వడ్లు కొనమంటే ఉద్యోగం తీస్తారా? జగిత్యాల ఆర్టీసీ డ్రైవర్ కన్నీటి గాథ!
Publish Date:May 26, 2026
Advertisement
తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఒక సాదాసీదా ఆర్టీసీ బస్సు డ్రైవర్ అన్న మాటలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. కేవలం రైతుల కష్టాలను గుర్తుచేస్తూ మాట్లాడినందుకు, జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ అశోక్ తన జీవనోపాధిని కోల్పోవాల్సి వచ్చింది. ఈ ఘటన తెలంగాణ సమాజంలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. అసలు ఆ రోజు ఏం జరిగింది? డ్రైవర్ అశోక్ చేసిన తప్పేంటి? అధికారులు ఎందుకు అంత కఠిన నిర్ణయం తీసుకున్నారు? అనే విషయాలు ఇప్పుడు అందరినీ కలచివేస్తున్నాయి. జగిత్యాలలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్, స్థానిక ఎమ్మెల్యేలు మరియు కీలక నాయకులు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ డ్రైవర్ అశోక్ ఎప్పటిలాగే తన బస్సును నడుపుకుంటూ ఆ మార్గంలో వచ్చారు. ధర్నా కారణంగా రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోవడంతో, అశోక్ తన బస్సును రోడ్డు పక్కన సురక్షితంగా నిలిపి ఉంచారు. ఆ సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో అక్కడ కొందరు మజ్జిగ ప్యాకెట్లు పంచుతున్నారు. డ్రైవింగ్ సీట్లో ఉన్న అశోక్ కూడా ఒక మజ్జిగ ప్యాకెట్ తీసుకున్నారు. అదే సమయంలో అక్కడ ధర్నాలో పాల్గొంటున్న వారిలో అశోక్ స్వగ్రామానికి చెందిన ఒక వ్యక్తి కనిపించారు. కుశలప్రశ్నల అనంతరం, అక్కడ ఏం జరుగుతోందని అశోక్ సదరు వ్యక్తిని ఆరా తీశారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేస్తున్నారని ఆయన చెప్పడంతో, అశోక్ చాలా సాధారణంగా స్పందించారు. "పెట్రోల్, డీజిల్ రేట్ల గురించి తర్వాత కూడా ఆందోళన చేయొచ్చు కానీ, ప్రస్తుతం మార్కెట్లలో వడ్లు, మక్కలు (మొక్కజొన్న) కొనుగోలు కాక రైతులు తీవ్రంగా పరేషాన్ అవుతున్నారు. కాబట్టి ముందు వడ్లు కొనాలని, రైతుల సమస్యల గురించి మాట్లాడండి" అని ఒక చిన్న సూచన చేసి, అక్కడి నుంచి బస్సు తీసుకుని వెళ్లిపోయారు. రైతుల ఆవేదనను తెలియజేస్తూ మాట్లాడిన ఈ చిన్న మాటలే అశోక్ పాలిట శాపంగా మారాయి. ఈ విషయం కాస్తా ఉన్నతాధికారుల వరకు చేరడంతో తీవ్ర కలకలం రేగింది. రాజకీయ నిరసనల వద్ద ప్రభుత్వ ఉద్యోగి ఇలా మాట్లాడటం క్రమశిక్షణా రాహిత్యం కిందకు వస్తుందని భావిస్తూ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ (ఆర్ఎం) అత్యంత వేగంగా స్పందించారు. డ్రైవర్ అశోక్‌ను తక్షణమే విధుల నుంచి తొలగిస్తూ రిమూవల్ లెటర్ జారీ చేశారు. అంతేకాకుండా, చుట్టుపక్కల ఉన్న 5 డిపోల పరిధిలో ఎక్కడా కూడా అశోక్‌కు తిరిగి విధులు కేటాయించవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఒక్కసారిగా అశోక్ ఉద్యోగం కోల్పోయి రోడ్డున పడ్డారు. ఈ అన్యాయమైన చర్యపై డ్రైవర్ అశోక్ మీడియా ముందు కన్నీటిపర్యంతమయ్యారు. తానూ ఒక రైతు బిడ్డనని, రైతుల కష్టాలు కళ్లారా చూసి తట్టుకోలేక ఆ మాట అన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. "నేను ఏ రాజకీయ నాయకుడి పేరు ఎత్తలేదు, ఏ రాజకీయ పార్టీ గురించి మాట్లాడలేదు. ఎవరినీ వ్యక్తిగతంగా దూషించలేదు. కేవలం రైతుల పరిస్థితి ఘోరంగా ఉంది, రోహిణి కార్తె వస్తోంది. ఒకవేళ వర్షాలు పడితే ఆరు నెలల నుంచి రైతులు పడ్డ కష్టమంతా బురదపాలవుతుందని మాత్రమే అన్నాను" అని వాపోయారు. డీఎం తనను పిలిచి, ఆర్‌ఎం నుంచి లెటర్ వచ్చిందని, ఇకపై ఉద్యోగానికి రావద్దని చెప్పినప్పుడు తన గుండె పగిలిపోయిందని అశోక్ కన్నీరు పెట్టుకున్నారు. కేవలం రైతుల పక్షాన నిలబడినందుకు ఒక సామాన్య కార్మికుడి పొట్టగొట్టడం ఎంతవరకు న్యాయమంటూ ఇప్పుడు ప్రజలు, విపక్షాలు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/jagityala-rtc-driver-ashok-36-220916.html





