రాజాసింగ్ సై అంటారా.. సరండెర్ అవుతారా?

 

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే  రాజాసింగ్ కు పార్టీ తలుపులు శాశ్వతంగా మూసుకు పోతున్నాయా?  పార్టీకి రాజీనామా చేసి.. మీకో దండం, మీ పార్టీకో దండం అంటూ శ్యామాప్రసాద్ ముఖర్జీ భవన్ (బీజేపీ స్టేట్ ఆఫీస్) మెట్లు దిగివచ్చిన రాజాసింగ్ మళ్ళీ ఆ మెట్లు ఎక్కను  అంటూ చేసిన ప్రతిజ్ఞను పార్టీ  సీరియస్ గా తీసుకుందా? అందుకే..  ఆయన గేటు దాటక ముందే ఆయన సమర్పించిన రాజీనామా లేఖను..  అప్పటి  రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి  పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపారా? అందుకే..  సంప్రదింపులు బుజ్జగింపులకు స్కోప్ లేకుండా  పార్టీ అధికార ప్రతినిధి  రాణి రుద్రమ ద్వారా, క్రమశిక్షణ  గీత దాటిన  రాజాసింగ్  విషయంలో పార్టీ  కఠినంగా ఉంటుందనే సంకేతాలు ఇప్పించారా ? అంటే..  పార్టీ వర్గాల  అవుననే సమాధానమే వస్తోంది. 

నిజానికి.. రాజా సింగ్’ ‘కట్టర్’ హిందుత్వ వాది. అందులో సందేహం లేదు. అలాగే..  జనంలో మంచి ఫాలోయింగ్  ఉన్న నాయకుడు. ఈ విషయంలోనూ ఎలాంటి సందేహం లేదు. బీజేపీ కార్యకర్తల్లో ఆయనకు ప్రత్యేక గుర్తింపు, గౌరవం ఉన్నాయి. ఒక్క పిలుపుతో వందలు కాదు వేల మంది కార్యకర్తలను కదిలించగల చేయగల ఏకైక సిటీ నాయకుడు రాజా సింగ్.  కార్యకర్తల్లోనే కాదు..  కార్పొరేటర్లు, ఇతర స్థానిక నాయకులు కూడా  రాజా సింగ్ ను పార్టీతో సమానంగా చూస్తారు. అందుకే..  గోషామహల్ స్థానిక నాయకులు, కార్యకర్తలు బీజేపీ, రాజాసింగ్ తమకు రెండు కళ్ళు.. ఎవరినీ  వదులుకునేది లేదని అంటున్నారు. రాజా సింగ్ పార్టీలో కొనసాగాలని కోరుకుంటున్నారు. అయితే.. ఎన్ని సుగుణాలు ఉన్నా,  క్రమశిక్షణ గీత దాటి బీజేపీలో కొనసాగడం అయ్యేపని కాదని  పార్టీ నాయకులు స్పష్టం చేస్తున్నారు.  నిజానికి.. ఇప్పటికే రాజా సింగ్ కు పార్టీ లాంగ్ రోప్ ఇచ్చింది. అనేక మార్లు ఆయన గీత దాటినా, ఆయనకున్న ప్రత్యేక అర్హతల దృష్ట్యా పార్టీ నాయకత్వం చూసీచూడనట్లు వదిలేసింది. అయితే.. ఇక ఇప్పుడు ఉపేక్షించే పరిస్థితి ఉండదని రాజా సింగ్ అనుకూల వర్గం నాయకులు వ్యక్తిగత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. 

అయితే..  రాజా సింగ్ కోరుకున్న విధంగా ఆయన రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్ కు పంపి ఆయన్ని సస్పెండ్ చేయమనో, ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయమనో కోరే పరిస్థితి అయితే రాకపోవచ్చని అంటున్నారు. అదే సమయంలో రాజా సింగ్  తనంతట తానుగా రాజీనామా చేస్తే..  ఉప ఎన్నిక వస్తే  బీజేపీ తమ అభ్యర్ధిని బరిలో  దింపుతుందని అంటున్నారు.  అందుకు రంగం సిద్దం చేసుకుంటోందనీ చెబుతున్నారు.  నిజానికి.. ఉప ఎన్నిక వస్తుందా? రాదా?  అనే విషయంతో సంబంధం లేకుండా  రాజాసింగ్  స్థానంలో మాధవీ లతను ఓల్డ్ సిటీ  లీడర్ గా నిలిపేందుకు బీజేపీ నాయకత్వం ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అవును..  గత లోక్ సభ ఎన్నికల్లో హైదరాబాద్  స్థానంలో ఎంఐఎం అభ్యర్ధి అసదుద్దీన్ ఒవైసీని ఎదుర్కున్న ఫైర్ బ్రాండ్ లేడీ మాధవీ లతను రంగంలోకి దించేందుకు రాష్ట్ర నాయకత్వం సిద్ధంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెపుతున్నాయి. నిజానికి..  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి సునీల్ బన్సల్  మాధవీ లతతో మాట్లాడి, గోషామహల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్దం కావాలని చెప్పినట్లు తెలుస్తోంది. ఉప ఎన్నిక వచ్చినా రాక పోయినా.. అసలు ఎన్నికలతో సంబంధం లేకుండా,.. పాత బస్తీలో  రాజాసింగ్ పాత్రను ఇక పై మీరే పోషించవలసి ఉంటుందని మాధవీలతకు బీజేపీ హైకమాండ్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

మరో వంక రాజా సింగ్  తాను పార్టీని వదిలినా, హిందుత్వ సిద్దాంతాన్ని వదిలేది లేదని అంటున్నారు. అలాగే..  ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా  నాయకత్వాన్ని సమర్దిస్తానని అంటున్నారు. అంతే కాదు.. తన కోసం పార్టీ క్యాడర్  ఎవరూ పార్టీ వదలవద్దని  వీడ్కోలు సందేశం(?)ఇస్తున్నారు. అలాగే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ఆలోచన కూడా రాజాసింగ్ కు లేదని, అంటున్నారు. ఈ నేపద్యంలో రాజాసింగ్  నెక్స్ట్ మూవ్ ఏమిటి? సరెండర్ అవుతారా ? సై .. అంటారా ? అనేది తేలవలసి వుందని అంటున్నారు. అయితే.. ఇప్పటికిప్పుడు అటు  బీజేపీ నుంచి కానీ, ఇటు రాజాసింగ్ వైపు నుంచి కానీ, తీవ్ర నిర్ణయం ( డ్రాస్టిక్’ స్టెప్) ఏదీ  ఉండక పోవచ్చని ఢిల్లీ వర్గాల సమాచారం గా చెపుతున్నారు.  సో..గోషా మహల్ ఉప ఎన్నికకు ఫిఫ్టీ ఫిఫ్టీ చాన్సెస్ మాత్రమే ఉన్నాయన్నది పరిశీలకుల అభిప్రాయం.