మనిషికి దుఃఖం నేర్పేది ఏమిటి?

జీవితంలో మనిషి సుఖాన్ని మాత్రమే కోరుకుంటాడు. బాధకలుగుతుందంటే భయపడతాడు. శారీరక బాధకు మానసికమైన ఆదుర్దా, భయమూ గనక జోడించకపోతే, కేవలం శారీరక బాధ బాధాకరం కాదు. ఒకవేళ ఎక్కువగా ఉన్నప్పటికీ ఆధునిక వైద్యవిధానంలో ఈ బాధను చాలావరకు ఉపశమింపచేయగలిగి ఉన్నారు.

కానీ బాధను ఓర్చుకోడం కూడా కొంత నేర్చుకోవాలి. అసలు ఓర్వలేనంటూ బాధకలిగి కలగకముందే పెయిన్ కిల్లర్ వేసేసుకుంటే ఇక బాధ ద్వారా ప్రకృతి మనిషికి నేర్పగలిగింది కానీ, మనిషి నేర్చేదికానీ ఏమీ వుండదు. బాధ నేర్పేదేమిటనే ప్రశ్న కలగవచ్చు. నిజానికి జీవితంలో మనం నేర్చుకునేది చాలామటుకు బాధద్వారే గానీ సుఖం ద్వారా కాదు. సుఖం మనిషిని మత్తులో ముంచుతుంది. బాధ ఏ రంగంలో ఏ అవయవంలో మనకు కలుగుతుందో, ఆ విషయం మొత్తం విశదంగా తేట తెల్లంగా సంపూర్ణంగా మనకు తెలియజేస్తుంది. 

ప్రేయసీ ప్రియుల హృదయాలు విరహవేదనను అనుభవించినప్పుడే ప్రేమ నిజంగా ప్రకటితమవుతుంది. స్త్రీ పురిటినొప్పులు పడినప్పుడు కానీ నూతనసృష్టి ప్రారంభం కాదు. గౌతముడు దుఃఖాగ్నిని అనుభవించినందునే సత్యాన్వేషకుడైనాడు. ఒక శ్వేతజాతీయుడు దక్షిణాఫ్రికాలో మోహన్ దాస్ కరంచంద్ గాంధీ అనే వ్యక్తిని అర్థరాత్రి రైలునుండి బయటికి తోసేస్తే, చలిలో వణుకుతూ స్టేషన్లో కూర్చున్నందునే గాంధీ హృదయంలో శ్వేత జాత్యహంకారాన్ని నిర్మూలించాలనే అకుంఠిత దీక్ష బయలుదేరింది.

పురాణకాలం నుండీ ఆధునిక కాలం వరకూ బాధలేకుండా ప్రయోజనకరమైన పని ఏదీ జరగలేదు. ప్రజలు బాధలకు గురియైన తర్వాతగానీ అవతార పురుషులుగా మార్లు చెందలేదు.  మనిషి బాధపడిన తర్వాతగానీ జ్ఞానము ఉదయించదు. బాధనెరగని జీవితం పరిపూర్ణమైన జీవితం కానేకాదు.

బాధకీ, భక్తికీ దగ్గర సంబంధమని తోస్తుంది. “బాధలకొరకే బ్రతికించితివా” అనే పాటను సక్కుబాయి నిజజీవితంలో పాడినా పాడకపోయినా, ఆ బాధామయ జీవితంలోనే ఆవిడ అనేకసార్లు మూర్ఛిల్లడం, అనేకమార్లు ఆవిడకు పాండురంగ విఠల్ దర్శనమివ్వడం జరిగింది. పరమాత్ముడైన శ్రీకృష్ణుణ్ణి మరచిపోకుండా వుండడానికి తరచూ తనకు బాధలు కలిగించమని ప్రార్థించింది కుంతీదేవి.

బాధలోగానీ భగవంతుడు కనిపించడన్నమాట, “ఎంత బాధపడ్డానో, దేవుడు కనిపించాడనుకోండి” అని వారూ, వీరూ ఉత్తుత్తగా అనడం వింటుంటాం. నిజంగా అంత బాధపడివుండరు. దేవుడు కనిపించీ వుండడు. కానీ నిజంగా బాధపడితే దేవుడు కనిపించడం కూడా యథార్థమే అయివుండాలి. భక్తరామదాసుకు అలాగే కనిపించాడు. హృదయవేదనకు గురైన త్యాగరాజుకు అలాగే కనిపించాడు. ఆవేదనలో నుండే అద్భుతమైన భక్తి సంగీత సాహిత్యాలు వెల్లువలై పొంగి ప్రవహించాయి.

మామూలు మనిషికి బాధ అంటే ఎంత భయమో, మరణం ఆసన్నమవుతోంది అంటే అంతకు పదిరెట్లు భయం. కానీ స్థిరచిత్తులైన వారికి మరణం సమీపిస్తున్నదంటే, తాము నిర్ణయించుకున్న కర్తవ్యం పూర్తి చేయాలనే పట్టుదల అధికమవుతుంది. ప్రఖ్యాత జర్మన్ సంగీత స్రష్ట ఫ్రెడరిక్ షోపోన్ ఆరోగ్యం క్షీణిస్తున్న రోజులలో ఇక తన జీవితకాలం సమాప్తం కానున్నదనే సంకోచం ఏర్పడింది. అందుకని మరింత పూనికతో సంగీతాన్ని కంపోజ్ చేస్తుండేవాడు.

తరచూ తీవ్రమైన అనారోగ్యానికి గురవడం వల్ల షోపోన్ ఇక బ్రతకడేమోననే అనుమానం ఊరివారందరికీ తరచూ కలుగుతుండేది. షోపోన్ మరణించాడనే వార్త వ్యాపించినా అందరూ ఇట్టే నమ్మేవారు.

షోపోన్ తన వైద్యులిచ్చిన రిపోర్టుల సంగ్రహాన్ని ఇలా తెలియజేసుకున్నాడు. " ఒక వైద్యుడు నేను ఖాయంగా చనిపోతానని తెలియజేశాడు. మరొక వైద్యుడు ఇక నేను మరణించడానికి అట్టే కాలవ్యవధి లేదన్నాడు. మూడో వైద్యుడు నేను గతించాననే ప్రకటించేశాడు. ఏంచేయను?" అని తన నిస్సహాయతను ప్రకటించాడు. తన పరిస్థితి తరచూ అంతగా విషమంగా లేదన్నమాట.

షోఫోన్ బాధతోనే గతించాడు. అయితేనేమి ఈ భూలోకవాసులకు గాంధర్వ గానమందించి వెళ్ళాడు. నిజానికి షోపోన్ యొక్క అలౌకిక సంగీతం అతడి బాధాతప్త హృదయం నుండి జనించింది. షోపోన్ మూలుగే మహాద్భుతమైన మ్యూజిక్ అయింది.

ఇదీ మనిషికి బాధ, దుఃఖం, కష్టం నేర్పించే గొప్ప పాఠం, అది అందించే గొప్ప బహుమానం.                      

                                     ◆నిశ్శబ్ద.