ఢిల్లీ శునక పురాణం
posted on Aug 12, 2025 12:23PM

ఢిల్లీలో ఒక్క కుక్క కూడా రోడ్లపై కనిపించకూడదు. ఎనిమిది వారాల్లోగా వాటిని షెల్టర్లకు చేర్చండి అంటూ సుప్రీం కోర్టు ఆదేశాల జారీ వెనక అసలు స్టోరీ ఏంటి? ఎందుకని సుప్రీం కోర్టు అంత కఠినమైన ఆదేశాలు జారీ చేసింది? అని చూస్తే ఢిల్లీలో నానాటికీ కుక్కల బెడద తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్న దృశ్యం కనిపిస్తోంది.
దేశ రాజధాని ఢిల్లీ అంతటా, కుక్క కాటు కేసులు పెరుగుతూనే ఉండటం, ఆసుపత్రులు కిక్కిరిసిపోవడం తరచూ వార్తలకెక్కుతూనే వస్తోంది. కొందరు కుక్కే కదా కరిచిందని లైట్ తీస్కోవడం వల్ల.. ప్రాణాలు పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. రానురాను కుక్కల బెడద పెను ప్రమాదంగా పరిణమిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ డేటా ప్రకారం ఢిల్లీలో కుక్క కాటు కేసులు 2022లో 6,691 నుంచి.. 2023లో 17,874కి, 2024లో 25,210కి పెరిగాయి. అంటే కేవలం రెండేళ్లలోనే కుక్కకాటు బాధితుల సంక్య 277% పెరిగింది. దీంతో ఢిల్లీ వాసుల గుండెలదరిపోతున్నాయ్.
ఈ ఏడాది ఒక్క జనవరిలోనే కుక్కకాటుకు గురైన వారి సంఖ్య 3,196 అంటే పరిస్థితి ఊహించుకోవచ్చు ప్రభుత్వం నిర్వహించే అతిపెద్దదైన సఫ్దర్‌జంగ్ హాస్పిటల్ డేటా ప్రకారం, 2021 లో 63,361 కుక్క కాటు కేసులు నమోదయ్యాయి. జూలై 2025 నాటికి, ఈ సంఖ్య 91,009కి పెరిగింది, ఇది గతేడాది వార్షిక గణాంకాలను బట్టీ చూస్తే 43.6 శాతం అధికం. అంటే ప్రతిరోజూ 430 మందికి పైగా కుక్కకాటుకు గురౌతున్నారన్నమాట.
రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో ఏప్రిల్ 2022- మార్చి 2023 మధ్య 39,216 కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ 2023- మార్చి 2025 మధ్య ఈ కేసుల సంఖ్య 45,432కి పెరిగింది. అంటే పదమూడు శాతం పెరుగుదల నమోదైందన్న మాట.
మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ డిల్లీ అధ్వర్యంలో నడిచే బారా హిందూరావు ఆస్పత్రిలో ఈ ఏడాది జూలై వరకు చూస్తే.. 4,861 కుక్క కాటు కేసులు నమోదయ్యాయి, గత ఏడాది ఇదే కాలంలో నమోదైన 3,468 కేసులతో పోలిస్తే ఇది 40% ఎక్కువ. ఢిల్లీ సరిహద్దుల బయట కూడా సమస్య తీవ్రంగానే ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో.. ఈ ఏడాది జనవరి- మే మధ్య కాలంలో 74,550 కుక్క కాటు ఘటనలు నమోదయ్యాయి.
కుక్క కాటు రెండు ప్రధాన ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుంది. కేవలం గాయంతో పోయేది కాదిది. ఇన్ ఫెక్షన్ సోకుతుంది. వెంటనే చికిత్స చేయకపోతే చిన్న కాటు వల్ల నరాలు దెబ్బతినడం, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. అసలైన సమస్య ఏంటంటే మెదడు నాడీ వ్యవస్థపై ఈ ఇన్ ఫెక్షన్ దాడి చేస్తుంది. దీంతో ఇది ప్రాణాంతకంగా మారుతుంది. కాటు ద్వారా కుక్క లాలాజనం మనిషి నరనరాల్లోకి పాకుతుంది. తద్వారా రేబిస్ వస్తుంది. ఈ వ్యాధికి వెంటనే పోస్ట్ ఎక్స్ పోజర్ టీకాలు ఇవ్వడం అత్యంసరం.
చిన్న కాటే కదాని ఎప్పటికీ నిర్లక్ష్యం చేయకూడదు. చికిత్స చేయక పోతే అది ప్రాణాల మీదకువ స్తుంది. యూపీకి చెందిన రాష్ట్ర స్థాయి కబడ్డీ ప్లేయర్ సోలంకి గత జూలైలో రేబిస్ సోకి మరణించారు. సుమారు మూడు నెలల క్రితం బ్రిజేష్ సోలంకీ ని తన పెంపుడు కుక్క పిల్ల కరిచింది. దాన్ని చిన్న గాయంగా పరిగణించిన బ్రిజేష్.. రేబిస్ ఇంజక్షన్ తీసుకోలేదు. దీంతో ఆయన చనిపోయారు.
