ఎస్ఎల్ బీసీ కూలడానికి క్షుద్ర పూజలు.. కోమటిరెడ్డికి పూజల పిచ్చి పట్టిందా?
posted on Aug 12, 2025 11:34AM

ఒకప్పటి కోమటిరెడ్డికి ఇప్పటి కోమటిరెడ్డికి చాలానే తేడా ఉన్నట్టుంది చూస్తుంటే. ఆయనకు ఇచ్చిన శాఖల్లో సినిమాటోగ్రఫీ శాఖ కూడా ఉంది. ఒక పక్క అక్కడ సినీ కార్మిక లోకం వర్సెస్ నిర్మాతలుగా బీభత్సమైన యుద్ధం జరుగుతోంది. ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు సంధించు కుంటున్నారు. మూడేళ్లయ్యింది మాకు జీతం పెంచి అని కార్మికులు అంటుంటే, మీకసలు టాలెంటే లేదు. మేం ఐటీ ఎంప్లాయిస్ కన్నా ఎక్కువ వేతనాలిస్తున్నాం అని నిర్మాతలంటున్నారు. తొలి నుంచి సినీ పరిశ్రమ అవినీతి అడ్డా, అక్రమాల పుట్ట అంటూ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కి చెందని నిర్మాత విశ్వ ప్రసాద్ డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు .
ఒక వేళ కోమటిరెడ్డి ఏదైనా సమస్య తీస్కుని పోరాడాల్సి ఉంటే.. సినీ పరిశ్రమకు చెందిన అంశం ఏదైనా తీస్కుని దాన్ని సాల్వ్ చేయాలిగానీ.. ఎస్ఎల్ బీసీ కూలడానికి క్షుద్ర పూజలు చేశారంటూ ఆరోపణలేంటో అర్ధం కావడం లేదంటారు కొందరు. ఒక వేళ కేసీఆర్ అండ్ కో కోరుకున్నారన్నదే ఆ ఆరోపణల అయితే అందులో హేతువు కనిపించదు. ఎందుకంటే కేసీఆర్ అండ్ కో కూలాలని కోరుకోవడం అంటూ జరిగితే ఎస్ ఎల్ బీసీ కాదు.. ఏకంగా రేవంత్ సర్కారే ప్రభుత్వమే కూలాలని కోరుకుంటారు కానీ ఎక్కడో ఉన్న ఎస్ఎల్బీసీ కూలితే వారికేమి వస్తుంది? అర్ధం కావడం లేదని అంటారు కొందరు.
మొన్న కూడా ఇలాగే రేవంతే సీఎంగా పదికాలాల పాటు ఉండాలని గణపతి పూజ చేయించానంటారు కోమటిరెడ్డి. కంటి ముందున్న పని పక్కన పెట్టి.. ఈ పూజల పిచ్చేందని పరిశీలకులు సైతం బుర్రలు గొక్కుంటున్నారు. ఒక పక్క తమ్ముడు చూస్తే మంత్రి పదవి కావాలంటూ మారాం చేస్తున్న చిన్న పిల్లాడిలా కనిపిస్తుంటే. మరో పక్క అన్న చూస్తే ప్రతిదానికీ పూజలకు లింకుబెట్టి మాట్లాడ్డం కనిపిస్తోంది.. ఏంటిదంతా? ఎందుకిలా జరుగుతోంది. ఉన్న సమస్యను పక్కన బెట్టి ఈ టాపిక్ డైవర్షనేంటన్న వాదన వినిపిస్తోంది. ఆ ఎస్ఎల్బీసీకి చెందిన ఇరిగేషన్ శాఖ కూడా ఆయనది కాదు. ప్రస్తుతం తన శాఖకు సంబంధించిన శాఖ సినిమాటోగ్రఫి. సినీ పరిశ్రమలో ఇంత లొల్లి జరుగుతుంటే అది పట్టకుండా కోమటిరెడ్డి ధోరణి ఇలా ఉందేమిటన్నది ఎవరికీ అంతు చిక్కడం లేదు.