేసి తెలుగు ప్రజల మధ్య తన ఇష్టానుసారం అడ్డుగీత గీసి రాష్ట్ర విభజన అయిందనిపించింది. అటువంటి సమయంలోనే మన వెంకయ్య నాయుడు రాజ్యసభ వేదికగా గళమెత్తారు. అసలు అనాడు రాష్ట్రం తరుఫున సభలో కూర్చున్న ఏ తెలుగు ఎంపీ అడగకున్నా ... కర్ణాటక నుంచి ఎంపీ అయిన ఆయనే... ప్రత్యేక హోదా కోసం గొంతు చించుకున్నారు. మాట్లడటమే మహాబాగ్యం అన్నట్టు కూర్చునే మౌనమోహన సింగ్ చేత మాట ఇప్పించారు. ప్రత్యేక హోదా ఇస్తామనిపించారు! అంటే... ఆ రోజు ఇదే వెంకయ్య ... నాకుందుకయ్యా అనుకుంటూ ఊరుకుని వుంటే ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి ఏమై వుండేది? ఇవాళ్ల ప్రత్యేక హోదా కావాల్సిందే అంటూ సర్కాస్ చేస్తోన్న జోకర్ సన్నాసులంతా సోదిలో కూడా వుండేవారు కాదు! ఈ మధ్యే ఏర్పడ్డ ఛత్తీస్ గడ్, జార్ఖంఢ్ లకు కేంద్రం ఏ ప్రత్యేక హోదా ఇస్తోంది? అలాగే మనమూ మట్టిగొట్టుకు పోయేవాళ్లం. అనాడు కాంగ్రెస్ పన్నిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు అమోదం అనే పద్మవ్యూహంలో వెంకయ్య తెగించి నిలిచారు. నినదించి ప్రత్యేక హోదా హామీ సాధించారు. ఆ ఒక్క పని వల్లే ఇవాళ్ల ఆయన పంచె వుడదీసి కొడతామని పిట్టల దొరల్లా మాట్లాడుతోన్న కామెడీగాళ్లకు విషయం దొరికింది. ఊడదీయాల్సింది వెంకయ్య పంచె కాదు... తరిచి చూడాల్సింది ఆయన మనసులోని నిజాయితీ. ఆంధ్రుడై పుట్టినందుకు అవమానాలు ఎదురైనా, అడ్డంకులు ఎదురైనా, అడ్డమైన వాళ్ల విమర్శలు వినాల్సి వస్తోన్న ఆయన ఢిల్లీలో తెలుగు సంక్షేమం సాధిస్తున్నారు! సింహం లాంటి సింహపురి పెద్దాయన తనే స్వయంగా చెప్పినట్టు ... తన వల్లే చర్చలోకి వచ్చిన ప్రత్యేక హోదా అంశాన్ని తనకే వ్యతిరేకంగా సంధిస్తున్నారు లెఫ్టు లిల్లీపుట్లు, వైసీపీ వైరీ పక్షం వారు. కాని, దేశం మొత్తంలోని అన్ని పార్టీలు కలిసి అమోదించిన 14వ ఆర్దిక సంఘం సిఫారసులు ప్రత్యేక హోదా అసాధ్యం చేశాయి. ఇది 2014లో వెంకయ్య హోదా అడిగిన నాడు లేని పరిస్థితి. కాని, ఇప్పుడంతా తలకిందులైంది. అయినా ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక ప్రకటనగా మారింది! దీనికి కారణం ఎవరు? వైసీపీ ఎంపీలా? పోనీ టీడీపీ ఎంపీలు, కేంద్ర మంత్రులా? 