సుప్రీం ఆదేశాల మేరకు సరెండర్ అయిన పిన్నెల్లి బ్రదర్స్
posted on Dec 11, 2025 6:47PM

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతడి సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి మాచర్ల కోర్టులో లొంగిపోయారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్యల కేసులో A6 పిన్నెల్లి రామకృష్ణారెడ్డి , A7 పిన్నెల్లి వెంకటరామిరెడ్డి నిందితులుగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి రెండు వారాల్లో లొంగిపోవాలంటూ పిన్నెల్లి సోదరులకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
నేటితో సుప్రీం కోర్టు గడువు ముగియడంతో గురువారం ఉదయం (ఈ నెల11న) మాచర్ల జూనియర్ సివిల్ కోర్టులో పిన్నెల్లి సోదరులు లొంగిపోయారు.ఈ ఏడాది మే 24న పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన అన్నదమ్ములు జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావులు దారుణ హత్యకు గురయ్యారు.
తెలంగాణలోని బంధవుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న బైక్‌ను కారుతో ఢీకొట్టి కింద పడిన ఇద్దరినీ బండరాళ్లతో కొట్టి హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ జంట హత్యల కేసులో మొత్తం 9 మందిని నిందితులుగా చేర్చారు. వారిలో ఏ6గా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఏ7గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి పేరును ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు.