జలమండలి జీఎం ఇంటిపై ఏసీబీ సోదాలు...రూ.200 కోట్లకుపైగా ఆస్తుల గుర్తింపు!
Publish Date:May 19, 2026
Advertisement
హైదరాబాద్ నగరంలో ఉదయం నుండి ఓ అవినీతి తిమింగలం ఇంట్లో నిరోధక శాఖ (ఏసీబీ) సోదాలు కొనసాగిస్తూ ఉండడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. హైదరాబాద్ జలమండలి జనరల్ మేనేజర్ అనంత లక్ష్మి కుమార్ నివాసంలో ఈరోజు ఉదయం నుండి ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దాదాపు 10 గంటల పైగా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఏసీబీ అధికారులు ఈరోజు తెల్లవారుజాము నుండి హైదరాబాదు నగరంలో ఏకకాలంలో మొత్తం ఎనిమిది చోట్ల విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మల్లాపూర్‌లోని జలమం డలి జనరల్ మేనేజర్ అనంత లక్ష్మి కుమార్ నివాసంలో సోదాలు నిర్వహించారు. ఇంట్లో ఎక్కడపడితే అక్కడ కుప్పలు కుప్పలుగా ఉన్న డబ్బులు అన్ని చూసి అధికారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.. ఇంట్లో రూ.1 కోటి కంటే ఎక్కువ నగదు, సుమారు ఒక కిలో బంగారం, బ్యాంక్ లాకర్ నుంచి అదనంగా రెండు కిలోల బంగారం, కిలోల కొద్దీ బంగారు ఆభరణాలు, రెండు కార్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ భారీ స్థాయిలో ఆస్తులు వెలుగులోకి వస్తున్నాయి. అధికారుల దర్యాప్తులో హైదరాబాద్‌లో గేటెడ్ కమ్యూనిటీల్లో మూడు ఫ్లాట్లు, మరో ఆరు ఓపెన్ ప్లాట్లు, కమర్షియల్ కాంప్లెక్స్, విల్లాలు, అదనంగా నిజామాబాద్‌లో మూడు ఎకరాల భూమి, 39 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పలు బ్యాంక్ అకౌంట్లు, లాకర్లు కూడా ఉన్నట్లు వెల్లడైంది.సోదాల్లో భాగంగానే ఏసీబీ అధికారులు జీఎం కుమార్ భార్యను వెంట తీసుకుని బ్యాంకుకు వెళ్లి లాకర్లు తెరిపించారు. లాకర్లలో ఉన్న పత్రాలు, ఆస్తుల వివరాలను పరిశీలించిన అధికారులు మరిన్ని ఆస్తులకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు లభించినట్లు గుర్తించారు. లాకర్ల పరిశీలన పూర్తయ్యాక వాటిని తిరిగి నివాసానికి తీసుకువచ్చి పరిశీలన కొనసాగించ నున్నట్లు సమాచారం... ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న పత్రాలు, వివరాల ఆధారంగా మార్కెట్ విలువ ప్రకారం మొత్తం ఆస్తుల విలువ రూ.200 కోట్లకు పైగా ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. మల్లాపూర్ లోని కుమార్ ఇంట్లో ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు...సోదాలు రాత్రి వరకు కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
http://www.teluguone.com/news/content/acb-raids-jalmandali-gms-house-36-220320.html





