బాబోయ్ దోమలు.. వర్షాకాలంలో వీటికి చెక్ పెట్టాలంటే ఇలా చేయాలి..

 


వర్షాకాలం వచ్చిందంటే చాలు.. ఇళ్లలో దోమల సంఖ్య  పెరగడం మొదలవుతుంది. అవి కుట్టడం వల్ల దురద, దద్దుర్లు వంటివి   కలిగించడమే కాకుండా డెంగ్యూ,  మలేరియా వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. సాధారణంగా  దోమలను తరిమికొట్టడానికి కాయిల్స్ లేదా లిక్విడ్స్  ఉపయోగిస్తారు. కానీ వాటిలో ఉపయోగించే రసాయనాల కారణంగా ఇవి అనారోగ్యానికి దారి తీస్తాయి.  వీటి మీద అవగాహన ఉన్న వారు రసాయనాలను వదిలి సహజమైన పద్దతిలో దోమలు పారద్రోలడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారికోసం అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి.

పాత రోజుల్లో దోమలను తరిమికొట్టడానికి  వేప ఆకులను పొగబెట్టేవారు. కానీ ఈ కాలంలో ఈ  పొగ వల్ల కూడా  సమస్యలను ఎదుర్కొంటారు. అలా కాకుండా దోమలను తరిమికొట్టేందుకు  వేపను ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటే..

వేపనీరు..

ఇది సులభమైన మార్గం.. . కొన్ని వేప ఆకులను తీసుకొని నీటిలో బాగా మరిగించాలి. నీటి రంగు మారి ఆకులు మృదువుగా మారినప్పుడు నీటిని చల్లబరిచిన తర్వాత ఫిల్టర్ చేయాలి.  ఇప్పుడు ఈ ద్రావణాన్ని స్ప్రే బాటిల్‌లో నింపి ఇంటి మూలల్లో, కర్టెన్లలో,  దోమలు ఎక్కువగా కనిపించే ప్రదేశాలలో స్ప్రే చేయాలి. దోమలు దాని వాసన కారణంగా పారిపోతాయి.

వేప ఆకులు..

వేప ఆకులను ఉంచడం వల్ల దోమలు ఇంట్లోకి రాకుండా  సహజ అవరోధంగా పనిచేస్తుంది . తాజా వేప ఆకులను తీసుకొని వాటిని మెష్ చేసిన కిటికీలు, తలుపులు లేదా వెంటిలేషన్ ఉన్న ప్రదేశాలపై వేలాడదీయాలి లేదా ఉంచాలి. వేప వాసన దోమలు ఇంట్లోకి రాకుండా నిరోధిస్తుంది. కావాలంటే  వాటిని బాత్రూమ్ కిటికీపై కూడా ఉంచవచ్చు.

వేప పేస్ట్..

వేప పేస్ట్ తయారు చేయడం వల్ల చర్మాన్ని దోమల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. తాజా వేప ఆకులను గ్రైండ్ చేసి పేస్ట్ తయారు చేసుకోవాలి.  కావాలంటే దానికి కొంచెం కొబ్బరి నూనె కూడా జోడించవచ్చు. ఇప్పుడు ఈ పేస్ట్‌ను పడుకునే ముందు చేతులు, కాళ్ళు,  మెడపై రాయాలి. దీని బలమైన వాసన దోమలను దగ్గరికి రానివ్వదు.  

పొగ..

నేరుగా వేపాకు పొగ వేయడానికి ఇబ్బంది పడేవారు వేపాకును పొగలో ఉపయోగించడానికి సులభమైన చిట్కా ఉంది. అదే సాంబ్రాణి పొగ.. ప్రతి రోజూ సాయంత్రం కొన్ని బొగ్గులను కాల్చి అందులో సాంబ్రాణితో  పాటూ కాసింత వేపాకుల పొడిని కూడా వేస్తే ఆ పొగకు దోమలు పరార్ అవుతాయి.

                           *రూపశ్రీ.


 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu