టారిఫ్ లతోనే అమెరికాకు ఆదాయం.. ట్రంప్
Publish Date:Feb 24, 2026
Advertisement
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రెండో సారి అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత తన ట్రంపరి తనంతో అమెరికాను ఒంటరిని చేయడం విషయంలో వడివడిగా అడుగులేస్తున్న ట్రంప్.. తాజాగా అమెరికన్ కాంగ్రెస్ను ఉద్దేశించి ప్రసంగిస్తూ మరో సారి తన ప్రభుత్వ విధానాలపై విస్పష్ట ప్రకటన చేశారు. అదలా ఉంచితే.. ఆయన ప్రసంగం ఆద్యంతం మధ్యంతర ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే సాగింది. ట్రంప్ టారిఫ్లను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో.. ట్రంప్ సర్కార్ ట్రేడ్ యాక్ట్ 1974లోని మరో సెక్షన్ను ఉప యోగించి అన్ని దేశాల దిగుమతులపై 15 శాతం గ్లోబల్ టారిఫ్ విధించిన సంగతి తెలిసిందే. తన తాజా ప్రసంగంలో ఆ నిర్ణయాన్ని సమర్ధించుకున్న ట్రంప్ ట్రంప్ అమెరికా పౌరులపై ఆదాయపు పన్ను భారం తగ్గించి విదేశీ దిగుమతులపై సుంకాల ద్వారానే ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చాలన్నది తన లక్ష్యమని చెప్పారు. ట్రంప్ 15 శాతం గ్లోబల్ టారిఫ్ 150 రోజుల పాటు అమల్లో ఉంటుంది. ఆ తర్వాత దీనిని పొడిగించాలంటే కాంగ్రెస్ ఆమోదం తప్పనిసరి. దీంతో అమెరికన్లకు ఇన్ కం టాక్స్ ఎత్తివేస్తానంటూ ప్రకటించడం ద్వారా గ్లోబల్ టారిఫ్ కు కాంగ్రెస్ మద్దతు పొందాలన్న లక్ష్యంతో ట్రంప్ ఉన్నారని అవగతమౌతున్నది. అలాగే ఇరాన్ పై సైనిక చర్యకు వెనుకాడబోనంటూ ట్రంప్ చేసిన ప్రకటన కూడా ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనకు కారణమైంది. మొత్తం మీద ట్రంప్ సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించైనా సరే తన టారిఫ్ టెర్రర్ ను కొనసాగించే ఉద్దేశంతో ఉన్నట్లు ఆయన తాజా ప్రసంగం స్పష్టం చేసింది.
http://www.teluguone.com/news/content/anerica-income-through-tariffs-36-214621.html





