గుర్తుకొస్తున్నారు...అభిమానులు మళ్ళీ గుర్తుకొస్తున్నారు...
posted on Oct 3, 2015 10:01PM
.jpg)
రాజకీయ నాయకుడు చిరంజీవి మళ్ళీ మెగా స్టార్ చిరంజీవిగా రూపాంతరం చెందుతున్నారు. కనుక ఆయన మళ్ళీ తన అభిమానులను గుర్తుచేసుకొంటున్నారు. నిజానికి వారి అండతోనే 2009 ఎన్నికలలో గెలిచి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోదామని కలలుగన్న చిరంజీవి ఎన్నికలలో వారినే ఆమడ దూరంలో నిలబెట్టి ముక్కు మొహం తెలియని రాజకీయనాయకులను చేరదీసి ఎందుకో టికెట్స్ ఇచ్చారు. కానీ వారు శల్యసారధ్యం చేసి ఆయన ప్రజారాజ్య రధాన్ని ఎన్నికల కురుక్షేత్రంలో క్రుంగదీసి వదిలేసి ఎవరి దోవ వారు చూసుకొన్నారు. కనీసం అప్పుడయినా ఆయనకు తన అభిమానులు గుర్తుకు రాలేదు. వారిని తన రాజ్యానికి దూరంగా పెట్టడం వలననే ఓడిపోయానని గ్రహించలేకపోయారు.
ఆ తరువాత మొహానికి ఎటువంటి రంగువేసుకోకుండానే ప్రజలు అంతవరకు తనలో చూడని అనేక రంగులు రాజకీయాలలో ప్రదర్శించారు. అప్పుడూ ఆయనకి అభిమానుల అవసరం పడలేదు. కానీ రాష్ట్ర విభజన దెబ్బతో ఆయనకి మళ్ళీ అభిమానులు క్రమంగా గుర్తుకు రాసాగారు. అంతకు ముందు ఎన్నికలలో వారిని దూరంగా పెట్టినప్పటికీ నిరుడు జరిగిన ఎన్నికలలో వారిని మళ్ళీ దగ్గరకు తీసుకొనే ప్రయత్నం చేసారు. కానీ రాజకీయాలలో ఉన్నప్పుడు ఆయన విశ్వరూపం చూసి బెదిరిపోయిన అభిమానులు ఆయనచూసి పారిపోయారు. ఆయన స్వయంగా కాంగ్రెస్ రధం ఎక్కి ఎన్నికల శంఖారావం పూరించినా ఎవరూ ఊగిపోతూ పరిగెత్తుకొనివచ్చి ఆయన తరపున పోరాడేందుకు రాలేదు. అప్పుడే అభిమానులు చాలా హర్ట్ అయిపోయారనే సంగతి అర్ధం అయినట్లుంది.
మళ్ళీ ఇప్పుడు సినిమాల్లో నటించబోతున్నారు కనుక ఇప్పుడు అభిమానుల అవసరం ఇంకా పెరిగింది. అందుకే వారిని ప్రసన్నం చేసుకోనేందుకు బ్రూస్లీలో ఒక మంచి డైలాగ్ పెట్టారు. చిరంజీవికి, రామ్ చరణ్ తేజ్ కి మధ్యన సాగే డైలాగు ఇలాగ సాగుతుంది.
రామ్ చరణ్ తేజ్: “బాస్! మీ స్టామినాను, స్పీడ్ ను అందుకోవడం కష్టం!”
చిరంజీవి: నా స్టామినాకి, స్పీడుకి ఫ్యూయల్ నా అభిమానులే…మన అభిమానులే. నా కోసం ఎదురుచూస్తున్నారు. వాళ్ళకోసం వెళుతున్నా..బై.”