ఆ గణపతికి తొండం వుండదు! ఎందుకో తెలుసా?
Publish Date:Sep 9, 2016
Advertisement
వినాయక నవరాత్రులు దేశమంతటా మహా వైభవంగా సాగుతున్నాయి. అయితే, ఏ దేవుడ్ని పూజించినా తొలి పూజ తాను అందుకుని మనకు అనుజ్ఞ ఇచ్చే విఘ్నేశ్వరుడు ఈ నవరాత్రి ఉత్సవాల వేళ మరింత ముఖ్యమైపోతాడు! అంతే కాదు, గణపతి మిగతా అందరు దేవుళ్లకంటే చాలా చాలా పాప్యులర్ కూడా! చిన్న పిల్లలు మొదలు వృద్ధుల దాకా అందరికీ ఆయన ఫేవరెటే! సామాన్యంగా దేవుడి జోలికి పెద్దగా వెళ్లని యూత్ ని కూడా సినిమాలు, ప్రేమ, దోమా లాంటి అన్ని వ్యాపకాల నుంచి పదకొండు రోజులు దూరం చేసి మండపాల్లో బుద్దిగా కూర్చోబెడతాడు గణఫయ్య! అయితే, లంబోదరుడికి ఊరూరా , వీధి వీధినా పూజలందుకునే ప్రత్యేకతే కాదు ఇంకా బోలెడు విశేషాలున్నాయి. ఆయన్ని భక్తులు ఎవరికి తోచిన రూపంలో వారు పూజిస్తారు. ఒకరు మట్టితో చేస్తే మరోకరు సీసంతో, ఇంకొకరు గరికతో, మరొకరు ఆకుకూరలతో , పళ్లతో ఇలా ఇప్పటి వరకూ గణపతి రకరకాలుగా తయారు చేసుకున్న వారు బోలెడుమంది! మట్టితో మొదలు రాతితో వరకూ... ఏ పదార్థంతో చేసినా వినాయకుడి తల ఎలా వుంటుంది? ఏనుగు ముఖంతో వుంటుంది. అందుకే, ఆయనని గజాననుడని, ఏక దంతుడని, గజవక్త్రృడని రకరకాలుగా కీర్తిస్తుంటాం. దీనికి కారణం కూడా మనకు తెలిసిందే. పార్వతీ దేవీ నలుగు పిండితో బాలుడిని చేసి ద్వారం వద్ద వుంచితే శివుడొచ్చి ఆ బాలుడి తల నరికేస్తాడు. ఆ పసివాడు పరమేశ్వరుడ్ని అడ్డగించడమే కారణం. తరువాత గణపతికి ఏనుగు తల పెట్టి తిరగి బతికిస్తాడు శంకరుడు! ఇక అప్పట్నుంచీ గజ ముఖంతోనే అందరికీ దర్శనమిస్తుంటాడు లంబోదరుడు. పార్వతీ దేవీ చక్కనైన బాలుడిగా ప్రాణం పోసిన ఆది గణపతికి మనందరి లాగే నర ముఖం వుండేది. మరి ఆ ముఖంతో ఇప్పుడు మనం గజాననుని చూడలేమా? మామూలుగా అయితే చూడలేమనేదే సమాధానం. కాని, తమిళనాడులోని ఆ ఒక్క ఆలయానికి వెళితే మాత్రం నర ముఖంతో వున్న గజ ముఖుని చూడొచ్చు! తమిళనాడులోని తిరువరూర్ జిల్లాలో కూతనూర్ వద్ద పూన్ తొట్టమ్ కి దగ్గర్లో వుంటుంది తిలతర్పణపురం. పేరు వినగానే అర్థమైపోతోంది కదా దీని విశేషం ఏంటో? తిలలతో తర్పణాలు ఇవ్వటం ఇక్కడ మహా ప్రశస్తం. కాశీ, రామేశ్వరాల్లో ఎలాగైతే పితృ దేవతలకు తిల తర్పణాలు ఇస్తారో ఇక్కడ కూడా అలాగే సమర్పిస్తుంటారు. దీని వల్ల పితృ దోషం పోతుందని విశ్వాసం. తిలతర్పణపురం అధిష్టాన దైవం ముక్తేశ్వర స్వామి. ఈ శివుడి అర్థాంగి అయిన అమ్మవారి పేరు సువర్ణవళ్లి. సువర్ణవళ్లి, ముక్తేశ్వరుల దర్శనానికి వెళ్లిన భక్తులకు మొదట్లోనే కనిపిస్తాడు నర ముఖ గణపతి. శివాలయానికి ముందు భాగంలో ఈ ఆదిగణపతి ఆలయం వుంటుంది. మిగతా అందరు హిందూ దేవుళ్ల మాదిరిగా ఇక్కడ గజాననుడు మనిషి ముఖంతో భక్తుల్ని తరింపజేస్తుంటాడు. పార్వతీ దేవీ ప్రాణం పోసిన ఆదిమ సమయంలోని నర ముఖంతో వుంటాడు కాబట్టి ఇక్కడ ఈ వినాయకుడ్ని ఆది గణపతి అంటారు! తిలతర్పణ పుర ఆది గణపతి కేవలం రూపంలో మాత్రమే విభిన్నంగా వుండడు. ఆయన్ని పూజిస్తే కలిగే ఫలితాలు కూడా విభిన్నమే. ఆయన్ని స్వయంగా ఆగస్త్య మహర్షి సేవించాడంటారు! అంతే కాదు, ఈయన్ని మనం పూజిస్తే ఇంట్లో వారి మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొంటుందట! విద్యార్థులు, పిల్లలు ఈ ఆది దంపతుల తనయుడైన ఆది గణపతిని పూజిస్తే తిరుగులేని జ్ఞాపకశక్తి, తెలివితేటలు ప్రసాదిస్తాడని కూడా చెబుతారు! పెద్ద తొండం, పెద్ద పెద్ద చెవులు, ఏక దంతం... వీటితో దర్శనమిచ్చే మనకు తెలిసిన అపురూప గణపతి కొత్త రూపంలో కావాలంటే తిలతర్పణ పురం తప్పక వెళ్లండి! ఆదిశంకరుడు, అమ్మవారి కృపతో పాటూ ఆది గణపతి అనుగ్రహం కూడా పొందండి!
http://www.teluguone.com/news/content/---vinayak-chavithi-celebrations-45-66261.html





