బ్యాంకులకి కావూరి కంపెనీ రూ. 1,000 కోట్లకు టోపీ?
posted on Dec 14, 2015 3:03PM
.jpg)
మాజీ ఎంపీ కావూరి సాంభశివరావుకి చెందిన ప్రోగ్రెసివ్ కంస్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ తమ బాకీలు తిరిగి చెల్లించడంలేదంటూ వేర్వేరు బ్యాంకులకు చెందిన ప్రతినిధులు హైదరాబాద్ లో అబీడ్స్ సెంటర్ వద్ద గల ఆయన కార్యాలయం ముందు ఈరోజు మౌన ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఒకటీ రెండు కాదు 18 బ్యాంకులకు ఏకంగా రూ. 1,000 కోట్లు ఆయన సంస్థ బాకీలు పడింది. ఆ సంస్థ చేపడుతున్న వివిధ ప్రాజెక్టుల కోసం తమ వద్ద నుండి అప్పులు తీసుకొందని తరువాత ఎన్ని సార్లు అడిగినా తిరిగి చెల్లించడం లేదని సదరు బ్యాంకులు ఆరోపిస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. సామాన్య ప్రజలు ఎవరయినా చిన్న మొత్తం అప్పు తీసుకొంటే దానిని వారి వద్ద నుండి ముక్కుపిండి వసూలు చేసే బ్యాంకులు ఏకంగా వెయ్యి కోట్లు ఒక ప్రజా ప్రతినిధికి చెందిన సంస్థకు ఇవ్వడం, అది ఆయన తిరిగి చెల్లించనపుడు దానిని వసూలుచేసుకోలేక...కనీసం ఆయనను గట్టిగా నిలదీసి అడగలేక ఆయన కార్యాలయం ముందు మౌన ప్రదర్శన చేయడం చేయడం అవి ఎంత నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నాయో స్పష్టం అవుతోంది. బ్యాంకులు అంత బారీ రుణాలు ఆయన సంస్థకు ఇచ్చేయంటే ఏదో ఒక హామీ తీసుకొనే ఉంటాయి. కోర్టుకు వెళ్లి వాటిని వేలం వేసి తమ బాకీ రాబట్టుకొనే ప్రయత్నం చేయకుండా, ఈవిధంగా ఆయన కార్యాలయం ముందు నిలబడి మౌనప్రదర్శన చేయడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఒక ప్రజాప్రతినిధిగా పనిచేసిన కావూరి ప్రజలకి ఆదర్శంగా వ్యవహరించాలి. కానీ ఆయనే ఈవిధంగా బ్యాంకు బకాయిలు చెల్లించకుండా వారికి ఈ దుస్థితి కల్పించడం చాలా శోచనీయం. ఇటువంటి విషయాలలో సామాన్యులపట్ల బ్యాంకులు ఏవిధంగా కటినంగా వ్యవహరిస్తాయో, అదేవిధంగా కావూరి సంస్థతో కూడా వ్యవహరించి ఉంటే ప్రజలు కూడా హర్షించేవారు. కానీ సామాన్యుల పట్ల ఒకవిధంగా డబ్బు, పలుకుబడి అధికారం ఉన్నవారి పట్ల మరో విధంగా వ్యవహరించడం వలన వారికి ప్రజల సానుభూతి, మద్దతు కూడా లభించదు. పైగా ఇటువంటి విమర్శలే ఎదుర్కోవలసి వస్తుంది.