మీకూ ప్రపంచంలో చెడు కనబడుతోందా?? కారణమిదే..

మన మనోస్థితే మన చుట్టూ ఉన్న ప్రపంచ స్థితిని నిర్ణయిస్తుంది. మనోస్థితి మారితే, ప్రపంచ స్థితి కూడా విధిగా మారితీరుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ చేయాల్సిందేమిటంటే… మిమ్మల్ని మీరు పవిత్రీకరించుకోవాలి. అలా చేస్తే గనుక  ప్రపంచం కూడా తప్పక పరిశుద్ధమౌతుంది. ఈ విషయాన్నిపూర్వం నుండి భోధిస్తూనే ఉన్నారు. అయితే దాన్ని పూర్వంకంటే ఇప్పుడు ఎక్కువగా బోధించాల్సి ఉంది. సందుకంటే.. ఇరుగుపొరుగు వారి విషయాలలో మన ఆసక్తి పెరిగిపోతోంది. సొంత విషయాలలో ఆసక్తి తగ్గిపోతోంది. మనం మార్పు చెందితే ప్రపంచం కూడా మార్పు చెందుతుంది. మనం పరిశుద్ధులమైతే, లోకం కూడా పరిశుద్ధమౌతుంది. 

ప్రతి ఒక్కరూ ఒక ప్రహన వేసుకోవాలి.  ఇతరులలోని చెడును నేనెందుకు చూడాలనేదే ఆ ప్రశ్న. నేను చెడిపోయి ఉంటేనే గాని ఇతరులలోని చెడును చూడలేను. నాలో బలహీనత లేకపోతే నాకు దుఃఖం కలుగదు. నేను పసివాడిగా ఉన్నప్పుడు నాకు దుఃఖాన్ని కలుగించినవి. నన్నిప్పుడు దుఃఖపెట్టలేవు. మనస్సు మారింది కాబట్టి, ప్రపంచం కూడ తప్పక మారుతుందని వేదాంతం వక్కాణిస్తుంది.

ఇలా మనోనిగ్రహాన్ని సాధించిన వ్యక్తిపై బాహ్యమైనది ఏదీ ప్రభావం చూపలేదు. అతడికి ఇకపై కూడా ఎలాంటి బంధం ఉండదు. అతడు స్వాతంత్ర్య మనస్కుడు అవుతాడు. అలాంటివాడే ప్రపంచంలో చక్కగా జీవించగలిగిన సమర్థుడు అవుతాడు.  లోకాన్ని గురించి రెండు విధాలైన అభిప్రాయాలు గల వ్యక్తులు సాధారణంగా కనిపిస్తారు. కొంతమంది నిరాశావాదులై ప్రపంచం ఎంత ఘోరం! ఎంత దుష్ట అని అంటుంటారు. మరికొంతమంది ఆశావాదులై ప్రపంచం ఎంత చక్కనిది! అద్భుతమైనది! అని అంటుంటారు. మనోనిగ్రహాన్ని సాధించని వారికి ప్రపంచం చెడ్డదిగా తోస్తుంది లేదా మంచిచెడుల  మేళవింపు గానైనా అనిపిస్తుంది. మనోనిగ్రహ సంపన్నులమైతే మనకు ఈ ప్రపంచమే ఆశాజనకమై కనబడుతుంది. అప్పుడు మనకు ప్రపంచంలో ఏదీ మంచిగాగాని చెడుగా గాని అనిపించదు. అన్నీ సర్వం సరైన స్థానంలో ఉన్నట్లు అదంతా సమంజసమే అన్నట్టు అగపడుతుంది.

ప్రేమా, సౌజన్యమూ, పావనత్వమూ మనలో ఎంత పెంపొందితే బయట వున్న ప్రేమాసౌజన్య పాపనత్వాలను మనం అంతగా చూడగలం. పరదూషణ నిజానికి ఆత్మదూషణే. పిండాండాన్ని నువ్వు చక్కబరుచుకొన్నావా (ఇది నువ్వు చేయగల పనే), బ్రహ్మాండం తనంతట తానే నీకు అనువుగా మారుతుంది. ఆదర్శ ద్రవాన్ని అది ఎంత కొద్ది పరిమాణంలో ఉన్నా దానికంటే ఎక్కువ పరిమాణంగల ద్రవంతో సరితూగేటట్లు చేయవచ్చుననే సూత్రంలా ఒక నీటిబిందువు విశ్వంతో సరితూగగలదు. మనలో ఏది లేదో అది మనకు వెలుపల కూడా కనబడదు. చిన్న ఇంజనుకు పెద్ద ఇంజను ఎలాంటిదో విశ్వం మనకు అలాంటిది. చిన్నదాన్లో కనిపించే దోషం పెద్దదాన్లో ఏర్పడే చిక్కును ఊహింపజేస్తుంది.

లోకంలో సాధింపబడ్డ ప్రతియత్నమూ నిజానికి ప్రేమచేత సాధింపబడిందే. తప్పులు ఎన్నటం వల్ల ఎన్నడూ ఏ మేలూ ఒనగూరదు. వేలకొద్ది సంవత్సరాలుగా విమర్శనా మార్గాన్ని అనుసరించి చూడటమైంది. నిందల వలన దేనినీ సాధించలేము. 

అంటే మనిషి తనలో చెడును, చెడు భావనలను పెంచుకుంటే…  ఈ ప్రపంచంలో కూడా చెడు ఉన్నట్టు, తన చుట్టూ చెడు భావనలు ఉన్నట్టూ అతనికి అనిపిస్తుంది  ఇందులో వింత ఏమి లేదు. చూసే చూపును బట్టి విషయం అర్థమవ్వడం మాములే కదా…

                                ◆ నిశ్శబ్ద.