పెళ్ళికి ముందు ఈ 5 విషయాలు కూతుళ్లకే  కాదు.. కొడుకులకు కూడా నేర్పించాలి..!

 


వివాహం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య బంధం మాత్రమే కాదు రెండు కుటుంబాల మధ్య బంధం. కొత్త సంబంధాలకు సర్దుబాటు కావడానికి సమయం పడుతుందనేది అంగీకరించాల్సిన వాస్తవం. సాధారణంగా తల్లిదండ్రులు తమ కుమార్తెను అత్తవారింటికి పంపేటప్పుడు  ఆమె అత్తమామల ఇంట్లో ఎలా ఉండాలో.. మంచి భార్యగా,  కోడలుగా ఎలా ఉండాలో కొన్ని విషయాలు చెబుతారు. అలాగే అత్తారింట్లో పనులన్నీ ఎలా చేయాలో కూడా నేర్పించి మరీ పంపుతారు. కానీ వివాహం తర్వాత మంచి భర్తగా,  అల్లుడిగా ఎలా ఉండాలో అబ్బాయిలకు నేర్పించే తల్లిదండ్రులు బహుశా చాలా అరుదుగా ఉంటారని చెప్పాలి.

పెళ్లి తర్వాత అమ్మాయిలు మానసికంగా,  ఆచరణాత్మకంగా తమ అత్తమామల ఇంట్లో సర్దుబాటు చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. కానీ అబ్బాయిలు ఈ పరిస్థితికి సిద్ధంగా ఉండరు.  అయితే పెళ్లికి ముందు కూతుళ్లకు ఎన్నో విషయాలు నేర్పించే తల్లిదండ్రులు,  పెళ్ళి తర్వాత ఎలా ఉండాలి అనే విషయం గురించి కొడుకుకు కూడా కొన్ని నేర్పించాల్సి ఉంటుంది.  ఇలా చేయడం వల్ల పెళ్లి తర్వాత  అబ్బాయి మంచి భర్తగా మాత్రమే కాకుండా, బాధ్యతాయుతమైన  అల్లుడుగా కూడా మారతాడు. అర్థం చేసుకునే కొడుకు మాత్రమే రెండు కుటుంబాలను కలిపి ఉంచగలడుయ  కోడలికి తన అత్తమామల ఇల్లు తన  'ఇల్లు' అని అనిపించేలా చేయగలడు. ఇందుకోసం పెళ్లికి ముందు కొడుకులకు తల్లిదండ్రులు ఏం చెప్పాలో.. ఏం నేర్పించాలో తెలుసుకుంటే..

సమానత్వం..

వివాహం తర్వాత భార్య తన బాధ్యత మాత్రమే కాదు, తన జీవిత భాగస్వామి కూడా అని  కొడుకుకు చెప్పాలి. ఇంటి ప్రతి నిర్ణయంలో ఆమెను అభిప్రాయం తీసుకోవాలని చెప్పాలి.  భార్య భావాలను,  అభిప్రాయాలను గౌరవించడం, కోడలు ఆ ఇంట్లో గెస్ట్ లేదా పని మనిషి లాంటిది కాదని  ఇంట్లో ఆమెకు శాశ్వత స్థానం ఉంటుందని చెప్పాలి.


సమతుల్యత..

వివాహం తర్వాత కొడుకు తరచుగా తన తల్లి,  భార్య మధ్య చిక్కుకుపోతాడు. సంబంధాలలో సామరస్యం ముఖ్యమని, పోలిక కాదని కొడుకులకు  వివరించి చెప్పాలి. కొడుకు సమతుల్యతను కాపాడుకుంటే కోడలికి ఇంట్లో ఎటువంటి సమస్య ఉండదు.  లేదా తల్లికి ఎటువంటి ఫిర్యాదు ఉండదు. అతని భార్య,  తల్లి మధ్య ఏదైనా విభేదాలు ఉంటే ఇద్దరి మధ్య తేడాలు తగ్గించడానికి ప్రయత్నం చేయాలి.  అంతే తప్ప ఒకరికే సపోర్ట్ చేస్తూ ఏకపక్షంగా ఉండకూడదు.  

సహాయం..

ఇంటి పనులు కేవలం మహిళల బాధ్యత మాత్రమే కాదని పెళ్లికి ముందు  కొడుకుకు వివరించాలి. కొన్నిసార్లు  భార్యకు చిన్న విషయాలలో సహాయం చేయడం,  ఆమెను మానసికంగా  మరియు ాలా ఊరట ఇస్తుంది. భార్యతో సంబంధాన్ని బలపరుస్తుంది.  కూతుళ్ల లాగే  కొడుకు కూడా ఇంటి పనులలో సహాయం చేయమని చెప్పాలి. తద్వారా అతను తన భార్యకు సహాయం చేయడంలో సిగ్గుపడడు,  అతను ఇంటి పనులపై అవగాహన పెంచుకుంటాడు.


అత్తవారిల్లు..

పెళ్లి తర్వాత కోడలు తన అత్తామామలను తన తల్లిదండ్రులుగా భావించి కుటుంబంలో కలిసిపోవాలంటే..  తన భార్య తల్లిదండ్రులను గౌరవించడం కూడా అంతే బాధ్యత అని  కొడుకుకు చెప్పాలి. కోడలు తల్లిదండ్రులను, ఆమె కుటుంబాన్ని తన సొంత కుటుంబ సభ్యులుగా భావించాలి. ఇలా ఉంటే కోడలు కూడా తన అత్తామామలను తన తల్లిదండ్రుల లాగే చూసుకోవడం జరుగుతుంది.   రెండు కుటుంబాలను ఏకం చేయడం కొడుకు బాధ్యత కూడా.

ప్రైవసీ..

భార్యాభర్తల మధ్య విషయాలు వ్యక్తిగతమైనవి. చిన్న చిన్న విషయాలను బయట పంచుకోవడం లేదా తల్లిదండ్రులతో ప్రతిదీ పంచుకోవడం,  అక్కా చెల్లెళ్లు, అన్నాదమ్ములతో ప్రతీది చెప్పడం  వల్ల అపార్థాలు వస్తాయని  కొడుకుకు నేర్పాలి. మంచి భర్త లక్షణం ఏమిటంటే అతను తన సంబంధం  గౌరవాన్ని కాపాడుకోవడం. అతను ఆ గౌరవాన్ని కాపాడటానికి ప్రయత్నం చేస్తే భార్య కూడా అతనికి సహకారంగా వ్యక్తిగత విషయాలను ఎవరితో పంచుకోకుండా ఉంటుంది.

                          *రూపశ్రీ.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu