రుషికొండపై ప్యాలెస్ కాంట్రాక్టర్‌పై అంత ప్రేమెందుకో?
posted on Feb 16, 2025 9:35AM
.webp)
వైసీపీ హయాంలో జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు. తన కక్షసాధింపు చర్యలతో మనస్థత్వంతో ప్రతిపక్ష పార్టీల నేతలను, ప్రజలను ఇబ్బందులకు గురిచేశాడు. అష్టకష్టాలు పెట్టారు. జగన్ అండ చూసుకుని అవినీతి, అక్రమార్జన, కబ్జాలతో ఐదేళ్ల కాలంలో వైసీపీ నేతలు తమ జేబులు నింపుకున్నారు. జగన్ పాలన అంతా దోచుకో.. దాచుకో అన్న తీరుగా సాగింది. జగన్ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులకు నెలనెలా జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది. అయినా, ప్రభుత్వ ఖజానాను ఖర్చు చేస్తూ దాదాపు ఐదు వందల కోట్ల వ్యయంతో జగన్ రుషికొండపై పెద్ద ప్యాలెస్ కట్టారు. ప్రజాధనాన్ని వృథా చేయడంతోపాటు.. తన సొంత విలాసాల కోసం ఖరీదైన వస్తువులను అందులో అమర్చారు. ఒక పక్క రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేవని చెబుతూనే వందల కోట్లతో రుషికొండను తొలచి ప్యాలెస్ కట్టడం ప్రజలను ఆగ్రహానికి గురి చేసింది.
కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. లోటు బడ్జెట్ లోనూ ప్రతీనెల 1వ తేదీన పింఛన్లు అందించడంతోపాటు.. ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతాలు అందిస్తున్నారు. అయితే, కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ తమ అనుకూల కాంట్రాక్టర్లకు బిల్లులు విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా.. రుషికొండపై ప్యాలెస్ నిర్మాణం చేసిన కాంట్రాక్టర్ కు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలియకుండానే పలు పనుల్లో బిల్లుల చెల్లించడం రాష్ట్రంలో సంచలంగా మారింది.
రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బంది కారణంగా ఒకవైపు సీఎఫ్ఎంఎస్ (సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ) తలుపులు మూసేశారు. ఏ గుత్తేదారుడు కొత్తగా బిల్లులు సమర్పించుకోవటానికి వీలులేని పరిస్థితి కల్పించారు. ఉద్యోగుల జీతాలు, అత్యవసర బిల్లులు తప్ప ఎలాంటి వాటికి నిధులు విడుదల చేయొద్దని రాష్ట్రంలోని ఖజానా అధికారులకు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. కానీ, ఏ బిల్లులకూ డబ్బులు చెల్లించొద్దని ఆదేశాలు ఉన్నప్పటికీ జగన్ జమానాలో కీలకంగా వ్యవహరించి వందల కోట్ల రూపాయలు పనులు చేసిన డెక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్స్ ఇండియా ప్రైయివేట్ లిమిటెడ్ కు రూ.60.98కోట్ల బిల్లులను గురు, శుక్రవారాల్లో (ఫిబ్రవరి 13, 14)అధికారులు చెల్లించటం చర్చనీయాంశంగా మారింది. సదరు గుత్తేదారుడు ఎవరో కాదు. జగన్ రుషికొండపై నిర్మించిన ప్యాలెస్ నిర్మాణంలో రూ.452 కోట్లు పనుల్లో సింహభాగం పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్. అలాంటి వ్యక్తికి అధికారులు బిల్లులు చెల్లించడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. వాస్తవానికి రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. చిన్న, మధ్య తరహా గుత్తేదారులు బిల్లుల కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొంత మేర చిన్న గుత్తేదారులకు ఒక స్థాయి వరకు సంక్రాంతి సమయంలో బిల్లులు చెల్లించినా.. ఇంకా అనేక మంది బిల్లులు ఎప్పుడు క్లియర్ అవుతాయా అని ఎదురు చూస్తున్నారు. ఆర్థిక శాఖలోని అధికారులు రుషికొండపై ప్యాలెస్ నిర్మించిన గుత్తేదారు సంస్థ బిల్లులు చెల్లించడం అందుకే వివాదాస్పదంగా మారింది.
విశాఖలోని క్లస్టర్ వర్శిటీ పనులకు, పులివెందుల వైద్య కళాశాలకు సంబంధించి దాదాపు రూ. 60కోట్లకుపైగా చెల్లింపులు చేయడంతో అసలు ఆర్థిక శాఖలో ఏం జరుగుతోందన్న చర్చకు దారి తీసింది. చేసిన పనులకు ఎప్పుడైనా ప్రభుత్వం బిల్లులు చెల్లించాల్సిందే. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న వారికి బిల్లులు సొమ్మురాక చిన్నమొత్తాలు చెల్లించలేని పరిస్థితుల్లోనూ బడా గుత్తేదారులు రకరకాల మార్గాల్లో బిల్లులు చేజిక్కించుకోవటం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది. అయితే, రుషికొండ ప్యాలెస్ నిర్మాణ కాంట్రాక్టర్‌కు బిల్లుల చెల్లింపు వ్యవహరంపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సీరియస్ అయ్యారు. రుషికొండ ప్యాలెస్ కాంట్రాక్టర్‌కు ఎందుకు బిల్లులు చెల్లించారని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులపై పయ్యావుల మండిపడ్డారు. రుషికొండ ప్యాలెస్ కాంట్రాక్టర్‌కు బిల్లులు ఎందుకు చెల్లించారో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.
అధికారులు మాత్రం రుషికొండ ప్యాలెస్ నిర్మాణ పనుల బిల్లులను చెల్లించలేదని చెబుతున్నారు. అదే సంస్థ చేపట్టిన వేరే పనులకు బిల్లుల చెల్లింపు జరిగినట్టు వివరించారు. వేరే బిల్లులైనా సరే.. ఆ కాంట్రాక్టరుకు ఎందుకు చెల్లింపులు జరపాల్సి వచ్చిందో చెప్పాలంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఓసారి చెప్పినా వినకుంటే ఎలా అంటూ అధికారుల తీరుపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. అసలు ఆ కాంట్రాక్టరుకు జరిపిన చెల్లింపుల వివరాలు.. ఏయే పనులకు బిల్లులు చెల్లించారో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. చెల్లింపుల కోసం ఎవరైనా సిఫార్సు చేశారా..? లేక సొంత నిర్ణయమా..? అంటూ అధికారులను మంత్రి నిలదీశారు. ఇకపై ఆ కాంట్రాక్టరు చేపట్టిన ఎలాంటి పనులకైనా సరే బిల్లుల చెల్లింపులు చేపట్టవద్దని మంత్రి పయ్యావుల స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి లేదా తన దృష్టికి తీసుకురాకుండా బిల్లుల చెల్లింపులు జరిపితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందంటూ అధికారులను మంత్రి హెచ్చరించారు. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతున్నా.. అధికారుల తీరులో మార్పురాకపోవటం కూటమి నేతల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం మెతక వైఖరి కారణంగానే ఇలా జరుగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గీత దాటిన అధికారులపై కొరడా ఝుళిపించాలని కూటమి నేతలు కోరుతున్నారు.