జీవన సౌఫల్యానికి నియమాలు ఎందుకు అవసరం??


జీవితమే సఫలము అంటాడు ఓ కవి. సఫలం అవ్వడం అంటే జీవితానికి సార్థకత చేకూరడం వంటిది అని అర్థం. ప్రతి మనిషికి జీవితంలో చేసిన పనికి సఫలత లభిస్తే అప్పుడే తృప్తి లభిస్తుంది. లేకపోతే జీవితం ఎప్పుడూ చప్పిడి అన్నంగానూ, చేదు మాత్రగానూ అనిపిస్తుంది. అంటే… మనిషికి జీవితంలో లభించే ఫలితమే అతన్ని తరువాత ఇతర పనులకు సన్నద్ధుడిని చేయడంలో కూడా ముందుకు తీసుకెళ్తుంది. ఈ సఫలత్వానికి ఇంత శక్తి ఉంటుంది. అయితే ఇలా జీవితం సఫలం అవ్వడానికి పాటించాల్సిన నియమాలు కూడా కొన్ని ఉన్నాయి. అవేమిటో తెలుసుకుని, అవగాహన పెంచుకుని, వాటిని పాటిస్తూ ఉంటే సఫలం దిశగా అడుగులు సులువు అవుతాయి.


జీవితం ఫలవంతం కావాలన్నా, సారవంతం, మూల్యవంతం, మాన్యవంతం కావాలన్నా కొన్ని నియమాలకు లోబడి మనుగడ సాగించాలి. నియమావళి జీవితానికి ఒక అనుకూలమైన, రక్షణ కవచంలా పనిచేసే సరిహద్దు. ఆ సరిహద్దులోనే నడుచుకోవాలి. ఇది జీవితానాకి చట్రం (ఫ్రేమ్) లాంటిది. శిల్పి ఒక శిల్పాన్ని తయారు చేయదలచినప్పుడు, దాని పొడవు, వెడల్పు, ఎత్తు ముందుగానే నిర్ణయించి తదనుగుణంగా బొమ్మను మలుస్తాడు. అలా చేసినప్పుడే బొమ్మ అందాన్ని అందుకొని జనాకర్షకంగా వుంటుంది. అలా కాకుండా కాళ్ళ దగ్గర నుంచీ బొమ్మ చెక్కడం ప్రారంభించి తలదాకా వచ్చేసరికి ఆ రాతిలో చోటు సరిపోకపోవచ్చు. అక్కడి నుంచీ చెక్కటానికి ప్రారంభించాలన్నా చట్రం అవసరం. ఆ చట్రం యొక్క మౌలిక కొలతలే బొమ్మ రూపు రేఖలకు ఆధారభూతాలు. 


అలాగే మన జీవిత శిల్పాన్ని తయారు చేసుకోవటానికి నియమావళి ఏర్పరచుకోవాలి. నీతి నియమాలు వున్న వాళ్ళ దగ్గరకు ఇతరులు ధైర్యంగా వెళ్ళ గలుగుతారు. అలాగే వారు ఇతరుల దగ్గరకు వెళ్ళినా, వారు కూడా వీరితో నమ్మకంగా, శాంతంగా, ధైర్యంగా వ్యవహరించ గలుగుతారు. నీతి నియమాలు లేని వారితో ఎవ్వరు పొత్తు పెట్టుకోరు. పొత్తు పెట్టుకున్నా ఎప్పుడు ఏమి చేస్తారో అనే అనుమానం అడుగడుగునా వెంటాడుతూనే వుంటుంది. వారి మధ్య నమ్మకం లోపిస్తుంది.. నియమావళి తయారు చేసి దాఖలు చేస్తే కాని, కంపెనీలను కూడా గవర్నమెంటు వారు రిజిష్టరు చేయరు. ఆ నియమావళిని బట్టి ఆ కంపెనీ యొక్క పని తీరును అంచనా వేయగలుగుతారు.


వ్యక్తుల విషయంలో ఎవరికి వారే నియమావళి నిర్ణయించుకోవాలి. చిన్న చిన్న నియమాలతో ప్రారంభించి, క్రమేనా పెద్దవి (అనగా ఆచరించటంలో కష్టం వున్నవి) కూడా లిస్టులో చేర్చుకుంటూ వుండాలి.


నియమావళిని ఎన్నుకున్న తరువాత, దాని ప్రకారం జీవితాన్ని సాగించటంలో అనేక సాధక బాధకాలు ఎదురవుతాయి. అయినా ధైర్యంగా ముందుకు సాగుతూ వుండాలి. కొన్ని కొన్ని నియమాల్ని తాత్కాలికంగా ఉల్లంఘించవలసి వచ్చినా, మళ్ళీ వెంటనే ఆ నియమాలను అమలు పర్చటానికి ప్రయత్నించాలే గాని శాశ్వతంగా వదిలేయరాదు.


మరి నియమాలంటే ఏమిటి? ఒక మంచి గుణము గుర్తించి ఆ గుణమును మన జీవితంలోకి చొప్పించేందుకు కావలసిన నిత్య సాధనను గూర్చిన దృఢ సంకల్పం. ఇదే నియమం అనబడుతుంది.


                                        ◆నిశ్శబ్ద.