ది లాన్సెట్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, 2022–23లోనే భారత్ లో రేబిస్ వ్యాధి సుమారు 5,700 మందిని పొట్టనపెట్టుకుంది. దీన్ని బట్టీ రేబిస్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. ఇదంతా దశాబ్దాల తరబడి నిర్లక్ష్యం కారణంగా జరుగుతూ వస్తోంది. ఎనిమల్ బర్త్ కంట్రోల్ కింద స్టెరిలైజేషన్, టీకా డ్రైవ్ లు చేస్తున్నట్టు ఎన్జీవోలు ఇతర పౌర సంస్థలు చెప్పుకుంటున్నాయి. కానీ, గ్రౌండ్ లెవల్లో ఇదంతా జరగలేదని నానాటికీ పెరిగిపోతున్న కుక్కల బెడదను బట్టి అర్ధం అవుతోంది.
2022- 24 మధ్య కాలంలో ఢిల్లీలో లక్షకు పైగా స్టెరిలైజేషన్స్ జరిగినట్టు చెబుతాయి గణాంకాలు. అయితే కుక్కల బెడద మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు.
వీధి కుక్కల బెడద ఎదుర్కునే వారు.. ఎంసీడీ-311 యాప్ లేదా హెల్ప్‌లైన్ నంబర్ 155305 ద్వారా తాము ఎదుర్కుంటున్న సమస్యలను రిపోర్ట్ చేయవచ్చు. అంతే కాదు స్టెరిలైజేషన్ వంటి డీటైల్స్ కూడా వీటిలో నమోదు చేయవచ్చు. అయితే దీని ద్వారా ఢిల్లీలోని వీధి కుక్కల సమస్య ఎంత మేర అధిగమించగలం అన్నది ప్రశ్నార్ధకంగానే మిగిలింది. ఎందుకంటే ఇలాంటి ఫెసిలిటీ ఒకటి ఉందన్న విషయం కూడా చాలా మందికి తెలీదు.
2023లో జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశానికి ముందు మున్సిపల్ అధికారులు వీధి కుక్కలను బంధించి ఎలాగోలా కట్టడి చేశారు. ఎప్పుడైతే ఈ సమావేశం ముగిసిందో తిరిగి వీధి కుక్కలను వదిలేశారు. దీంతో గూండా రాజ్ లా ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో డాగ్ రాజ్ రాజ్యం చేస్తోంది. వీటికి స్టెరిలైజేషన్ లేదు, షెల్టర్ల ఏర్పాటు అంతకన్నా లేదు. శాశ్వత పరిష్కారం చూపించడమూ లేదు.
ఇక పోతే విశ్వనగరం అయిన మన హైదరాబాద్ పరిధిలో ఈ మధ్య వీధి కుక్కల వల్ల తలెత్తుతున్న సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. చిన్నారుల పై వీధి శునకాలు మూకుమ్మడిగా దాడి చేస్తున్న ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో అయితే.. పసి పిల్లలు కుక్కల దాడిలో మరణించారు కూడా. దీంతో ప్రజలు తమ పిల్లలను రోడ్లపై ఆటలకు పంపేందుకు కూడా భయపడుతున్నారు. ఏ వైపు నుంచి ఏ వీధి కుక్క వచ్చి దాడి చేస్తుందో అన్న భయంతోనే ఆడుకోవల్సిన పిల్లల్ని ఇంటికే పరిమితం చేస్తున్నారు.
మీ ఏరియాలో కుక్కల బెడద ఉందా? అయితే, టోల్ ఫ్రీ నంబర్లు 040-21111111, 040-23225397కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. మా డాగ్ క్యాచింగ్ టీంలు నేరుగా వచ్చి వీధి శునకాలను సంరక్షణ కేంద్రాలకు తరలించి స్టెరిలైజేషన్ చేస్తాయని జీహెచ్ఎంసీ ఓ ప్రకటన ద్వారా తెలియ చేసింది.
విదేశాల్లో అలాక్కాదు. ఇక్కడి వారికి ఒకింత జంతు ప్రేమ ఎక్కువే. ఆ మాటకొస్తే మానవ హక్కులకన్నా జంతు హక్కులు ఒకింత కఠినంగానే ఉంటాయిక్కడ. వదిలేసిన పెంపుడు జంతువులు కూడా ఇక్కడ వివిధ షెల్టర్లలో హాయిగాసేద తీరుతుంటాయి. వీటికి స్టెరిలైజేషన్ చేసి మైక్రో చిప్ జత చేసి.. దత్తత తీసుకోవడానికి వీలుగా వీటిని మెయిన్ టైన్ చేస్తారు. ఒక వేళ ఎవరూ ముందుకు రాకుంటే ప్రభుత్వాలే.. వాటిని సకల సౌకర్యాలతో సంరక్షిస్తాయి. ఎందుకంటే ఈ ప్రపంచం సమస్త జంతు జాలానిది. ఈ భూమిపై నివసించడానికి మనకెంత హక్కుందో- వాటికీ అంతే హక్కుందని విశ్వసిస్తారక్కడ.