టీకాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది?
posted on Feb 17, 2025 5:34AM
.webp)
తెలంగాణ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది..? నేతలు వర్గాల వారిగా విడిపోయారా? తమ ఆధిపత్యం కోసం పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నారా? క్రమంగా ప్రభుత్వానికి ప్రజా మద్దతు తగ్గిపోతోందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నప్పటికీ ప్రజలు ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నెల రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ అంతర్గత సర్వేలో ఈ విషయంపై స్పష్టత వచ్చిదని కాంగ్రెస్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం లేకపోవటంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్న విషయాన్ని పార్టీ అధిష్ఠానం పెద్దలు గుర్తించారని అంటున్నారు. ఈ క్రమంలోనే పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కీలక మార్పులు చేసేందుకు రాహుల్ గాంధీ టీం రంగంలోకి దిగింది. ఇందులో భాగంగానే మొదటి వేటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి దీపాదాస్ మున్షీపై పడిందని కాంగ్రెస్ వర్గాలే చెబుతున్నాయి. ఆమె స్థానంలో రాహుల్ గాంధీకి అత్యంత నమ్మకస్తురాలైన మీనాక్షి నటరాజన్ ను తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జిగా రాహుల్ గాంధీ నియమించారు. దీపాదాస్ మున్షీని పక్కకు తప్పించడం పట్ల కాంగ్రెస్‌లోని మెజార్టీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు ఎక్కుపెడుతున్న వేళ.. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న వేళ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.
అయితే పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేయడంలో దీపాదాస్ మున్షీ ఫెయిల్ అయ్యారన్న విమర్శలు కూడా ఉన్నాయి. పార్టీలో సీనియర్లను ఏ మాత్రం పట్టించుకోకుండా తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకుని దీపాదాస్ మున్షీ ఏకపక్షంగా వ్యవహరించారని మెజార్టీ శాతం నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో కీలకంగా ఉన్నవారితో కూడా దీపాదాస్‌కు ఏ మాత్రం కోఆర్డినేషన్ లేదని కాంగ్రెస్ వర్గాల్లో టాక్ ఉంది. మరోవైపు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ నిర్ణయాలతో ప్రమేయం లేకుండా ఆమె సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని.. పార్టీలోనే కాక ప్రభుత్వంలోనూ ఆమె జోక్యం పెరిగిందన్న వాదన ఉంది. కొంతమంది అధికారులను తన దగ్గరకు పిలిపించుకుని పనులు చేయించుకున్నారన్న టాక్ ఉంది. అయితే గతంలో ఈ విషయంపై మీడియా ప్రశ్నించగా రేవంత్ రెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్ లు అదేంలేదని కొట్టిపారేశారు. కానీ, పార్టీలో ఏకపక్ష నిర్ణయాలకు తోడు ప్రభుత్వంలో జోక్యం పెరగడంతో ఆమెపై రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పెద్దలకు రాష్ట్ర పార్టీ నేతలు పలుసార్లు ఫిర్యాదులు సైతం చేశారని తెలుస్తోంది.
ముఖ్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ నేతలు పూర్తిగా విఫలమయ్యారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు రేవంత్ సర్కార్ అహర్నిశలు కృషి చేస్తుంది. ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్సుతోపాటు రైతు రుణమాఫీ, రైతు భరోసా నిధులు విడుదల, ఇంధిరమ్మ ఇళ్ల పథకం, ఇంధిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు ఇలా అనేక ప్రతిష్టాత్మక కార్యక్రమాలను అమలు చేస్తుంది. వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కాంగ్రెస్ నేతలు విఫలమవుతున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా.. రైతు రుణమాఫీని రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేసింది. కానీ, చివరికి ప్రభుత్వానికే చెడ్డపేరు వచ్చింది. దీనికి కారణం.. రుణమాఫీ అమలును ప్రజల్లోకి పార్టీ నేతలు బలంగా తీసుకెళ్లకపోవటమే. ఈ విషయంలో పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయ పర్చడంలో దీపాదాస్ మున్షీ విఫలమయ్యారన్న వాదన బలంగా ఉంది. దీనికితోడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆమెకు మధ్య గ్యాప్ ఏర్పడిందన్న చర్చకూడా కాంగ్రెస్ వర్గాల్లో ఉంది. దీంతో రాహుల్ గాంధీ టీం రంగంలోకిదిగి ఆమెను రాష్ట్ర పార్టీ ఇంచార్జి బాధ్యతల నుంచి తప్పించారని సమాచారం. కొత్త ఇన్‌ఛార్జ్‌గా మీనాక్షి నటరాజన్ నియమితులయ్యారు. మున్షీ స్థానంలో ఆమె ఫుల్ టైం కార్యకలాపాలు కొనసాగించనున్నారు.
రాహుల్‌గాంధీ టీమ్‌లో కీ పర్సన్‌గా మీనాక్షికి పేరుంది. అయితే, ఆమె ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. ముఖ్యంగా పార్టీ నేతల్లో ఐక్యత కోసం ఆమె ప్రయత్నాలు చేయాల్సి ఉంది. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం పెంచి ప్రభుత్వ పథకాలకు గ్రామ స్థాయి నుంచి విస్తృత ప్రచారం పొందేలా మీనాక్షి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. దీనికితోడు త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల సమయం నాటికి గ్రామ స్థాయిలో ప్రజల్లో ప్రభుత్వంపై నెలకొన్న వ్యతిరేకతను తొలగించి, కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుత పాలన అందిస్తున్నదన్న భావన ప్రజలలో కలిగేలా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవన్నీ సక్రమంగా జరగాలంటే.. పార్టీ నేతల మధ్య సఖ్యతతో పాటు.. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం కొనసాగేలా చేయాలి. ఆమేరకు మీనాక్షి నటరాజన్ ఏ మేరకు విజయవంతం అవుతారన్న అంశం కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తిని రేపుతుంది.
అయితే, మీనాక్షి నటరాజన్ రాహుల్ గాంధీకి విశ్వాసపాత్రురాలు. ఒక విధంగా చెప్పాలంటే ఆమె రాహుల్ కు నమ్మిన బంటు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలు ఏ మాత్రం తప్పుచేసినా నేరుగా రాహుల్ వద్దకు ఫిర్యాదులు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ నేతలు సైతం వర్గాలుగా విడిపోకుండా ఐక్యతారాగంతో పార్టీ బలోపేతంపై దృష్టిసారిస్తూ.. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తారని కాంగ్రెస్ కార్యకర్తలు భావిస్తున్నారు.