282సీట్లున్న మోదీ సర్కార్ సైకిల్ ను చూసి నిజంగా గజగజ వణికిపోతుందా? అసలు వాస్తవ పరిస్థితుల్లో జైట్లీ లాంటి ఉత్తరాది నేతలు మన తెలుగు నేతల మాటలు వింటారా? పవన్ కళ్యాణ్ చెప్పినట్టు మనోళ్ల హిందీ ఢిల్లీ నాయకులకి అర్థం అవుతుందా? ఈ అన్ని ప్రశ్నలు సరిగ్గా వేసుకుంటే వచ్చే సమాధానం... వెర్సటైల్ వెంకయ్య నాయుడు! బీజేపిని శాసించే అరెస్సెస్ నుంచి లాలూ నడిపించే ఆర్జేడీ వరకూ వెంకయ్యని గౌరవించనిదెవరు? ఇంగ్లీష్లో ట్రబుల్ షూటర్ అంటూ జాతీయ మీడియా కూడా చెప్పుకొచ్చే వెంకయ్య గారి అనర్గళమైన హిందీనే ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పటికొచ్చినంతైనా తీసుకొచ్చింది. ఒక్కసారి ఆలోచించండి... మొన్నటి దాకా కర్ణాటక నుంచి, ఇప్పుడు రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తోన్న ఈ నాయుడుగారే లేకుంటే... కొత్త రాష్ట్రం ఎంతగా నాశనం అయ్యేదో! ఊరికే మాటలు కాదు... వెంకయ్య వేయి మార్గాల్లో ప్రత్యేక హోదా అనే టానిక్ తప్పి పోయిన ఏపీకి... టాబ్లెట్స్ వేయిస్తున్నారు! అవ్వేవీ లేకపోతే, ఇక ముందు ఆయన చొరవతో వచ్చేవి రాకపోతే... ఏపీ కూడా మరో కొత్తగా ఏర్పడ్డ వెనుకబడిన రాష్ట్రమైపోతుంది! ఇది ఒట్టి మాట కాదు... గట్టి తార్కణం వున్న సత్యం.మోదీ ప్రధానిగా కొలువుతీరిన మొట్ట మొదటి క్యాబినేట్ నిర్ణయాలు గుర్తున్నాయా? పోలవరం ముంపు మండలాల్ని ఆంద్రలో కలిపారు! అంటే పాలన మొదలైన మొదటి రోజు నుంచే ఏపీకి లబ్ది చేకూరుతోంది. ఇందులో సాక్షాత్తూ మోదీ కంటే సీనియర్ అయిన మన వెంకయ్య నాయుడు పాత్రేం లేదంటారా? పోలవరం ఆంధ్రలకి అమృత కలశం లాంటిది. దాన్ని సుసాధ్యం చేయటానికి కేంద్ర మంత్రిగా ఆయన చేస్తున్న కృషేం లేదంటారా? ఆయన ప్రమేయం లేకుండానే ఒరిస్సా, ఛత్తీస్ గఢ్ లాంటి రాష్ట్రాలన్నీ పోలవరం కట్టుకొమ్మని చెప్పేస్తాయా? అసలు వేల కోట్ల పోలవరానికి వంద శాతం కేంద్ర నిధులు ఎవరు తీసుకొచ్చారు? ఖాళీ సమయం దొరికినప్పుడు సభలు, ప్రెస్ మీట్లు పెట్టే గడ్డం పెంచుకున్న టాలీవుడ్ హీరోలా? ఈ రియల్ హీరోనే కదా... జనానికి నేరుగా కడుపునింపే ప్రతీ పైసా ఢిల్లీ నుంచి తెస్తోంది! తెలంగాణ నుంచి విడిపోయిన ఆంధ్ర ప్రదేశ్ తొలి రొజులు గుర్తున్నాయా? ఆంధ్రప్రదేశా? అంధ ప్రదేశా అన్న అయోమయం వుండేది. అంతటి విద్యుత్ లోటు ఈ విల్లు చేతిలో లేని వీరుడే కదా పూడ్చింది. మోదీ సర్కార్ 24గంటల ఉచిత విద్యుత్ తమ బీజేపి రాష్ట్రాల్ని పక్కన పెట్టి టీడీపీ పాలిత రాష్ట్రానికి ఎందుకిచ్చింది? