ఆసియా కప్ నుంచి పాక్ వైదొలగుతుందా?
posted on Sep 17, 2025 3:30PM
.webp)
ఆసియా కప్ లో భాగంగా టీమ్ ఇండియాతో జరిగిన మ్యచ్ లో పాకిస్థాన్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. ఓటమి ఉక్రోషంతో పాకిస్థాన్ మ్యాచ్ అనంతరం భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వలేదంటూ లేనిపోని వివాదాన్ని సృష్టించి ఐసీపీ ముందు ఓ డిమాండ్ పెట్టింది. టీమ్ ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ రిఫరీని తొలగించాలన్నదే ఆ డిమాండ్.
అయితే ఐసీసీ ఆ డిమాండ్ ను తోసిపుచ్చింది. మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లూ షేక్ హ్యాండ్ ఇచ్చి పుచ్చుకోవాలన్ననిబంధన ఏదీ లేదని స్పష్టం చేసింది. దీంతో పాక్ కు ఓటమిని మించిన పరాభవం ఎదురైంది. పుండుమీద కారం చల్లిన చందంగా ఐసీసీ తమ డిమాండ్ ను నిర్ద్వంద్వంగా తిరస్కరించడం ఒక ఎత్తైతే.. ఆసియాకప్ లో ఆడుతున్న జట్లేవీ కూడా పాకిస్థాన్ డిమాండ్ కు మద్దతు ఇవ్వలేదు. అంతేనా పాక్ మాజీ క్రికెటర్లు కూడా తన దేశ జట్టుపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇంటా బయటా విమర్శలు చుట్టుముడుతున్న నేపథ్యంలో ఈ టోర్నీ నుంచి అర్థంతరంగా వైదొలగడమే మేలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
మొత్తం మీద క్రికెట్ ప్రపంచంలో పాకిస్థాన్ ఒంటరి అయిపోయింది. ఐసీసీ ఛీ కొట్టినా దులిపేసుకుని టోర్నీలో కొనసాగడమంటే ఉన్న కాస్త పరువునూ మంటగలుపుకోవడమే అవుతుందని భావిస్తున్న పాకిస్థాన్ టోర్నీ నుంచి వైదొలగడమే మంచిదని నిర్ణయించుకుందని అంటున్నారు. యూఏఈ తో పాకిస్తాన్ బుధవారం (సెప్టెంబర్ 17) తలపడాల్సి ఉంది. అయితే పాక్ ఆటగాళ్లు ప్రీ మ్యాచ్ మీడియా సమావేశాన్ని క్యాన్సిల్ చేసుకోవడంతో పాక్ టోర్నీ నుంచి వైదొలగాలన్న నిర్ణయానికి వచ్చేసినట్లుగానే అర్ధం చేసుకోవాలని క్రీడాపండితులు అంటున్నారు. అయితే పాక్ ప్లేయర్లు నెట్ ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొనడంతో పాక్ ఆసియా కప్ టోర్నీలో కొనసాగుతుందా? వైదొలగుతుందా అన్న విషయంలో సందిగ్ధత నెలకొంది.