వైకాపా నేతల ఆ విమర్శల వెనుక వ్యూహం ఏమిటో?
posted on Dec 12, 2015 4:15PM
.jpg)
వైకాపా నేతలు అందరూ కూడబలుకొన్నట్లుగా ఒకేసారి మూకుమ్మడిగా తెదేపా ప్రభుత్వంపై , ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పిస్తుండటం చూస్తుంటే దాని వెనుక ఏదయినా సరికొత్త వ్యూహం సిద్దం చేసుకొన్నారా? అని అనుమానం కలుగుతోంది. ఆ పార్టీకి చెందిన బొత్స సత్యనారాయణ, వాసిరెడ్డి పద్మ, ధర్మాన ప్రసాదరావు ఒకేసారి మూడు వేర్వేరు ప్రాంతాల నుండి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. విజయవాడ నగరంలో బయటపడిన సెక్స్ రాకెట్, కల్తీ మద్యం, ఇసుక మాఫియా అంశాలను ప్రస్తావిస్తూ వారు విమర్శలు గుప్పించారు. కానీ బాక్సైట్ తవ్వకాల గురించి తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చేసిన పోరాటం గురించి ఎవరూ పెద్దగా మాట్లాడకపోవడం గమనార్హం.
ప్రత్యేక హోదా అంశంతో తెదేపా ప్రభుత్వాన్ని ఇరుకున పెడదామని ప్రయత్నించి చివరికి జగన్మోహన్ రెడ్డి చాలా అవమానకరంగా తన ఆమరణ నిరాహార దీక్షను ముగించవలసి వచ్చింది. ఆ తరువాత మళ్ళీ ప్రత్యేక హోదా ఊసే ఎత్తలేదు. అప్పటి నుండి అటువంటి అంశం కోసం వైకాపా నేతలు అన్వేషిస్తున్నారు. బాక్సైట్ తవ్వకాలకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగానే వైకాపా తమ పోరాటాలు కొనసాగించేందుకు మళ్ళీ మంచి బలమయిన కారణం దొరికిందని సంతోషపడ్డారు. కానీ వారి అత్యుత్సాహం కారణంగా అప్రమత్తమయిన ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాల కోసం తను జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేసింది. బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ వైకాపా పోరాడుతున్నప్పటికీ ప్రభుత్వం తీసుకొన్న ఆ నిర్ణయం దానికి బహుశః నిరాశ కలిగించి ఉండవచ్చును. ఒకప్పుడు మనసులో రాష్ట్ర విభజన జరగాలని కోరుకొంటూనే, మళ్ళీ దానిని వ్యతిరేకిస్తు పోరాడినట్లే, ఇప్పుడు బాక్సైట్ తవ్వకాల విషయంలో కూడా ప్రయత్నించింది. కానీ మళ్ళీ ఆ విషయంలో కూడా వైకాపా భంగపడింది.
చింతపల్లి సభకు బాగానే జనసమీకరణ చేసి విజయవంతం అయిందనిపించుకొన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తన ఉత్తర్వులను నిలిపివేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి చింతపల్లి వెళ్లి బహిరంగ సభ ఎందుకు నిర్వహించారోనని రాజకీయ వర్గాలలో వారు నవ్వుకొంటున్నారు. ఆ సభ నిర్వహించడం వలన వైకాపాకు కొత్తగా ఒరిగిందేమీ లేదు కానీ వైకాపా ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడటం వలన, ఆ సభ ద్వారా వైకాపా చెప్పాలనుకొన్నది ప్రజలకు చేరకపోగా తప్పుడు సంకేతాలు పంపినట్లయింది. సభలో జగన్ మాటల కంటే ఆమె మాటలే హైలైట్ అయ్యాయి. చివరికి ఆమెను పోలీసులు అరెస్ట్ చేసే పరిస్థితి కూడా కనబడుతోంది. ఇదంతా ఎలాగ ఉందంటే ఆపరేషన్ సక్సెస్ పేషంట్ డెడ్ అన్నట్లుంది.
నిజానికి వైకాపా నేతలందరూ తమ చింతపల్లి సభ విజయవంతం అవడం గురించి, బాక్సైట్ తవ్వకాల గురించి మాట్లాడి ఉండాల్సింది. కానీ ఎవరూ ఆ ప్రసక్తి ఎత్తడం లేదంటే మళ్ళీ మరోమారు తాము తప్పటడుగు వేశామని గ్రహించినట్లు అర్ధమవుతోంది. బహుశః అందుకే ప్రజల దృష్టిని దాని నుండి మళ్ళించడానికి వైకాపా నేతలందరూ కూడబలుకొన్నట్లు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నట్లున్నారు.