మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంపై సభా తీర్మానం
Publish Date:Jan 2, 2026
Advertisement
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా వికసిత్ భారత్ – గ్యారెంటీ ఫర్ గ్రామీణ్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ చట్టం (వీబీజీ రామ్ జీ) ను తీసుకొచ్చింది. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ తెలంగాణ శాసనసభ తీర్మానం ఆమోదించింది. అసెంబ్లీ ఆమోదించిన ఈ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపనుంది. అత్యంత పేద ప్రజల కోసం రూపొందించిన ఉపాధి హామీ చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నరేగా ద్వారా ఇన్నేళ్లుగా పేదలకు ఉపాధి ఒక హక్కుగా లభిస్తోందని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ ఆవరణలో మంత్రి సీతక్క చిట్ చాట్ నిర్వహించారు. ఉపాధి హామీ పథకం పై మాట్లాడాల్సి వస్తుందనే బీఆర్ఎస్ సభ నుంచి వాకౌట్ చేసిందని ఆమె తెలిపారు. బీజేపీ కి బిఆర్ఎస్ సహాకరిస్తుందనే దానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. బీజేపీ- బిఆర్ఎస్ ఎజెండా ఓక్కటే.. కార్పోరేట్ ల కోసమే బీజేపీ, బిఆర్ఎస్ పనిచేస్తున్నాయిని సీతక్క తెలిపారు. అందుకే ఈరోజు చర్చలో బీఆర్ఎస్ పాల్గొనలేదు. ప్రధాని మోడీ మెప్పు కోసం బీఆర్ఎస్ పెద్దలు సభ ను బైకాట్ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ రద్దు చేసినా ఆ పార్టీ నోరు మెదపడం లేదు” అంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామీణ ప్రాంత పేదలకు ఉపాధి కల్పించి, పేద కుటుంబాలకు ఆర్థిక భరోసాను అందించేందుకు డా. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2005లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులోకి తీసుకు వచ్చింది. పేదరికం, నిరుద్యోగం, వలసలు, నైపుణ్యం లేని శ్రామిక వర్గాల దోపిడీ, స్త్రీ పురుషుల మధ్య వేతన అసమానతలను తగ్గించి అన్ని వర్గాల అభివృద్ధికి తెచ్చిన ఈ చట్టం 2006 ఫిబ్రవరి 2 నుంచి అమలులోకి వచ్చింది. ప్రతి గ్రామీణ కుటుంబానికి సంవత్సరానికి కనీసం 100 రోజుల ఉపాధి కల్పించి, కనీస వేతనం అందించే గ్యారంటీ ఈ చట్టం యొక్క ప్రధాన లక్ష్యం. గత 20 సంవత్సరాలుగా ఈ పథకం ద్వారా మన రాష్ట్రంలో లబ్ధి పొందిన వారిలో సుమారు 90 శాతం ఎస్సీలు, ఎస్టీలు, బీసీలున్నారు. వీరిలో 62 శాతం మహిళలు లబ్ధి పొందారు. దళితులు, గిరిజనులు, దివ్యాంగులు, అత్యంత వెనుకబడిన తెగలకు చెందిన ఆదివాసీలు, చెంచులు, పేద వర్గాలే ఎక్కువగా ప్రయోజనం పొందారు. ప్రస్తుతం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ) చట్టం VB G RAM G -2025 పేదల హక్కులను దెబ్బతీసేలా ఉంది. ఈ పథకంపై ప్రధానంగా ఆధారపడ్డ గ్రామీణ ప్రాంత మహిళలు, బలహీన వర్గాల ఉపాధికి హామీ లేకుండా చేస్తోంది. పాత ఉపాధి హామీ పథకం ఆత్మను దెబ్బతీసే నిబంధనలు పేదల పాలిట శాపంగా మారనున్నాయి. ఆ కారణంగా ఈ సభ కింద తెలిపిన విధంగా తీర్మానిస్తోంది: 1. కొత్త చట్టం పేదల హక్కులకు వ్యతిరేకంగా ఉంది. ఉపాధి హామీ చట్టం యొక్క అసలు ఉద్దేశాన్ని దెబ్బతీస్తుంది. డిమాండ్ అనుగుణంగా పనుల ప్రణాళికను తయారు చేసే విధానానికి స్వస్తి పలికింది. డిమాండ్ ఆధారిత పాత విధానాన్ని కొనసాగించాలి. 2. కొత్త చట్టం మహిళా కూలీలకు వ్యతిరేకంగా ఉంది. ఇప్పుడు అమల్లో ఉన్న MGNREGAలో దాదాపు 62 శాతం మహిళలు కూలీ పొందేవారు. కొత్త చట్టంలో పొందుపరిచిన పరిమిత (నార్మేటివ్) కేటాయింపుల విధానం వల్ల పని దినాలు తగ్గిపోతాయి. దీంతో పేద కుటుంబాల్లోని మహిళలు నష్టపోతారు. మహిళా సాధికారత సాధించాలంటే పాత విధానం పునరుద్ధరించాలి. 3. ప్రస్తుతం ఉపాధి హామీ పథకంలో పూర్తిగా కేంద్రమే నిధులు కేటాయించేది. కొత్త చట్టం ద్వారా కేంద్ర-రాష్ట్ర నిధుల వాటా 60:40గా మార్చటం సమాఖ్య స్పూర్తికి విఘాతం కలిగిస్తుంది. ఇది రాష్ట్రాలపై అదనపు ఆర్థిక భారాన్ని మోపుతుంది. పాత నిధుల వాటా నమూనాను పునరుద్ధరించాలి. 4. మహాత్మాగాంధీ గారి పేరును ఈ పథకం నుంచి తొలగించటంతో గాంధీ గారి స్ఫూర్తిని నీరుగార్చినట్లయింది. 5. వ్యవసాయ సీజన్ లో 60 రోజుల విరామం తప్పనిసరిగా విధించడంతో భూమి లేని నిరుపేద కూలీలకు అన్యాయం జరుగుతుంది. ఉపాధి హామీ పథకాన్ని సంవత్సరం పొడవునా కొనసాగించాలి. 6. ప్రస్తుతం ఉపాధి హామీ ద్వారా 266 రకాల పనులు చేపట్టే వెసులుబాటు ఉంది. కొత్త చట్టంలో భూముల అభివృద్ధి వంటి శ్రమ ఆధారిత పనులు తొలిగించటంతో చిన్న సన్నకారు రైతులు, దళితులు, గిరిజనులు నష్టపోతారు. ఇప్పుడున్న పనుల జాబితాను యథాతథంగా అనుమతించాలి. ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకొని, MGNREGA చట్టంలో నిర్దేశించిన ఉద్దేశాలు, లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని కూలీ కుటుంబాల ఆకాంక్షలను నెరవేర్చేందుకు మహాత్మగాంధీ NREGA చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని ఈ సభ తీర్మానిస్తుంది.
http://www.teluguone.com/news/content/-mgnrega-36-211927.html




