భార్యాభర్తలను మరింత దగ్గర చేసే మార్గాలు ఇవే..!
posted on Jun 13, 2024 9:30AM
ప్రతి జంట జీవితం పెళ్లితో ఎంతో సంతోషంగా మొదలవుతుంది. పెళ్లి తరువాత హనిమూన్ జరిగేవరకు అదొక ప్రపంచంలో ఉంటారు. ఆ తరువాత మెల్లగా వృత్తి, కుటుంబ బాధ్యతలలో పడిపోతారు. ఉద్యోగ ఒత్తిడులు, కుటుంబ బాధ్యతల కారణంగా భార్యాభర్తల మధ్య దగ్గరితనం కాస్త తగ్గడం మామూలే. ఇది అలాగే దీర్ఘకాలం కొనసాగితే భార్యభర్తలు ఇద్దరూ వేర్వేరు వ్యక్తులలా ఫీల్ అయ్యే పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు.. ఇద్దరి మద్య ఉండే బంధం బలహీనం అవుతుంది. అలా కాకుండా భార్యాభర్తలు ఎప్పుడూ కొత్తగా పెళ్లైనవారిలా సంతోషంగా సంతోషంగా ఉండాలంటే ఈ కింది పనులు తప్పక చెయ్యాలి.
టైం స్పెండ్ చేయాలి..
రోజువారీ జీవితం హడావిడిలో భాగస్వామితో సమయాన్ని గడపడంలో చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇద్దరి మధ్య వ్యక్తిగత బంధాన్ని, చనువును పునరుద్ధరించుకోవడానికి ఒకరికొకరు ప్రత్యేక సమయాన్ని కేటాయించుకోవాలి. సాధారణ రోజుల్లో రాత్రి సమయాలు, వారాంతపు సెలవులు లేదా రాత్రి పూట ఇద్దరూ కలసి వంట చేయడం, ఇద్దరూ కలసి భోజనం చేయడం, ఇద్దరూ కలసి షాపింగ్ చేయడం, పరధ్యానంగా ఉండకుండా ఒకరిని ఒకరు సంతోష పెట్టడం చేయాలి.
ఆశ్చర్యం..
భాగస్వాములు చేసే చిన్న పనులు ఇద్దరి మధ్య సాన్నిథ్యాన్ని నిలివి ఉంచుతాయి. ఒకరి పట్ల మరొకరికి ఎంత ప్రేమ ఉందో తెలిసేలా చేస్తాయి. ఒకరికొకరు సర్ప్రైజ్ ఇచ్చుకోవడం ఇద్దరి మధ్య బందాన్ని చాలా బలపరుస్తుంది. ఇవి పెద్ద పెద్దవి కానక్కర్లేదు. భర్త ఆఫీసు నుండి ఇంటికెళ్తూ బార్యకు నచ్చింది తీసుకెళ్లడం, భార్యకు నచ్చిన వంటకం నేర్చుకుని తయారు చేయడం వంటివి చేస్తే.. భార్య భర్త లంచ్ బాక్స్ లో అతనికి నచ్చిన ఆహారాన్ని పెట్టడం నుండి అతని ఆఫీసు ఒత్తిడిని అర్థం చేసుకుని అతనికి సహకరించడం వరకు చాలా ఉంటాయి.
కమ్యూనికేషన్..
చాలామంది మధ్య గొడవలు వచ్చేది, ఇద్దరి మధ్య దూరం పెరిగేది కమ్యూనికేషన్ సరిగా లేకపోవడం వల్లనే. భార్యాభర్తలు ఇద్దరూ ఓపెన్ గా మాట్లాడుకుంటే ఏ సమస్యలు అయినా పరిష్కారం అవుతాయి. ఒకరి ఆలోచనలు, ఒకరి ఆందోళనలు, ఒకరి అభిరుచులు, ఆశయాలు ఇలా ప్రతి ఒక్కటీ ఒకరితో మరొకరు చెప్పుకుని చర్చించుకోవడం వల్ల ఇద్దరి మధ్య అవగాహన పెరుగుతుంది. ఇది ఇద్దరి మధ్య బంధాన్ని లోతుగా పెంచుతుంది.
ప్రయత్నాలు..
కొత్త పని చేయడం ఎప్పుడూ సరదాగా ఉంటుంది. భార్యాభర్తలకు ఇద్దరికీ కొత్తగా ఉన్న పనిని ఇద్దరూ కలసి చేయడం, ఇద్దరూ కలసి దాన్ని నేర్చుకోవడం వల్ల ఇద్దరికీ ఒకరి సహకారం మరొకరికి అందుతుంది. ఇది ఇద్దరూ జీవితాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో ఇన్ డైరెక్ట్ గానే చెబుతుంది. అంతే కాదు.. ఏదైనా పనిలో భాగస్వామి తోడైతే ఆ పని చేయడంలో ఉండే వ్యత్యాసం కూడా అర్థమవుతుంది.
థ్యాంక్స్ చెప్పాలి..
రోజువారి పనులలో ఒకరి సహాయం మరొకరు తీసుకుంటూ ఉంటారు. ఒకరి సమస్యలు మరొకరు ఆలోచించి పరిష్కరించుకుంటూ ఉంటారు. చిన్న విషయమైనా సరే.. థ్యాంక్స్ చెప్పడం, ఒకరి పట్ల మరొకరికి ఉన్న ప్రేమను వ్యక్తం చేయడం, ఒకరిని మరొకరు పొగుడుకోవడం వంటివి ఇద్దరి మధ్య ఎమోషనల్ బాండింగ్ ను మరింత దృఢంగా మారుస్తాయి. ఇద్దరూ ఒకరి పట్ల మరొకరు గౌరవంగా ఉండేలా చేస్తాయి.
*రూపశ్రీ.