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వెంకయ్య నాయుడి స్వరాష్ట్రం కాబట్టి! బీజేపి నేతల దృష్టిలో ఏపీకి వుండే గుర్తింపు అదే! ఒక గుజరాత్ మోదీది, ఒక ఉత్తరప్రదేశ్ వాజ్ పేయ్ ది, ఒక ఆంధ్రా వెంకయ్యది! అంతలా ఆయన తన మాతృభూమి కోసం ఆరాటపడతారు. అందుకు ఏ మాత్రం సిగ్గుపడరు. ఒక సారి తెలంగాణ వాదులు నిందమోపినా, ఇప్పుడు తెంపరితనంతో ఆంధ్ర నేతలే అమానుషంగా మాట్లాడుతున్నా.... ఆయన అనుక్షణం తెలుగు తల్లి కోసం తల్లడిల్లుతూనే పుంటారు! అదే ఆయన గొప్పతనం, ఇంకా చెప్పాలంటే తెలుగుజాతి కోసం తపించే వెంకయ్యదనం! కేవలం పోలవరంతో నీళ్లు ఇచ్చి, విద్యుత్ వెలుగులతో ఇళ్లు వెలిగించి చేతులు దులుపుకోలేదు ఈ తెలుగు వారి రెండో వెంకన్న! తిరుపతి లడ్డుల్లాంటి ఎన్నో తియ్యనైన , మహా ప్రసాదం లాంటి ప్రాజెక్ట్ లు తీసుకొచ్చారు. విద్యారంగమైన ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్, ఐఐటీ సహా ఎన్ని సంస్థలు వచ్చాయో తరచి చూసుకోండి. పారిశ్రామిక రంగమైతే ఇప్పటికే వచ్చిన ఫ్యాక్టరీలు, రేవులు కాదు రానున్న విశాఖ, చేన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఏంటో తెలుసుకోండి. దాని వల్ల కలిగే లాభాలేంటో ఓపికున్నంత సేపు చర్చించుకోండి! రోడ్ల కోసం గడ్కరీని, విమానాల కోసం మన వాడే అయిన అశోక్ గజపతిని, రైల్వేల కోసం సురేష్ ప్రభూని, మొత్తంగా ఆంధ్రా మౌలిక సదుపాయాల కోసం వీలున్నప్పుడల్లా మోదీని... ఎవరు అడుగుతున్నారు? అప్రమత్తం చేస్తున్నారు? ఇలా చెబుతూ పోతే అత్యంత సుదీర్ఘమైన వెంకయ్య రాజకీయ జీవితంలానే అంతం లేకుండా పోతుంది ఆయన నూతన తెలుగు రాష్ట్రానికి చేసిన మేలు కూడా! ఇక్కడ చెప్పుకోవాల్సింది కర్మయోగి లాంటి వెంకయ్య చేసిన పనుల గురించి కాదు! ప్రతిఫలం ఆశించని ఆయనకు ఈ విమర్శల ఖర్మేంటని? అసలు మీడియా, ప్రతిపక్షాలు, మేధావులు అందరూ కలిసి ఒక రాజస్తాన్ కు చెందిన రాజ్యసభ సభ్యుడ్ని తెలుగు వారికి ద్రోహం చేశాడంటున్నారంటేనే... ఆయనేదో జనానికి ఉపయోగపడే నిజమైన మంచి పని చేసుంటాడని అర్థం! అలాంటి జనం వైపున్న వారికే దాదాపుగా అందరికందరూ వ్యతిరేకం అవుతారు!
వెంకయ్య గారు... మీరు మా నవ్యాంధ్ర రథానికి శ్రీకృష్ణుడి వంటి సారథి. ప్రత్యక్షంగా యుద్ధం చేయలేదు కాబట్టి కురుక్షేత్రంలో కృష్ణుడి పాత్రేం లేదనుకునే వాళ్లని ఎవ్వరం బాగుచేయలేం. అలాగే మీరు తెలుగు వారికి ఏం చేయలేదని వార్ని కూడా సరి చేయలేం! ఆ తోకలు వంకరే...
http://www.teluguone.com/news/content/-venkaiah-naidu-45-66263.html





