గణేష్ లడ్డూ.. నిజంగానే అంత లక్కీనా?
posted on Sep 8, 2025 1:55PM

1994లో 450 రూపాయలతో కొలను మోహన్ రెడ్డి బాలాపూర్ లడ్డూను వేలం పాటలో దక్కించడంతో మొదలైన గణపతి లడ్డూ వేలం. క్రేజ్ ఏటికేడు విపరీతంగా పెరిగిపోతోంది. వేలం పాటలో గణపతి లడ్డూ ధర పెరుగుతూనే వస్తోంది. ఈ ఏడాది దశరథ్ గౌడ్ అనే వ్యక్తి వేలం పాటలో 35 లక్షల రూపాయలకు బాలాపూర్ లడ్డూని సొంతం చేసుకున్నారు.
ఇదే రికార్డ్ ధర అనుకుంటే మై హోం భూజా లడ్డూ ఏకంగా అరకోటి పైన.. అంటూ 51 లక్షల రూపాయల ధర పలికి బాలాపూర్ ను మించింది. అదే అనుకుంటే.. రిచ్ మండ్ విల్లాస్ వారి గణేష్ మండపంలో గణేష్ లడ్డూ వేలంలో ఏకంగా 2 కోట్ల 32 లక్షల రాపాయల ధర పలికి అన్ని రికార్డులనూ తుడిచి పెట్టేసి లడ్డూకా రాజా అనిపించుకుంది. బేసిగ్గా ఇలాంటి లడ్డూలను కైవసం చేసుకోవడం ద్వారా బాగా కలసి వస్తుందని, వచ్చిందని అంటారు లడ్డూ విన్నర్స్. అంతే కాదు కొందరైతే ఈ లడ్డూ పొడిని తమ పొలాల్లో చల్లడం వల్ల పంటదిగుబడి ఎక్కువగా వచ్చిందని, వస్తుందని విశ్వసిస్తారు.
మైహోం భూజా లడ్డూ వేలం పాడిన గణేష్ అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆయన ఈ వేలం దక్కించుకోవడం ఇది రెండో సారి. ఆయనేమంటారంటే లడ్డూను వేలంలో దక్కించుకున్న తరువాత తనకు వ్యాపారంలొ బాగా కలిసి వచ్చిందని, అందుకే రెండో సారి కూడా వేలంలో గణేష్ లడ్డూని దక్కించుకున్నానని చెప్పారు.
రిచ్ మండ్ లడ్డూ వేలం ద్వారా వచ్చిన సొమ్ము పేద పిల్లల చదువుల కోసం వాడుతామని అంటారు ఈ గణేష్ మండప నిర్వాహకులు. ఇవి పెద్ద ఎత్తున ధర పలికిన లడ్డూలు కాబట్టి వీటి పేరు వెలుగులోకి వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఇలాంటి లడ్డూ వేలం వార్తలు చాలానే ఉన్నాయ్. అంతెందుకూ.. విదేశాల్లో తెలుగు సంఘాల వారు ఏర్పాటు చేసే గణేష్ మండపాలలో కూడా లడ్డూ వేలం జరుగుతూ ఉంటుంది. లడ్డూ వేలంలో ఇటు భక్తి అటు సెంటిమెంటు కలగలసి కనిపిస్తుంది. అంతే కాదు దీని ద్వారా ఇటు పేరుకు పేరు అటు అదృష్టానికి అదృష్టంగా భావిస్తుంటారు.. ఈ వేలం పాటల్లో పాల్గొనేవారు.