ఇక్కడి కుటుంబ వారసులు అమ్మాయిలు.. అత్తవారింటికి వెళ్లేది అబ్బాయిలు.. ఇదెక్కడంటే..!
posted on Jan 22, 2026 11:34AM

భారతదేశంలో వందల శతాబ్దాల నుండి కొన్ని నియమాలు, పద్దతులు నిర్ణయమైపోయి ఉన్నాయి. ముఖ్యంగా వివాహ వ్యవస్థ లో ఉన్న కొన్ని నియమాలను ఏ మతమైనా సరే.. తప్పకుండా పాటిస్తుంది. అలాంటి నియమాలలో వివాహం, వివాహం తర్వాత అమ్మాయి అత్తవారింటికి వెళ్లడం, అత్తవారింట్లో కుటుంబ సభ్యులకు సేవలు చేస్తూ జీవించడం ముఖ్యమైనది. అమ్మాయిల విషయంలో ఇలా ఉంటే.. అబ్బాయిలు తండ్రి తర్వాత కుటుంబానికి యజమాని అవుతారు. కుటుంబానికి వారసులుగా అబ్బాయిలనే పరిగణిస్తారు. ఎందుకంటే వారు తల్లిదండ్రులతోనే ఉంటారు కాబట్టి. కానీ భారతదేశంలోనే ఒక ప్రాంతంలో దీనికి వ్యతిరేకంగా జరుగుతోంది. అక్కడ అమ్మాయిలను కుటుంబ వారసులుగా పరిగణిస్తారు. అబ్బాయిలకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపుతారు. ఇంతకీ ఆ ప్రాంతం ఏది? అక్కడి విశేషాలేంటి? తెలుసుకుంటే..
ఖాసీ తెగ..
ఖాసీ తెగ ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయకు చెందినది. ఇక్కడి ప్రజలు పితృస్వామ్య నియమాలను కాకుండా మాతృస్వామ్య నియమాలను అనుసరిస్తారు. పితృస్వామ్య వ్యవస్థలలో కుమారులను వారసులుగా పరిగణిస్తారు, అయితే ఖాసీ తెగలో కుమార్తెలు వారసత్వాన్ని వారసత్వంగా పొందుతారు. వీరు మాతృస్వామ్య వ్యవస్థను అనుసరిస్తారు. అంటే కుమార్తెలు జీవితాంతం తమ తల్లి కుటుంబంతోనే ఉంటారు.
ఇంటి పేరు..
సాధారణంగా ప్రతి కుటుంబానికి తండ్రి ఇంటిపేరును మొదటి పేరు సంక్రమిస్తుంది. వివాహం తర్వాత కూడా ఆడిల్లలకు ఇంటిపేరు, గోత్రం మారుతాయని చెబుతారు. కానీ ఖాసీ తెగ వారి తల్లి ఇంటిపేరును కొనసాగిస్తుంది. ఈ తెగ దాని ప్రత్యేక సంస్కృతి కారణంగా ప్రపంచంలోని ఇతరుల నుండి భిన్నంగా ఉంటుంది.
అబ్బాయిలనే పంపిస్తారు..
శతాబ్దాలుగా వివాహం తర్వాత అమ్మాయిలను అత్తవారింటికి పంపే సంప్రదాయం కొనసాగుతోంది. కానీ ఖాసీ తెగలో ఈ సంప్రదాయం ఉండదు. ఇక్కడ వివాహం తర్వాత అమ్మాయిల ఇంటికి అబ్బాయిలను పంపిస్తారు. ఇక్కడి అబ్బాయిలు వివాహం తర్వాత వారి అత్తమామల ఇంటికి వెళతారు. అంతేకాదు.. అబ్బాయిలు ఇంటి పనులన్నీ చేస్తారు. అమ్మాయిలు బయట పని చేస్తారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే.. అబ్బాయిని అత్తారింటికి పంపడం అనే విషయం పై అతని కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులపై ఎలాంటి ఒత్తిడి ఉండదు. ఇక్కడ ఇది శతాబ్దాలుగా అమలులో ఉన్న సంప్రదాయం. ఈ తెగ వారు ఈ సంప్రదాయాన్ని సంతోషంగా అమలు చేస్తున్నారట.
ఖాసీ తెగ మాత్రమే కాదు.. ఇవి కూడా..
భారతదేశంలో ఖాసీ తెగతో పాటు, గారో తెగ, నాయర్ తెగ, తులువా తెగ, బోండా తెగలు మాతృస్వామ్య విదానాన్ని ఆచరిస్తారు. మేఘాలయ రాష్ట్రంలోని గారో కొండలలో నివసించే గిరిజన సమాజమైన గారో తెగలో, తండ్రి కాదు, తల్లి ఇంటిపెద్ద పాత్ర పోషిస్తుంది. ఇక్కడ కూడా, పిల్లలు తమ తల్లి ఇంటిపేరును ఉపయోగిస్తారు, చిన్న కుమార్తె తన తల్లి నుండి ఆస్తిని వారసత్వంగా పొందుతుంది. అంతేకాకుండా, కుమార్తెలను వివాహం తర్వాత అత్తారింటికి పంపించరట.
నాయర్ తెగ మరింత విభిన్నం..
నాయర్ తెగ మరింత ప్రత్యేకం. వారు స్వాతంత్య్రానికి పూర్వం నుంచే మాతృస్వామ్య వ్యవస్థలో నివసిస్తున్నారు. ఇక్కడ కూడా స్త్రీలే ఆధిపత్యం చెలాయిస్తున్నారు. స్త్రీలనే కుటుంబాలకు పెద్దలుగా పరిగణిస్తారు. వీరిని "తారవాడ్లు" అని పిలుస్తారు. ఇక్కడ పురుషులు ప్రత్యేక గదులలో నివసిస్తున్నారంటే ఆశ్చర్యపోతారు. కానీ ఇదే నిజం.
*రూపశ్రీ.